పతుల కోసం సతుల ప్రచారం

మధ్యప్రదేశ్‌లో ఇద్దరు యువ నేతల సతీమణులు భర్తల విజయం కోసం మండుటెండల్లో చెమటోడుస్తున్నారు.

Updated : 09 Apr 2024 06:08 IST

 మధ్యప్రదేశ్‌లో చెమటోడుస్తున్న ఇద్దరు మహిళలు
ప్రజల్లోకి రాజ కుటుంబ మహిళ, అత్యంత సంపన్న అభ్యర్థి సతీమణి

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఇద్దరు యువ నేతల సతీమణులు భర్తల విజయం కోసం మండుటెండల్లో చెమటోడుస్తున్నారు. ఇందులో ఒకరు రాజ కుటుంబ మహిళకాగా.. మరొకరు అత్యంత సంపన్న అభ్యర్థి సతీమణి. వారే పౌర విమానయానశాఖ మంత్రి, గ్వాలియర్‌ రాజ కుటుంబ వారసుడు జ్యోతిరాదిత్య సింధియా సతీమణి ప్రియదర్శిని రాజె సింధియా, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ తనయుడు, ఎంపీ నకుల్‌ నాథ్‌ సతీమణి ప్రియా నాథ్‌. వారు వీధి వ్యాపారులను కలుస్తున్నారు. భజనల్లో పాల్గొంటున్నారు. సామాన్యుల వద్దకు వెళ్తున్నారు. పొలాల్లో పంట కోతల్లో పాల్గొంటున్నారు. ఈసారి జ్యోతిరాదిత్య, నకుల్‌ నాథ్‌ గట్టి పోటీని ఎదుర్కొంటుండటంతో వారి సతీమణులు రంగంలోకి దిగారు. ఛింద్వాడాలో తొలి విడతలో ఈ నెల 19వ తేదీన పోలింగ్‌ జరగనుంది. గుణలో మూడో విడతలో భాగంగా మే 7వ తేదీన పోలింగ్‌ జరుగుతుంది.


ప్రియదర్శిని రాజె సింధియా

వడోదరాలోని గైక్వాడ్‌ రాజ కుటుంబానికి చెందిన ప్రియదర్శిని రాజె సింధియా భర్త కోసం గుణలోని వీధుల్లో ప్రచారం చేస్తున్నారు. మార్కెట్లలో ఓటర్లను కలుస్తున్నారు. తన భర్త జ్యోతిరాదిత్య సింధియాకు 20ఏళ్లుగా ఈ నియోజకవర్గంతో ఉన్న బంధాన్ని గుర్తు చేస్తున్నారు. కొవిడ్‌ సమయంలో ఆయన అందించిన సేవలను వివరిస్తున్నారు.  


ప్రియా నాథ్‌

ఛింద్వాడా ఎంపీ నకుల్‌ నాథ్‌ మరోసారి కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిచారు. తనకు రూ.667 కోట్ల ఆస్తులున్నట్లు ఆయన ప్రకటించారు. అత్యంత సంపన్న అభ్యర్థుల్లో ఒకరుగా నిలిచారు. ఆయన సతీమణి ప్రియా నాథ్‌ ఇటీవల చౌరై పొలాల్లో పంటను కోస్తూ ప్రచారం చేశారు. నవేగావ్‌లో స్థానిక మహిళలతో కలిసి భక్తి గీతాలకు నృత్యం చేశారు. తన మామ కమల్‌ నాథ్‌ కుటుంబంతో 44 ఏళ్లుగా ఛింద్వాడాకు ఉన్న బంధాన్ని గుర్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని