కొడంగల్‌లో మెజార్టీ తగ్గించేందుకు భాజపా, భారాస కుట్ర

కొడంగల్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి మెజార్టీని తగ్గించేందుకు భాజపా, భారాసలు కలిసి కుట్ర పన్నుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Updated : 09 Apr 2024 06:43 IST

కాంగ్రెస్‌పై కొంతమంది కక్షగట్టి దుష్ప్రచారం చేస్తున్నారు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

కొడంగల్‌, కోస్గి, న్యూస్‌టుడే: కొడంగల్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి మెజార్టీని తగ్గించేందుకు భాజపా, భారాసలు కలిసి కుట్ర పన్నుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కొంతమంది కక్షగట్టి కాంగ్రెస్‌ను పడేయాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. సోమవారం వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో సీఎం మాట్లాడారు. పదేళ్లపాటు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ఈ ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పుడు మళ్లీ ఓటేస్తే చంద్రమండలానికి రాజవుతారా అని నిలదీశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. కేంద్రం నుంచి అధిక నిధులు సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు. మట్టి పని, బొగ్గు పని కోసం ఈ ప్రాంత ప్రజలు ముంబయి, పుణెలకు వలస వెళ్తోంటే వాటిని రెండుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కేసీఆర్‌ నివారించలేదని విమర్శించారు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.27 వేల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. అయినా ఒక్క ఎకరానికీ సాగునీరు అందించలేదన్నారు. ఈ ప్రాంత ప్రజలకు కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. నాడు చెన్నారెడ్డి తలపెట్టిన తెలంగాణ ఉద్యమంలో చీమలు, పాముల్లా చొరబడిన కొందరు.. తెలంగాణను పట్టిపీడించారని ఆరోపించారు. భారాస నేతలను గత ఎన్నికల్లో ప్రజలు చీదరించుకున్నా.. మరోమారు వారి ముందుకురావడం సిగ్గుచేటన్నారు. మహబూబ్‌నగర్‌కు ఏం చేశారని కేటీఆర్‌ పర్యటిస్తారని ప్రశ్నించారు. భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, ఎస్‌ఎల్‌బీసీ, దేవాదుల, ప్రాణహిత పూర్తి చేశారా అని ప్రశ్నించారు.

నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతలతో మహర్దశ

కొడంగల్‌ నియోజకవర్గానికి మెడికల్‌, ఇంజినీరింగ్‌, నర్సింగ్‌, వెటర్నరీ, మహిళా డిగ్రీ కళాశాలలు తెచ్చుకున్నామని రేవంత్‌ తెలిపారు. రూ.వందల కోట్లతో తండాలకు రోడ్లు తెచ్చుకుంటున్నామని ఆయన వివరించారు. కరవుతో అల్లాడుతున్న ఈ ప్రాంతానికి నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతలతో మహర్దశ రానుందని చెప్పారు. నాటి కాంగ్రెస్‌ హయాంలో డి.కె.అరుణ అనేక పదవులు చేపట్టారని.. కార్యకర్తలను మోసం చేసి వేరే పార్టీలోకి వెళ్లారన్నారు. పాలమూరు జిల్లాకు ఆమె చేసిన ప్రయోజనం ఏమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డికి కొడంగల్‌లో 50 వేల మెజార్టీ వచ్చేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు సంపత్‌, పార్టీ కొడంగల్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


సీఎం కాన్వాయ్‌లోని కారు టైరు పంక్చర్‌

పూడూరు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌ నుంచి కొడంగల్‌కు వెళ్తుండగా మన్నెగూడ బైపాస్‌ వద్దకు రాగానే కాన్వాయ్‌కు చెందిన ఓ కారు టైర్‌ పంక్చర్‌ అయింది. డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించి వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపారు. ఆ కారులో సీఎం లేరు. కాన్వాయ్‌లోని మిగతా కార్లు యథావిధిగా ముందుకు వెళ్లాయి. పంక్చర్‌ అయిన కారు టైరును సిబ్బంది మార్చి కొడంగల్‌కు వెళ్లారు. టైర్‌ పంక్చర్‌ కావటంతోనే కారు ఆగిందని, ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదని ఎస్సై మధుసూద]న్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని