దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చిన నేత మోదీ.. కోయంబత్తూరు ప్రచార సభలో లోకేశ్‌

దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చిన దార్శనిక నాయకుడు ప్రధాని మోదీ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశంసించారు. తమిళభాష, సంస్కృతి సంప్రదాయాల్ని మోదీ ఎంతో గౌరవిస్తారని పేర్కొన్నారు.

Updated : 12 Apr 2024 07:10 IST

ఈనాడు, అమరావతి: దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చిన దార్శనిక నాయకుడు ప్రధాని మోదీ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశంసించారు. తమిళభాష, సంస్కృతి సంప్రదాయాల్ని మోదీ ఎంతో గౌరవిస్తారని పేర్కొన్నారు. తమిళనాడులోని కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి భాజపా తరఫున పోటీ చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామికి మద్దతుగా గురువారం పీలమేడు ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో లోకేశ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు మోదీ.. మేకిన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, తదితర కార్యక్రమాలు చేపట్టి సంపద సృష్టించారన్నారు. తమిళనాడు అభివృద్ధికి కేంద్రం రూ.2.31 లక్షల కోట్లు కేటాయించిందన్నారు. ప్రజాసేవ చేయడం కోసమే.. అన్నామలై ఐపీఎస్‌ ఉద్యోగాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చారని.. ఆయన్ని గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఏపీలో ఎన్డీయే గెలుపు ఖాయం

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే విజయం ఖాయమని, అధికారికంగా ప్రకటించడమే మిగిలిందని అన్నామలై ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల నుంచి పరిశ్రమలను ఆహ్వానించి, హైదరాబాద్‌ను ఐటీ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని కొనియాడారు. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం చేస్తున్నట్లుగానే, ఏపీలో జగన్‌ సర్కారు అక్రమ కేసులు పెట్టి చంద్రబాబుని అన్యాయంగా అరెస్ట్‌ చేసిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని