నన్ను భయపెట్టాలని చూస్తున్నారు

అవినీతిని కాపాడేందుకు పనిచేస్తున్న ‘ఇండియా’ కూటమి నేతలు దేశ ప్రగతి నిలిచిపోయేలా తనను దుర్భాషలాడి, బెదిరించాలని చూస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

Updated : 10 Apr 2024 06:15 IST

ఇండియా కూటమిపై మోదీ ధ్వజం
విపక్ష నేతల నోట ‘పాకిస్థాన్‌’ భాష

భోపాల్‌, పీలీభీత్‌: అవినీతిని కాపాడేందుకు పనిచేస్తున్న ‘ఇండియా’ కూటమి నేతలు దేశ ప్రగతి నిలిచిపోయేలా తనను దుర్భాషలాడి, బెదిరించాలని చూస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తాను మహాకాల్‌ భగవానుడి భక్తుడినని, ఎవరికీ భయపడబోనని చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ జిల్లాలో మంగళవారం ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి మోదీ మాట్లాడారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలు నవభారత నిర్మాణమనే యజ్ఞానికి ఓ సంకల్పం లాంటివని, ప్రజలు ఆశీర్వదిస్తే ఎన్డీయే తన మూడోవిడత పాలనలో భారీ, చారిత్రక నిర్ణయాలు తీసుకొంటుందన్నారు. కాషాయ సముద్రంలా తరలివచ్చిన ప్రజలను చూస్తుంటే జూన్‌ 4 నాటి పోలింగు ఫలితాలు ఇప్పుడే తెలిసిపోతున్నాయని చెప్పారు. ఆర్టికల్‌ 370 రద్దు వంటి ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను తాను పూర్తిచేసినపుడు విపక్షాలు పాకిస్థాన్‌ భాష మాట్లాడుతున్నాయని ధ్వజమెత్తారు.  

ఉత్తర్‌ప్రదేశ్‌లోని పీలీభీత్‌లో మంగళవారం ఎన్నికల సభలో మోదీ మాట్లాడుతూ.. బుజ్జగింపు రాజకీయాల కారణంగా కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లు పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. పీలీభీత్‌లో నివసిస్తున్న అటువంటి కుటుంబాలు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 1984లో సిక్కు సోదరుల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ అనుసరించిన వైఖరిని ఎవరూ మరచిపోలేరన్నారు. సెలవులు గడిపేందుకు విదేశాలకు వెళ్లే కాంగ్రెస్‌, ఎస్పీ నేతలకు దేశాన్ని సమైక్యపరచిన నర్మదా తీరంలోని సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని సందర్శించేందుకు కూడా సమయం లేదా అని ప్రశ్నించారు. చివరకు దేశమంతా ఆరాధించే ‘శక్తి’ స్వరూపాన్ని కాంగ్రెస్‌ అవమానించిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ప్రపంచ దేశాల నుంచి ఎన్నోసార్లు సాయం కోరారని, కొవిడ్‌ మహమ్మారి సమయంలో ప్రపంచానికే ఔషధ సాయం చేసే స్థాయికి భారత్‌ ఇపుడు ఎదిగిందని ప్రధాని మోదీ అన్నారు.

చెన్నైలో అట్టహాసంగా రోడ్‌షో

ఈనాడు, చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం చెన్నై టీనగర్‌ పాండీబజారులో రోడ్‌షో నిర్వహించారు. తమిళనాడు సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న ప్రధాని కమలం చిహ్నాన్ని ప్రదర్శిస్తూ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సుమారు 2 కి.మీ.ల మేర దారికి ఇరువైపులా కార్యకర్తలు ఆయనపై పూలవర్షం కురిపించారు. ఓపెన్‌టాప్‌ వాహనంపై మోదీ వెంట భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలైతోపాటు దక్షిణ చెన్నై అభ్యర్థిని తమిళి సై సౌందరరాజన్‌, మధ్య చెన్నై అభ్యర్థి వినోజ్‌ పి.సెల్వం, ఉత్తర చెన్నై అభ్యర్థి ఆర్‌.సి.పాల్‌ కనగరాజ్‌ తదితరులు ఉన్నారు. రాత్రికి చెన్నైలో బస చేస్తున్న ప్రధాని బుధవారం వేలూరు, కోయంబత్తూరులోని మేట్టుపాళయం వెళతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని