సానుభూతి కోసం శవరాజకీయాలు జగన్‌కు అలవాటే

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, అధికార యంత్రాంగాన్నీ ఒకటే అడుగుతున్నా. అధికార పార్టీ డ్రామాలు ఆడుతుంటే మీరు కూడా సహకరిస్తారా? ఒక్క నెల ఇంటికి వెళ్లి పింఛను ఇవ్వలేనంత అసమర్థులా? గ్రామ సచివాలయాల్లో 1.26 లక్షల మంది సిబ్బంది ఉన్నారు.

Published : 04 Apr 2024 06:28 IST

2019లో బాబాయ్‌ హత్య, కోడికత్తి.. ఇప్పుడు పింఛన్ల డ్రామా ఆడుతున్న సీఎం
ఇంటింటికీ వెళ్లి పింఛను ఇవ్వలేనంత అసమర్థులా అని సీఎస్‌కు సూటి ప్రశ్న
తెదేపా అధికారంలోకి వచ్చిన  మొదటి నెలలోనే ఇంటి వద్దకు  రూ.4 వేల పింఛను
రావులపాలెం, ద్రాక్షారామ ప్రజాగళం సభల్లో తెదేపా అధినేత చంద్రబాబు


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, అధికార యంత్రాంగాన్నీ ఒకటే అడుగుతున్నా. అధికార పార్టీ డ్రామాలు ఆడుతుంటే మీరు కూడా సహకరిస్తారా? ఒక్క నెల ఇంటికి వెళ్లి పింఛను ఇవ్వలేనంత అసమర్థులా? గ్రామ సచివాలయాల్లో 1.26 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. ఒక గ్రామంలో సగటున 45 మంది పింఛనుదారులు ఉన్నారు. రోజుకు 20 మందికి పంపిణీ చేస్తే రెండ్రోజుల్లో ఇంటింటికీ వెళ్లి ఇచ్చే అవకాశం ఉంది. ప్రతిపక్షాల మీద బురద చల్లడానికే ఇలా చేస్తున్నారు.

‘తెదేపా అధికారంలోకి రాగానే ప్రతి నెల 1వ తేదీన ఇంటికే వచ్చి రూ.4,000 పింఛను ఇచ్చే బాధ్యత మాది. గత ఎన్నికల్లో తెదేపా గెలిచి ఉంటే మొదటి నెలలోనే రూ.3 వేల చొప్పున పింఛను ఇచ్చేవాళ్లం. జగన్‌ ఏడాదికి రూ.250 చొప్పున పెంచుతూ రూ.3 వేలు ఇచ్చేసరికి దిగిపోతున్నారు. జగన్‌ వద్ద ఖజానా ఖాళీ అయిపోయింది. 3వ తేదీ దాటినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వట్లేదు’.

‘జగన్‌ నన్ను పశుపతి అని అన్నారు. పశుపతి అంటే విశ్వాన్ని రక్షించిన పరమశివుడు. మానవాళిని రక్షించడం కోసం గరళాన్ని మింగిన శివుడిలా.. ప్రజల కోసం నేను శివుడి అవతారమెత్తుతా. ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తా.. ఎన్ని దాడులు అయినా ఎదుర్కొంటా.. బుల్లెట్‌ మాదిరిగా దూసుకొస్తా.. ప్రజలను కాపాడే విషయంలో మాత్రం వెనక్కి తగ్గను. రాష్ట్రాన్ని జగన్‌ అనే రాక్షసుడి నుంచి కాపాడుకుంటా.’

‘2019లో బాబాయ్‌ను గొడ్డలితో చంపేసి సానుభూతితో గెలిచిన వ్యక్తి ఈ జగన్‌మోహన్‌రెడ్డి.. అవునా.. కాదా? ఇప్పుడు ఆయన చెల్లెలే చెప్పింది. నన్ను ఎన్నికల్లో పోటీ చేయమని వివేకా అడిగినందుకే చంపారని. ఆయన ఆత్మశాంతి కోసం పోటీ చేస్తానని చెప్పింది. అప్పట్లో బాబాయ్‌ను చంపి, కోడికత్తి డ్రామా ఆడి సానుభూతి పొందావు. ఇప్పుడు వృద్ధులను చంపేసి డ్రామాలు ఆడాలనుకుంటున్నావా? కోడికత్తి కమల్‌హాసన్‌..’’

రావులపాలెంలో నిర్వహించిన ప్రజాగళం సభలో తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు


ఈనాడు, రాజమహేంద్రవరం, కాకినాడ: పేదలు, దివ్యాంగులు, వితంతువులకు నెలకు రూ.35 పింఛను ఇచ్చే పథకాన్ని ఎన్టీఆర్‌ ప్రారంభించారని, 2014లో తెదేపా రూ.200 నుంచి రూ.2 వేలకు పెంచిందని, మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.4 వేలు ఇంటి వద్దే అందజేస్తామని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. తాజాగా పింఛన్ల విషయంలో అధికార పార్టీ ఓట్ల కోసం నీచమైన రాజకీయం చేసే స్థాయికి దిగజారిపోయిందని ధ్వజమెత్తారు. డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, రామచంద్రాపురం నియోజకవర్గంలోని ద్రాక్షారామలో బుధవారం నిర్వహించిన ‘ప్రజాగళం’ సభల్లో చంద్రబాబు మాట్లాడారు. తెదేపా హయాంలో రూ.2 వేలు పింఛను అందుకున్న వృద్ధులకు అన్నక్యాంటీన్‌లో రూ.5కే భోజనం లభించేదని, నెలకు రూ.450తో మూడుపూటలా కడుపు నిండా తినేవారని, మిగిలిన డబ్బులతో గౌరవంగా బతికేవారని గుర్తు చేశారు. అలాంటి వృద్ధులతో ముఖ్యమంత్రి జగన్‌ శవరాజకీయాలు చేస్తూ దుర్మార్గమైన కార్యక్రమాన్ని చేపడుతున్నారని మండిపడ్డారు.

ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డ అని చెప్పుకొనే వ్యక్తి

‘రైతులకు జగన్‌ కేవలం రూ.7,500 ఇస్తున్నారు. మిగతా రూ.6 వేలు కేంద్రం ఇస్తోంది. ఆ విషయం దాచేసి  అంతా తానే ఇస్తున్నట్లు.. ఎవరికో పుట్టిన బిడ్డ.. నా బిడ్డ అని చెప్పుకొనే తప్పుడు వ్యక్తి జగన్‌’ అని విమర్శించారు. ‘ఒకసారి పిల్లాడు గంజాయికి అలవాటుపడితే మన చేతిలో ఉండడు. జాతిని నిర్వీర్యం చేసే వ్యక్తి జగన్‌.. రాష్ట్రాన్ని ఇలా దొంగలకు అప్పగిస్తారా? లేదా కాపాడుకుంటారా? మీరే ఆలోచించాలి’ అని ప్రజలకు చంద్రబాబు సూచించారు.

తొలి సంతకం మెగా డీఎస్సీపైనే..

‘‘నేను 14 ఏళ్లు సీఎంగా ఉండి 8 డీఎస్సీలు, ఎన్టీఆర్‌ మూడు డీఎస్సీలు నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయుల్లో 75% మందిని తెదేపా హయాంలోనే నియమించాం. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ఫైలు పైనే తొలి సంతకం చేస్తాను. వాలంటీర్ల వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు.. ఆ ముసుగులో రాజకీయం చేయడాన్ని వ్యతిరేకిస్తాను. కొందరు వాలంటీర్లను రెచ్చగొట్టి రాజీనామాలు చేయించి వైకాపా కార్యకర్తల్లాగా మారుస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పరదాల వీరుడిని నిలదీయండి..

పరదాల ముసుగులో అయిదేళ్లు తిరిగి ఇప్పుడు బస్సులో మీవద్దకు వస్తున్న జగన్‌ను నిలదీయాలి. రాష్ట్రంలో గుత్తేదారులకు రూ.95 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికి 43 మంది ఆత్మహత్య చేసుకున్నారు. నిత్యం పచ్చదనంతో ఉండే కొత్తపేట.. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాఫియాతో ముఠాలకు అడ్డాగా మారింది. లంక భూముల్లో మట్టి తవ్వకాలు, లేఅవుట్‌ వేయాలన్న ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిన దుస్థితి ఏర్పడింది’ అని మండిపడ్డారు. బహిరంగ సభల్లో అమలాపురం పార్లమెంట్‌ తెదేపా అభ్యర్థి గంటి హరీష్‌మాథుర్‌, కొత్తపేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థి బండారు సత్యానందరావు, రామచంద్రాపురం అసెంబ్లీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజల కోసమే అవమానాలు భరిస్తున్నా..: ‘జగన్‌ ప్రభుత్వంతో పడరాని అవమానాలు పడుతున్నా.. శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడ్డా. నా తమ్ముళ్లను జైల్లో పెట్టినప్పుడు, పేదల ఆస్తులు లాగేసుకున్నప్పుడు వారితో పాటు నేనూ బాధపడ్డా. కానీ ఎప్పుడూ రాజీపడలేదు. 2003లో నన్ను చంపడానికి ప్రయత్నించారు. సాక్షాత్తూ వేంకటేశ్వరస్వామే దిగొచ్చి కాపాడారు. ఈ రాష్ట్రాన్ని బాగుచేయాలి.. జగన్‌ వంటి దుర్మార్గుడు వస్తారు.. ప్రజల్ని హింసిస్తారు. మళ్లీ కాపాడే శక్తి ఇవ్వాలని వేంకటేశ్వరస్వామి నాకు ప్రాణభిక్ష పెట్టారు’ అని చంద్రబాబు ఉద్వేగంగా మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు