మీరు కొట్టే దెబ్బకు జగన్‌ అదిరిపోవాలి

‘‘అయిదేళ్ల నరకానికి.. సంక్షోభానికి.. సమస్యలకు.. కష్టాలకు చెక్‌ పెట్టే కీలక సమయం ఇది. జగన్‌ పాలనలో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా? ఏ ఒక్కరికైనా న్యాయం జరిగిందా? 2014-19లో రూ.200 వచ్చిన కరెంటు బిల్లు.. ఇప్పుడు రూ.2వేలు ఎవరి వల్ల వస్తోంది?

Updated : 12 Apr 2024 07:32 IST

అయిదేళ్ల నరకానికి, సంక్షోభానికి తెర దించేద్దాం
అంబాజీపేట, అమలాపురం సభల్లో తెదేపా అధినేత చంద్రబాబు
ప్రజలు గెలవాలంటే ఓటు చీలకూడదు
జనసేన పోటీలో లేనిచోట.. ఆ ఓటు తెదేపా, భాజపాలకు పడాలి: పవన్‌ కల్యాణ్‌


‘‘అయిదేళ్ల నరకానికి.. సంక్షోభానికి.. సమస్యలకు.. కష్టాలకు చెక్‌ పెట్టే కీలక సమయం ఇది. జగన్‌ పాలనలో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా? ఏ ఒక్కరికైనా న్యాయం జరిగిందా? 2014-19లో రూ.200 వచ్చిన కరెంటు బిల్లు.. ఇప్పుడు రూ.2వేలు ఎవరి వల్ల వస్తోంది? ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి.. చెత్త మీదా పన్ను వేసిన చెత్త సీఎం జగన్‌. 99% హామీలు నెరవేర్చానని గొప్పలు చెప్పుకొని మిమ్మల్ని ముంచేసిన ప్రభుత్వం మీకు కావాలా?’’

తెదేపా అధినేత చంద్రబాబు


‘జనసేన మద్దతుదారులకు, నాయకులకు విన్నవించుకుంటున్నా. మనం పోటీ చేయని చోట ఆ ఓటు తెదేపా, భాజపా, ఎన్డీయే కూటమికి వెళ్లాలి. కోపతాపాలకు పోకుండా దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించి ఓటెయ్యండి. నాలుగు దశాబ్దాల రాజకీయానుభవం ఉన్న చంద్రబాబు చెబితే తెదేపా వారి ఓట్లు మనకు బదిలీ అవుతాయి. జనసేన మద్దతుదారులు మీ ఓటు కచ్చితంగా వారికి బదిలీ చేయాలని అభ్యర్థిస్తున్నా.’’

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌


ఈనాడు, కాకినాడ, రాజమహేంద్రవరం: ‘ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు త్వరలో డిక్లరేషన్‌ తెస్తాం. జిల్లాల వారీగా ఎస్సీల వర్గీకరణ అడుగుతున్నారు. దామాషా ప్రకారం అందరికీ న్యాయం చేస్తాం’ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేట, అమలాపురంలో గురువారం నిర్వహించిన ‘ప్రజాగళం’ బహిరంగసభల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘అంబేడ్కర్‌, జ్యోతిరావు ఫులె, జగ్జీవన్‌రామ్‌ సాక్షిగా హామీ ఇస్తున్నా. బడుగు బలహీనవర్గాలకు న్యాయం చేసే బాధ్యత మాది. ఇక్కడ కాపుల్లోనూ పేదరికం ఉంది. వారికోసం ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చుపెట్టిన పార్టీ తెదేపా. ఈ ముఖ్యమంత్రి ఏడాదికి రూ.2వేల కోట్ల చొప్పున రూ.10వేల కోట్లు ఖర్చు పెడతానన్నారు. కనీసం రూ.10 కోట్లయినా ఖర్చుపెట్టారా..?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

బీసీల తలరాత మార్చేందుకే డిక్లరేషన్‌

‘బీసీ డిక్లరేషన్‌తో వారి తలరాత మారుతుంది. సబ్‌ప్లాన్‌తో బీసీలను ఆర్థికంగా పైకి తెస్తాం. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్‌ తెస్తాం. చట్టసభల్లో బీసీల రిజర్వేషన్‌ కోసం పోరాడతాం. ఆదరణకు రూ.5వేల కోట్లు ఖర్చు చేస్తాం. చంద్రన్న బీమాను రూ.10 లక్షలు చేసే బాధ్యత మాది’ అని చంద్రబాబు చెప్పారు. ‘ఒక్క ఛాన్స్‌ అంటే నమ్మి మీరంతా ఓట్లేశారు. మీలో బాధ, ఆవేదన, ఆక్రందన, అభద్రతాభావం కనిపిస్తున్నాయి. నేను, పవన్‌కల్యాణ్‌ మీకు భరోసా ఇవ్వడానికే వచ్చాం. ‘సిద్ధం’.. అంటున్న జగన్‌కు మరిచిపోలేని యుద్ధం ఇద్దామని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. దానికి మీరు సిద్ధమా..?’ అని ప్రశ్నించారు. ‘మీరు కొట్టే దెబ్బకు జగన్‌ అదిరిపోవాలి.. ఇంట్లో నుంచి బయటకు రాకుండా చితక్కొట్టే బాధ్యత మీది’ అని పిలుపునిచ్చారు. అమలాపురం లోక్‌సభ అభ్యర్థి హరీష్‌ మాథుర్‌, పి.గన్నవరం అసెంబ్లీ అభ్యర్థి సత్యనారాయణను భారీ ఆధిక్యంతో గెలిపించాలని కోరారు.

ఒక్క ఉద్యోగైనా బాగున్నారా..?

జగన్‌ దెబ్బకు రాష్ట్రమంతా భ్రష్టుపట్టిపోయిందని, అన్ని రంగాలూ దెబ్బతిన్నాయని చంద్రబాబు అన్నారు. విశాఖలో ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ శంకర్రావ్‌ తీవ్ర ఒత్తిడితో, ఆర్థిక ఇబ్బందితో తుపాకీతో కాల్చుకుని చనిపోయారని గుర్తుచేశారు. ‘పోలీసులూ.. మీకు ఇవ్వాల్సిన నిధులు ఇచ్చారా? సరెండర్‌ లీవ్‌, డీఏ, టీఏ, పీఆర్‌సీ డబ్బులు ఇవ్వడంలేదు. పీఎఫ్‌ డబ్బులనూ పెండింగ్‌లో పెడితే.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న శంకరరావు తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. రేపు మళ్లీ ఈ దుర్మార్గుడు వస్తే ఏమవుతుందో ఆలోచించుకోండి’ అని పోలీసులకు హితవు పలికారు.

త్రివేణి సంగమంలా కూటమి

ఈ ఎన్నికల్లో ఓటు బదిలీ చాలా కీలకం.. ప్రజలు గెలవాలంటే ఓటు చీలకూడదని పవన్‌కల్యాణ్‌ అన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌లోని 5 కోట్ల మందిని కాపాడడానికి త్రివేణి సంగమంలా భాజపా, తెదేపా, జనసేన కూటమి ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. జగన్‌ను ఇక్కడి నుంచి తరిమేస్తాం’ అని అన్నారు.  ‘తను వెళ్తున్న వాహనాన్ని క్లెమోర్‌మైన్లు పెట్టి లేపేస్తే కింద పడి, చొక్కా దులుపుకొని, ఏమాత్రం భయం లేకుండా ముందుకు నడిచి దశాబ్దాలపాటు రాజకీయాలు నడిపిన రాజకీయ దురంధరుడు చంద్రబాబు. సినిమాలు చేస్తే రూ.కోట్లు సంపాదించుకునే జీవితం నాది. ప్రతి అడ్డమైనవాళ్లూ తిడుతున్నా.. మీ భవిష్యత్తు కోసం అన్నీ భరిస్తున్నాం. ఒక్కసారి అడుగుతున్నా.. ఇంటికెళ్లి ఆలోచించుకోండి. కూటమికి ఓటేయండి’ అన్నారు. తాము అధికారంలోకి రాగానే జైభీం అనే పదానికి గౌరవం వచ్చేలా అంబేడ్కర్‌ విదేశీవిద్య తెస్తామన్నారు.

ఇలాంటి ప్రభుత్వం మీకు కావాలా?

‘ఆడబిడ్డలకు భద్రత లేని.. యువతకు ఉద్యోగాలు ఇవ్వని.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించని వైకాపా ప్రభుత్వం మీకు కావాలా? పచ్చటి కోనసీమలో కులాల మధ్య కలహాలు పెట్టి... సొంత మంత్రి ఇంటిని తగలబెట్టించుకునే ప్రభుత్వాన్ని చూశారు. కోనసీమలో శాంతిభద్రతలు బలంగా ఉండే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. శెట్టిబలిజలు, కాపులు, మాలలు, మాదిగలు, క్షత్రియ, వాడబలిజలు, మత్స్యకారులు.. బీసీవర్గాల్లో సంఖ్యాబలం లేని 127 కులాలవారు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ అన్యోన్యంగా ఉండాల్సిన సమయమిది’ అని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు.

వాలంటీర్లు రాజకీయాలకు అతీతంగా ఉండాలి

‘వాలంటీర్లలో కొద్దిమందే తప్పులు చేశారు. బుట్టలో రెండు పళ్లు కుళ్లిపోతే మొత్తం బుట్టంతా పాడైపోతుంది. వాలంటీర్లు రాజకీయాలకు అతీతంగా ఉండాలి. రైతుభరోసా కేంద్రాలు రైతులకు అండగా ఉంటాయనుకుంటే.. కాకినాడలోని మాఫియా డాన్‌ కుటుంబం చేతిలోకి వెళ్లిపోయాయి. జగన్‌ పెట్టుకున్న మాఫియా డాన్‌లను తన్ని తగలేసే వరకూ నిద్రపోము. చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని