37 స్థానాలు భాజపాకు సవాలే

లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370కిపైగా స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో భాజపా ముందుకెళ్తోంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ సొంతంగా గెలిచిన 303 స్థానాల్లో 230 స్థానాలను లక్షకుపైగా మెజారిటీతో చేజిక్కించుకుంది.

Updated : 06 Apr 2024 06:33 IST

అందులో 13 యూపీలోనే..
వీటిని నిలబెట్టుకుంటేనే 370 లక్ష్యం సాధ్యం

ఈనాడు, దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370కిపైగా స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో భాజపా ముందుకెళ్తోంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ సొంతంగా గెలిచిన 303 స్థానాల్లో 230 స్థానాలను లక్షకుపైగా మెజారిటీతో చేజిక్కించుకుంది. 73 స్థానాల్లో లక్ష లోపు మెజారిటీ వచ్చింది. అందులోనూ 36 స్థానాల్లో 50వేల నుంచి 97వేల వరకు, మిగిలిన 37 స్థానాల్లో 50వేలలోపు మెజారిటీ మాత్రమే దక్కింది. ఇందులో 10 ఎస్సీ/ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలు. మిగిలినవి జనరల్‌ స్థానాలు. ఇక్కడ ఏ మాత్రం తప్పటడుగు వేసినా నష్టపోయే అవకాశం ఉందన్న ఉద్దేశంతో భాజపా నాయకత్వం ఈ స్థానాలపై ఎక్కువగా గురిపెట్టింది. ఉత్తర భారత దేశంలో ఇప్పటికే గరిష్ఠ స్థాయిలో సీట్లు దక్కించుకున్న ఆ పార్టీకి కొత్తగా వచ్చే స్థానాలేవీ పెద్దగా కనిపించడం లేదు. 370 స్థానాలను గెలుచుకోవాలంటే ఇప్పుడున్న వాటిని నిలబెట్టుకోవడంతోపాటు కొత్త వాటిని చేజిక్కించుకోవాలి. అందుకే పార్టీ నాయకత్వం గత ఎన్నికల్లో లక్షలోపు మెజారిటీ సాధించిన స్థానాలపై సూక్ష్మంగా గురిపెట్టి అభ్యర్థులను మార్చే పనిలో పడింది. 2019లో వీచిన నరేంద్ర మోదీ గాలితో దేశవ్యాప్తంగా భాజపా అభ్యర్థులు లక్షల మెజారిటీతో విజయ దుంధుబి మోగించిన సమయంలోనూ ఈ అభ్యర్థులు అత్తెసరు మెజారిటీతో బయటపడిన నేపథ్యంలో ఈసారి ఎంపికలో పార్టీ ఆచితూచి వ్యవహరించింది.

50వేల నుంచి లక్ష వరకు మెజారిటీతో గెలిచిన 36 మంది సిట్టింగ్‌ ఎంపీల్లో 13 మందిని మార్చింది. 50వేలలోపు మెజారిటీతో గట్టెక్కిన 37 మంది సిట్టింగ్‌ ఎంపీల్లో మరో 13 మందిని మార్చింది. అంటే లక్షలోపు మెజారిటీతో గట్టెక్కిన 73 మందిలో 35% మందిని పార్టీ పక్కనబెట్టింది. ఇందులో ఇంకా 6 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. 50వేలలోపు మెజారిటీతో గెలుపొందిన అభ్యర్థుల్లో దక్షిణాదిలోని కొప్పళ, చామరాజనగర, తుమకూరు మినహా మిగిలినవన్నీ ఉత్తర భారత దేశానికి చెందిన స్థానాలే. ఇందులో అత్యధికంగా ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి 13 స్థానాలున్నాయి. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ యూపీలో 42.63% ఓట్లతో 71 స్థానాలు గెలుచుకుంది. 2019 నాటికి ఓట్లు 49.97%కి పెరిగినా సీట్లు 62కి పడిపోయాయి. ఆ ఎన్నికల్లో బీఎస్పీ-ఎస్పీ కూటమిగా పోటీ చేయడంవల్ల భాజపా సీట్లను కోల్పోయింది. ఈ ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్‌ కలిసి పోటీ చేస్తుండటంవల్ల యూపీలో భాజపా గట్టి పోటీనే ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని