ఈశాన్యంలో ‘హిందుత్వ’పై మౌనం

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400కుపైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న భాజపా ఆయా ప్రాంతాలను బట్టి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

Published : 04 Apr 2024 15:48 IST

క్రిస్టియన్‌ ప్రాబల్య రాష్ట్రాలపై మోదీ, భాజపాల వ్యూహం
400+ లక్ష్యానికి ఈ ప్రాంతమూ ముఖ్యమేనని భావన
గువాహటి నుంచి నీరేంద్ర దేవ్‌

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400కుపైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న భాజపా ఆయా ప్రాంతాలను బట్టి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దేశంలోని అధిక రాష్ట్రాల్లో హిందుత్వపై ఆధారపడిన ఆ పార్టీ క్రిస్టియన్లు అధికంగా ఉండే ఈశాన్య రాష్ట్రాల్లో ఆ అంశానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. హింస చోటుచేసుకున్న మణిపుర్‌, మేఘాలయ, నాగాలాండ్‌, మిజోరంలలో ఈ విషయంలో అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తోంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో దర్యాప్తు సంస్థలను రంగంలోకి దించి ప్రతిపక్షాలను భయబ్రాంతులకు గురి చేస్తున్న భాజపా ఈశాన్యంలో ఆయా పార్టీలతో పొత్తులతో ముందుకు సాగుతోంది.

ఈశాన్యంలో 25 ఎంపీ సీట్లున్నాయి. అందులో 14 అస్సాంలోనే ఉన్నాయి. మేఘాలయ, మణిపుర్‌, త్రిపుర, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో రెండేసి సీట్లున్నాయి. మిజోరం, నాగాలాండ్‌, సిక్కింలలో ఒక్కో సీటు ఉన్నాయి.


మేఘాలయ..

క్రిస్టియన్ల ప్రాబల్యమున్న మేఘాలయలో పోటీ నుంచి భాజపా వైదొలగింది. ఇక్కడ ముఖ్యమంత్రి కన్రాడ్‌ కె సంగ్మా నేతృత్వంలోని నేషనల్‌ పీపుల్స్‌ పార్టీకి మద్దతిస్తోంది. ఆయన తన తండ్రి, లోక్‌సభ స్పీకర్‌ పీఏ సంగ్మా హయాం నుంచీ భాజపాతో ఉన్న బంధాన్ని ఓటర్లకు గుర్తు చేస్తున్నారు.


త్రిపుర..

త్రిపురలో అధికార భాజపా గట్టి పోటీని ఎదుర్కొంటోంది. టిప్రా మోతా పార్టీతో భాజపా పొత్తు పెట్టుకుంది. ఇక్కడ సీపీఎం, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేస్తున్నాయి. సీపీఎంకు ఒకప్పటి కంచుకోట అయిన ఈ రాష్ట్రంలో గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా గెలిచింది. ప్రస్తుతం త్రిపుర వెస్ట్‌ నుంచి భాజపా తరఫున బిప్లబ్‌ కుమార్‌ దేబ్‌ పోటీ చేస్తున్నారు. సిట్టింగ్‌ ఎంపీ, కేంద్ర మంత్రి ప్రతిభా భౌమిక్‌కు ఈసారి టికెట్‌ దక్కలేదు. త్రిపుర ఈస్ట్‌ నుంచి సీపీఎం పోటీ చేస్తోంది. ఆ పార్టీ రాజేంద్ర రియాంగ్‌ను బరిలోకి దింపింది. ఆయనతో భాజపా మద్దతిస్తున్న టిప్రా మోతా పార్టీ అధినేత సోదరి, రాజ వంశీకురాలు కృతీసింగ్‌ దేబ్‌బర్మ తలపడుతున్నారు.


సిక్కింలో..

సిక్కింలో బహుముఖ పోటీ నెలకొంది. అధికార సిక్కిం క్రాంతికారీ మోర్చా సిట్టింగ్‌ ఎంపీ ఇంద్ర హంగ్‌ సుబ్బాను బరిలో దింపింది. సిక్కిం డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ (ఎస్‌డీఎఫ్‌) మాజీ ఎంపీ ప్రేమ్‌ దాస్‌ రాయ్‌ను పోటీలో నిలిపింది. భాజపా తరఫున దినేశ్‌ చంద్ర నేపాల్‌ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ తరఫున గోపాల్‌ ఛెత్రి బరిలోకి దిగారు.


అస్సాం..

అస్సాంలోని 14 సీట్లకు 3 విడతల్లో పోలింగ్‌ జరగనుంది. ఇందులో 5 సీట్లకు ఈ నెల 19న తొలి విడతలో పోలింగ్‌ జరుగుతుంది. ఈ విడతలో కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ భవితవ్యం తేలనుంది. ఆయన దిబ్రూగఢ్‌ నుంచి పోటీ చేస్తున్నారు. 2004, 2009లో ఆయన అస్సాం గణ పరిషత్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. జోర్హాట్‌ నుంచి కాంగ్రెస్‌ నేత గౌరవ్‌ గొగొయ్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2014కు ముందు ఇది కాంగ్రెస్‌కు కంచుకోట. 2014, 2019లలో భాజపా ఇక్కడ గెలిచింది.


మిజోరం..

మిజోరంలో భాజపాకు పెద్దగా బలం లేదు. అధికార జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (జెడ్‌పీఎం) లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఆ పార్టీ తరఫున తొలిసారిగా రిచర్డ్‌ వన్‌లాల్‌మంగైహా బరిలో నిలిచారు. గత నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా భాగస్వామ్య పక్షం మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌) ఓటమి పాలైంది. ఈ పార్టీ రాజ్యసభ సభ్యుడు కె వన్‌లాల్‌వేనాను పోటీకి నిలిపింది. భాజపా ఇక్కడ సొంతంగా పోటీ చేస్తోంది. ఆ పార్టీ తరఫున వన్‌లాల్‌ మౌకా బరిలో నిలిచారు. పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ ప్రముఖ సింగర్‌, గీత రచయిత రీటా మాల్‌సామిని బరిలో నిలిపింది. భాజపా నేత ఛాంగ్తే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జెడ్‌పీఎం.. భాజపాతో విభేదిస్తోంది. కాంగ్రెస్‌ ఇక్కడ నామమాత్రంగా ఉంది.


అరుణాచల్‌ ప్రదేశ్‌..

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని రెండు లోక్‌సభ స్థానాలకు, 50 అసెంబ్లీ సీట్లకు తొలి విడతలోనే ఈ నెల 19వ తేదీన పోలింగ్‌ జరగనుంది. ఇప్పటికే ఇక్కడ 10 సీట్లను భాజపా ఏకగ్రీవంగా గెలుచుకుంది. మరికొన్ని చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో భాజపా విజయం అక్కడ నల్లేరుపై నడకేనని భావిస్తున్నారు. ప్రధాని నేతృత్వంలో తమ పార్టీ విజయానికి ఏకగ్రీవాలే సంకేతమని ముఖ్యమంత్రి పెమాఖండూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు వెస్ట్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి నబంతుకీతో తలపడుతున్నారు. 2019లో రిజిజు 1,74,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు.


నాగాలాండ్‌..

నాగాలాండ్‌లోని ఒకే ఒక లోక్‌సభ స్థానానికి ఈ నెల 19నే పోలింగ్‌ జరగనుంది. అధికార నేషనలిస్టు డెమోక్రాటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (ఎన్‌డీపీపీ) తరఫున కొత్త అభ్యర్థి చుంబెన్‌ మర్రి పోటీ చేస్తున్నారు. ఆయనకు భాజపా మద్దతు పలుకుతోంది. ఇక్కడ కాంగ్రెస్‌కు పెద్దగా బలం లేదు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటునూ గెలుచుకోలేకపోయింది.


మణిపుర్‌లో..

హిందూ మతానికి చెందిన మైతేయ్‌లు అధికంగా ఉండే ఇన్నర్‌ మణిపుర్‌ నియోజకవర్గం నుంచి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బసంత కుమార్‌ సింగ్‌ భాజపా తరఫున పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి ఏకే బిమల్‌ రంగంలో ఉన్నారు. నాగా, కుకీ క్రిస్టియన్‌ గిరిజనులు అధికంగా ఉండే ఔటర్‌ మణిపుర్‌ సీటును భాగస్వామ్య పక్షం నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌కు (ఎన్‌పీఎఫ్‌) భాజపా కేటాయించింది. ఎన్‌పీఎఫ్‌ తరఫున మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి కచ్చు తిమోతీ జిమిక్‌ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎన్‌పీఎఫ్‌ తరఫున పోటీ చేసి గెలిచిన లోర్హో ఎస్‌ ఫోజ్‌కు ఈసారి టికెట్‌ దక్కలేదు. ఆయన భాజపా అభ్యర్థిని ఓడించారు. కాంగ్రెస్‌ మూడో స్థానంలో నిలిచింది. 2023లో హింసతో అట్టుడికిన మణిపుర్‌లో కుకీలు ఎవరికి మద్దతిస్తారనేది ఆసక్తికరంగా మారింది. 2023లో మిజోరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ వెళ్లలేదు. కుకీలతో మిజోలకు తెగల సంబంధం ఉండటంతో ఆయన జాగ్రత్తపడ్డారు.

ఈసారీ మణిపుర్‌లో మోదీ ప్రచారం చేస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఇన్నర్‌ మణిపుర్‌ మొత్తం, ఔటర్‌ మణిపుర్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ నెల 19వ తేదీనే తొలి విడతలో భాగంగా పోలింగ్‌ జరగనుంది. మిగిలిన ప్రాంతాల్లో రెండో విడతలో 26వ తేదీన పోలింగ్‌ జరగనుంది. ఇప్పటికీ పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న వారు ఓట్లు వేసేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. డబ్బు, కండబలానికి లొంగకుండా ఈసారి ఇన్నర్‌ మణిపుర్‌ ప్రజలు రాష్ట్రాన్ని రక్షించుకోవాలని కాంగ్రెస్‌ అభ్యర్థి బిమల్‌ కోరుతున్నారు. ఇక్కడ ఆరుగురు పోటీ చేస్తున్నారు.

ఔటర్‌ మణిపుర్‌లో కాంగ్రెస్‌ నుంచి ఆల్‌ఫ్రెడ్‌ కన్నగం ఎస్‌ ఆర్ధర్‌ పోటీ చేస్తున్నారు. ఇద్దరు స్వతంత్రులు బరిలో ఉన్నారు. ఇక్కడ ఎన్‌పీఎఫ్‌ అభ్యర్థికి గట్టి పోటీయే ఉంది. సేనాపతి, నాగాల ప్రాబల్యం ఉన్న ఉఖ్రుల్‌ జిల్లాలో స్వతంత్రులు ఆయనకు సవాలు విసురుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని