ఆ 72 సీట్లు గెల్చుకోవాలని!

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా 370 స్థానాలు గెలుచుకోవాలని భాజపా లక్ష్యంగా పెట్టుకుంది. దాన్ని సాధించేందుకు పక్కా వ్యూహాలు రచిస్తోంది.

Updated : 10 Apr 2024 07:06 IST

భాజపా 370 మార్కును అందుకోవాలంటే అవే కీలకం

ఈనాడు, దిల్లీ: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా 370 స్థానాలు గెలుచుకోవాలని భాజపా లక్ష్యంగా పెట్టుకుంది. దాన్ని సాధించేందుకు పక్కా వ్యూహాలు రచిస్తోంది. 2019 నాటి ఎన్నికల్లో చాలా రాష్ట్రాల్లో అద్భుత ఫలితాలు సాధించి 303 సీట్లను తన ఖాతాలో వేసుకున్న కమలదళానికి.. ఇప్పుడు 370 స్థానాలు గెల్చుకునేందుకు ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయన్నదానిపై చర్చ జరుగుతోంది.

రెండో స్థానంలో నిలిచినవాటిపై దృష్టి

2019 ఎన్నికల్లో భాజపా దేశవ్యాప్తంగా 436 స్థానాల్లో పోటీ చేసింది. 303 స్థానాల్లో విజయభేరి మోగించింది. 72 నియోజకవర్గాల్లో రెండోస్థానంలో నిలిచింది. వాటిలో 37 స్థానాల్లో భాజపా ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. మిగిలిన 35 సీట్లలో కనీసం ఒక్కసారైనా గెలిచిన చరిత్ర ఉంది. ఈ 72 స్థానాల్లో ఎన్ని ఎక్కువ సీట్లు దక్కించుకుంటే.. ‘370’ లక్ష్యానికి చేరువయ్యేందుకు అవకాశాలు మెరుగుపడతాయి. వీటిలో 67 చోట్ల ప్రస్తుతం భాజపా నేరుగా బరిలో దిగుతుండగా, అయిదింట దాని మిత్రపక్షాలు పోటీ చేస్తున్నాయి. గత ఎన్నికల్లో భాజపా రెండో స్థానంలో నిలిచిన సీట్లు అత్యధికంగా (22) పశ్చిమబెంగాల్‌లో ఉన్నాయి. యూపీలో 15, ఒడిశాలో 11, తమిళనాడులో 5, తెలంగాణలో 3 ఇలాంటి స్థానాలు ఉన్నాయి. ఇందులో 5 స్థానాలను 3 లక్షలకుపైగా, 10 స్థానాలను 2 లక్షలకుపైగా, 22 స్థానాలను లక్షకుపైగా, 19 స్థానాలను 50 వేలకుపైగా, 10 స్థానాలను 10-50 వేల మధ్య, 6 స్థానాలను 10 వేల లోపు ఓట్ల తేడాతో కోల్పోయింది.

సిట్టింగుల చేరికతో పెరిగిన బలం

గత ఎన్నికల్లో పలుచోట్ల వేరే పార్టీల తరఫున గెలిచిన అభ్యర్థులు తర్వాత భాజపాలో చేరారు. కాంగ్రెస్‌ తరఫున విజయం సాధించిన గీతా కోడా (సింగ్‌భూమ్‌), శివసేన నుంచి గెలిచిన కళాబెన్‌ దేల్కర్‌ (దాద్రానగర్‌ హవేలీ) తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. తెలంగాణలో గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన డీకే అరుణ (మహబూబ్‌నగర్‌), కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి (చేవెళ్ల) మళ్లీ రంగంలో దిగారు. గతంలో స్వల్ప తేడాతో ఓడిపోయారన్న సానుభూతి ఈసారి వారికి కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌ స్థానంలోనూ కొత్త అభ్యర్థి మాధవీలత విస్తృత ప్రచారంతో పోటీని రక్తికట్టిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు