కంచు కోటలు లేవిక్కడ!

ఎన్నికలంటే తమిళనాడులోని రాజకీయ పార్టీలకు ఒకింత కంగారుగా ఉంటుంది. విజయం పార్టీల మధ్య, కూటముల మధ్య దోబూచులాడుతూ ఉంటుంది.

Updated : 08 Apr 2024 06:12 IST

తమిళనాట లోక్‌సభ స్థానాల్లో వరుసగా గెలవని పార్టీలు
ప్రతిసారీ విలక్షణ తీర్పునిస్తున్న ఓటర్లు

ఈనాడు, చెన్నై: ఎన్నికలంటే తమిళనాడులోని రాజకీయ పార్టీలకు ఒకింత కంగారుగా ఉంటుంది. విజయం పార్టీల మధ్య, కూటముల మధ్య దోబూచులాడుతూ ఉంటుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తుంది. ఈసారి తొలి విడతలోనే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుండటంతో కూటమి పార్టీలన్నీ జాగ్రత్తగా అభ్యర్థుల్ని ఎంపిక చేశాయి. ప్రచార రంగంలోకి దిగాయి. అయితే రాష్ట్రంలో ఏ పార్టీకి, అభ్యర్థికి కంచుకోటలు లేకపోవడం ఇక్కడి వైచిత్రి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఒక స్థానం నుంచి వరుసగా 3 సార్లు ఒకే పార్టీ గెలిచిన చరిత్ర తమిళనాడులో లేదు. రాష్ట్రంలో 39 లోక్‌సభ స్థానాలున్నాయి. విభజన తర్వాత జరిగిన 2009, 2014, 2019 ఎన్నికల్ని చూస్తే.. వరుసగా రెండు సార్లు ఒకే పార్టీ గెలవని నియోజకవర్గాలు ఏకంగా 27 ఉన్నాయి. ప్రధానంగా ఈ విజయాలు 11 నియోజకవర్గాల్లో డీఎంకే, అన్నాడీఎంకే మధ్య దోబూచులాడుతుండగా, మిగిలిన 16 చోట్ల డీఎంకే కూటమి పార్టీలు, అన్నాడీఎంకే మధ్య మారుతూ వస్తున్నాయి.

చీలికలతో అన్నాడీఎంకేకు చేటు

తమిళనాడులో అన్నాడీఎంకేకు మంచి ఓటు బ్యాంకు ఉంది. విజయం దోబూచులాడే ఈ మొత్తం 27 నియోజకవర్గాల్లో 26 చోట్ల 2014లో అన్నాడీఎంకే క్లీన్‌స్వీప్‌ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. 2016లో జయలలిత మరణానంతరం పార్టీ బలహీనపడుతూ వచ్చింది. 2019 ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శన కనబరిచింది. అన్నాడీఎంకేతో పాటు కూటమి పార్టీలు ఈ స్థానాల్లో ఒక్క సీటునూ సాధించలేకపోయాయి. ఇప్పుడు అదే అన్నాడీఎంకే పార్టీలో చీలికలొచ్చాయి. ముఖ్యమంత్రిగా చేసిన ఒ.పన్నీరు సెల్వంను పార్టీ బహిష్కరించగా, టీటీవీ దినకరన్‌ స్వయంగా ఏఎంఎంకే పార్టీ పెట్టారు. ఇప్పుడు వీరిరువురూ భాజపాతో జతకట్టారు. ఒక బలమైన పార్టీ రెండుగా చీలిపోవడం ఈసారి ఎన్నికల్లో డీఎంకేకి కలిసొచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


గత ఫలితాలను చూసుకుంటే..

  • 2009 లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏలో ఉన్న డీఎంకే కూటమికి జనం 27 ఎంపీ స్థానాల్ని కట్టబెట్టారు. మూడో ఫ్రంట్గా బరిలోకి దిగిన అన్నాడీఎంకే కూటమికి 12 స్థానాల్ని ఇచ్చారు. ఈ ఎన్నికలు జరిగే సమయానికి భాజపా పోటీలోనే లేదు. కమ్యూనిస్టు పార్టీలూ అప్పటి అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత వెంటే ఉండి  పోటీకి దిగాయి. వైగో పార్టీ మరుమలర్చి ద్రావిడ మున్నేట్ర కళగం (ఎండీఎంకే), రాందాస్‌ స్థాపించిన పట్టాళి మక్కల్‌ కట్చి (పీఎంకే) జయలలితకు అండగా నిలిచాయి. డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌, విడుదలై మక్కల్‌ కట్చి (వీసీకే), ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయూఎంఎల్‌) ఉన్నాయి.
  • జయలలిత కూటమికి 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు తిరుగులేని విజయాన్ని అందించారు. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఒక్కటే విడిగా పోటీ చేసింది. 39 స్థానాల్లో 37 చోట్ల రెండాకుల జెండా రెపరెపలాడింది. ఎన్డీయే కూటమిగా బరిలో దిగిన భాజపాకు సినీ నటుడు విజయకాంత్‌ స్థాపించిన దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం (డీఎండీకే) అండగా నిలిచింది. పీఎంకే, ఎండీఎంకే వెంటరాగా.. భాజపాతో కలిసి ఇందియ జననాయగ కట్చి (ఐజేకే), కొంగునాడు మక్కల్‌ దేశీయ కట్చి (కేఎండీకే), పుదియ నీది కట్చి (పీఎన్‌కే) పార్టీలు కమలం గుర్తు మీద బరిలోకి దిగాయి. డెమోక్రాటిక్‌ ప్రోగ్రెసివ్‌ అలయన్స్‌ కూటమిగా డీఎంకే, వీసీకే, ఐయూఎంఎల్‌, ఎంఎంకే, పుదియ తమిళగం (పీటీ) బరిలోకి దిగగా.. కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేసింది. వామపక్ష పార్టీలు వేరుగా బరిలోకి దిగాయి. ఎన్డీయే కూటమికి 2 స్థానాలే దక్కగా.. డీఎంకే కూటమికి, కాంగ్రెస్‌కు ఒక్క సీటూ రాలేదు.
  • 2019 ఎన్నికలొచ్చేసరికి పార్టీల, కూటముల వైఖరులు మారాయనే చెప్పాలి. డీఎంకే అధినేత కరుణానిధి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత మరణాల నేపథ్యంలో మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీ పగ్గాలు చేపట్టిన డీఎంకే అధినేత ఎం.కే.స్టాలిన్‌ వెంట కాంగ్రెస్‌, వామపక్షాలు నిలిచాయి. వీరు యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయన్స్‌ కూటమిగా ఏర్పడి.. అప్పటిదాకా ఎన్డీయేలో ఉన్న ఎండీఎంకే, కేఎండీకే, ఐజేకేలను తమతో కలుపుకొన్నారు. మరోపక్క అన్నాడీఎంకే వెంట తమిళిసై సౌందర రాజన్‌ నేతృత్వంలోని భాజపాతోపాటు పీఎంకే, డీఎండీకే, పీఎన్‌కే, పీటీ పార్టీలు, అలాగే తమిళ మానిల కాంగ్రెస్‌ (టీఎంసీ మూపనార్‌) నడిచొచ్చాయి. జయలలిత మరణం తర్వాత టీటీవీ దినకరన్‌ స్థాపించిన అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగమ్‌ (ఏఎంఎంకే), సోషల్‌ డెమోక్రాటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌డీపీఐ) మరో ఫ్రంట్గా బరిలోకి రాగా, సినీ నటులు కమల్‌ హాసన్‌ తెచ్చిన మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం), సీమాన్‌ తెచ్చిన నామ్‌ తమిళర్‌ కట్చి (ఎన్‌టీకే) పార్టీలు వేరుగా బరిలో దిగాయి. కరుణానిధి, జయలలిత మరణాల తర్వాత జరిగిన ఈ కీలక ఎన్నికల్లో డీఎంకే కూటమి విజయభేరి మోగించింది. ఏకంగా 38 స్థానాల్లో జెండా ఎగరేయగా, కేవలం ఒక్క స్థానంలో అన్నాడీఎంకే గెలిచింది.
  • యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయన్స్‌ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమిగా బరిలో ఉంది. గత ఎన్నికల్లో బరిలో ఉన్న పార్టీలే దాదాపు కూటమిలో ఉన్నాయి. ఇందులో ఉన్న ఐజేకే ఈసారి భాజపాతో చేతులు కలిపింది. ఎన్డీయేలో పీఎంకే, టీఎంసీ (ఎం), ఏఎంఎంకే పార్టీలు తమ గుర్తులతో పోటీ చేస్తుండగా, పీఎన్‌కే, ఐజేకే, ఇందియ మక్కల్‌ కల్వి మున్నేట్ర కళగం, తమిళగ మక్కల్‌ మున్నేట్ర కళగం కమలం గుర్తుపై పోటీ చేస్తున్నాయి.

వరుసగా రెండు సార్లు ఒకే పార్టీ గెలవని నియోజకవర్గాలు

ఉత్తర చెన్నై, మధ్య చెన్నై, కాంచీపురం (ఎస్సీ), అరక్కోణం, వేలూరు, కృష్ణగిరి, ధర్మపురం, తిరువణ్ణామలై, ఆరణి, కళ్లకురిచ్చి, నామక్కల్‌, నీలగిరి, కోయంబత్తూరు, దిండుక్కల్‌, పెరంబలూరు, కడలూరు, చిదంబరం (ఎస్సీ), నాగపట్టిణం (ఎస్సీ), తంజావూరు, శివగంగై, మదురై, విరుదు నగర్‌, రామనాథపురం, తూత్తుకుడి, తెన్‌కాశి, తిరునెల్వేలి, కన్యా కుమారి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని