50 శాతానికి మించి రిజర్వేషన్లు

పదేళ్ల విరామం తర్వాత ప్రస్తుతం మళ్లీ దేశ పాలనా పగ్గాలు చేపట్టాలన్న గట్టి పట్టుదలతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ సార్వత్రిక సమరం కోసం భారీ హామీలతో మ్యానిఫెస్టో విడుదల చేసింది.

Updated : 06 Apr 2024 06:34 IST

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కోటా పెంపు
మద్దతు ధరలకు చట్టబద్ధత
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా
కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో హామీల వర్షం
‘న్యాయ్‌ పత్ర’ పేరుతో విడుదల
అధికారంలోకి వస్తే అగ్నిపథ్‌ పథకం రద్దు
మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఏటా రూ.లక్ష నగదు సాయం
ఆరోగ్య సంరక్షణకు రూ.25 లక్షల దాకా నగదురహిత బీమా
మళ్లీ పూర్తిస్థాయి రాష్ట్రంగా జమ్మూకశ్మీర్‌
విద్యారుణాల మాఫీ..

దిల్లీ: పదేళ్ల విరామం తర్వాత ప్రస్తుతం మళ్లీ దేశ పాలనా పగ్గాలు చేపట్టాలన్న గట్టి పట్టుదలతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ సార్వత్రిక సమరం కోసం భారీ హామీలతో మ్యానిఫెస్టో విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు మరింత కోటా దక్కేలా.. వారి రిజర్వేషన్లపై ఇప్పుడున్న 50% పరిమితిని పెంచుతామని తెలిపింది. దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని, సైనిక నియామకాల కోసం ఎన్డీయే సర్కారు కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేస్తామని, పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు చట్టబద్ధత కల్పిస్తామని వాగ్దానం చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామనీ హామీ ఇచ్చింది. మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు ఏటా రూ.లక్ష నగదు సహాయం చేస్తామని పేర్కొంది. కేంద్ర మాజీ హోంమంత్రి పి.చిదంబరం ఛైర్మన్‌గా ఉన్న కమిటీ నేతృత్వంలో రూపొందించిన ఈ 45 పేజీల మ్యానిఫెస్టోను దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ‘న్యాయ్‌ పత్ర’ పేరుతో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల సమక్షంలో శుక్రవారం విడుదల చేశారు. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో హామీ ఇచ్చిన అయిదు న్యాయాలు, 25 గ్యారంటీలు ఇందులో ఉన్నాయని ఖర్గే అన్నారు. తమ మ్యానిఫెస్టో ప్రజావాణికి ప్రాతినిధ్యం వహిస్తోందని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, సంక్షేమ సూత్రాల ఆధారంగా దాన్ని తయారుచేసినట్లు చిదంబరం తెలిపారు. భాజపా పాలనలో పదేళ్లుగా ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదని, అన్ని రంగాల్లో విధ్వంసం చోటుచేసుకుందని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే పేదల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తామంటూ భరోసా ఇచ్చారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రాసిన ‘గీతాంజలి’లోని ‘‘ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో.. ఎక్కడ సగర్వంగా తలెత్తుకొని ఉండగలమో..’’ అంటూ సాగే వాక్యాలను మ్యానిఫెస్టోలో కాంగ్రెస్‌ ప్రస్తావించింది. లోక్‌సభ ఎన్నికల్లో తమపై విశ్వాసం ఉంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. మ్యానిఫెస్టోపై ఖర్గే, రాహుల్‌, జోడో యాత్ర ఫొటోలను ముద్రించారు.

అన్ని కులాలకూ ఈడబ్ల్యూఎస్‌ కోటా

ప్రస్తుతం విద్య, ఉద్యోగ రంగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లపై 50% పరిమితి అమల్లో ఉంది. ఆ పరిమితిని పెంచేలా రాజ్యాంగ సవరణ చేపడతామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) అందించే 10% కోటాను అన్ని కులాలు, వర్గాలవారికి ఎలాంటి వివక్ష లేకుండా అమలు చేస్తామని తెలిపింది.

‘జమిలి’కి తిరస్కరణ

జమిలి ఎన్నికల నిర్వహణ ఆలోచనను కాంగ్రెస్‌ తిరస్కరించింది. తాము అధికారంలోకి వచ్చాక- రాజ్యాంగం, ప్రజాస్వామ్య సంప్రదాయాలకు అనుగుణంగా లోక్‌సభతోపాటు ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎప్పుడు ఎన్నికలు జరగాలో అప్పుడే నిర్వహిస్తామంది. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకుగాను ఈవీఎంల్లోని ఓట్లతో వీవీప్యాట్‌ స్లిప్‌లను సరిపోల్చేలా ఎన్నికల చట్టాలను సవరిస్తామని తెలిపింది.

పుదుచ్చేరికి రాష్ట్ర హోదా

జమ్మూకశ్మీర్‌, పుదుచ్చేరిలకు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తామని హస్తం పార్టీ హామీ ఇచ్చింది. లద్దాఖ్‌లోని గిరిజన ప్రాంతాలను ఆరో షెడ్యూల్‌లో చేర్చేలా రాజ్యాంగ సవరణ చేపడతామని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామనీ పేర్కొంది. జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్‌సీటీ)-దిల్లీ మంత్రిమండలి సలహాలు, సహాయంతోనే లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పనిచేసేలా ఎన్‌సీటీ దిల్లీ ప్రభుత్వ చట్టం-1991ని సవరిస్తామని తెలిపింది.

ఉపాధి హామీ కూలి రోజుకు రూ.400

మ్యానిఫెస్టోలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల ప్రకారం- గ్రామీణ ఉపాధి హామీ పథకం రోజువారీ కూలిని రూ.400కు పెంచుతారు. తరగతి గదులు, గ్రంథాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వంటి ప్రభుత్వ ఆస్తుల నిర్మాణానికీ ఈ పథకం కింద నిధులు, కూలీలను ఉపయోగించుకునేందుకు అనుమతిస్తారు. పట్టణ పేదల కోసం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెడతారు. పట్టణ మౌలిక వసతుల పునర్నిర్మాణం, పునరుద్ధరణ పనుల్లో వారికి ఉపాధి కల్పిస్తారు.

నూతన విద్యా విధానంపై సమీక్ష

ఈ ఏడాది మార్చి 15 వరకు చెల్లించాల్సి ఉన్న విద్యారుణాలను (వడ్డీ సహా) మాఫీ చేస్తారు. ఆ సొమ్మును ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో కళాశాల విద్యార్థుల కోసం అమలు చేసిన విద్యారుణ కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌, మైనారిటీ వర్గాలవారికి రూ.7.5 లక్షల వరకూ పూచీకత్తులేని విద్యారుణాలు అందించాలని బ్యాంకులకు సూచిస్తారు. ఎన్డీయే సర్కారు తీసుకొచ్చిన కొత్త విద్యా విధానాన్ని సమీక్షిస్తారు. రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి, ఆ విధానానికి సవరణలు చేపడతారు. అవసరాన్నిబట్టి కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల సంఖ్యను పెంచుతారు.

అప్రెంటిస్‌షిప్‌ హక్కు

డిప్లొమా/గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసినవారి కోసం అప్రెంటిస్‌షిప్‌ హక్కు చట్టాన్ని తీసుకొస్తారు. ఇందులో భాగంగా వారందరికీ (పాతికేళ్లలోపు వయసున్నవారు) ఏడాదిపాటు అప్రెంటిస్‌షిప్‌ సదుపాయాన్ని కల్పిస్తారు. ఆ సంవత్సర కాలంలో వారికి రూ.లక్ష అందేలా చూస్తారు.

మ్యానిఫెస్టోలోని మరిన్ని ప్రధాన హామీలివీ..

 • కేంద్రప్రభుత్వ పరిధిలో వివిధ స్థాయుల్లో దాదాపు 30 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తారు.
 • 2025 నుంచి కేంద్రప్రభుత్వ ఉద్యోగాల్లో 50% వాటాను మహిళలకు కేటాయిస్తారు.
 • ప్రజలందరి ఆరోగ్య సంరక్షణ కోసం రాజస్థాన్‌ నమూనాలో రూ.25 లక్షల వరకు నగదురహిత బీమా అమలు చేస్తారు.
 • దేశవ్యాప్తంగా సామాజిక-ఆర్థిక సర్వేతోపాటు కులగణన నిర్వహిస్తారు.
 • వ్యక్తిగత గోప్యతను పరిరక్షించేలా పలు చట్టాలకు అవసరమైన సవరణలు చేపడతారు.
 • సమగ్ర జైలు సంస్కరణలను ప్రవేశపెడతారు. బెయిలుకు సంబంధించి మెరుగైన చట్టాన్ని తీసుకొస్తారు.
 • స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేస్తూ, పంటల మద్దతు ధరకు చట్టబద్ధ ప„మీ కల్పిస్తారు.
 • అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేసి.. అంతకుముందున్న తరహాలో నియామక ప్రక్రియలను చేపట్టేలా సాయుధ బలగాలను ఆదేశిస్తారు.
 • పార్లమెంటులో సరైన పరిశీలన/చర్చ లేకుండా భాజపా/ఎన్డీయే సర్కారు ఆమోదించిన చట్టాలను సమీక్షించి, అవసరమైన మార్పులు చేస్తారు.
 • ఎలక్టోరల్‌ బాండ్ల కుంభకోణం, ప్రభుత్వ ఆస్తులను నిర్లక్ష్యంగా విక్రయించడం, పెద్దనోట్ల రద్దు, పీఎం కేర్స్‌ కుంభకోణం, ఉన్నత స్థాయిలో నిఘా వైఫల్యాలు, ప్రధాన రక్షణ ఒప్పందాల్లో అవినీతిపై దర్యాప్తు జరిపిస్తారు.
 • తొలుత కేసులు ఉండి, భాజపాలో చేరిన తర్వాత చట్టానికి దొరక్కుండా తప్పించుకుంటున్నవారిపై దర్యాప్తులను తిరగదోడుతారు.
 • సుప్రీంకోర్టు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో సంప్రదింపులు జరిపి నేషనల్‌ జ్యుడిషియల్‌ కమిషన్‌ (ఎన్‌జేసీ)ను ఏర్పాటుచేస్తారు.
 • జీఎస్టీ స్థానంలో జీఎస్టీ 2.0ను తీసుకొస్తారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని