అభ్యర్థి పేరే.. తొలి ప్రత్యర్థి!

ప్రధాన అభ్యర్థుల పేర్లను పోలిన స్వతంత్రులు బరిలో ఉంటే ఏమవుతుందో.. తమిళనాడులో 2016 అసెంబ్లీ ఎన్నిక పెద్ద గుణపాఠం నేర్పింది.

Updated : 12 Apr 2024 06:52 IST

అవే పేర్లతో స్వతంత్రుల పోటీ
తమిళనాడులో పలు లోక్‌సభ  స్థానాల్లో ఇదే పరిస్థితి..

ఈనాడు, చెన్నై: ప్రధాన అభ్యర్థుల పేర్లను పోలిన స్వతంత్రులు బరిలో ఉంటే ఏమవుతుందో.. తమిళనాడులో 2016 అసెంబ్లీ ఎన్నిక పెద్ద గుణపాఠం నేర్పింది. విడుదలై మక్కల్‌ కట్చి(వీసీకే) వ్యవస్థాపకుడు తోల్‌ తిరుమావళవన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 87 ఓట్లతో పరాజయం పాలయ్యారు. అప్పట్లో ఆయన కడలూరు జిల్లా కాట్టుమన్నార్‌ కోయిల్‌ స్థానానికి పోటీ చేశారు. బ్యాలెట్పై అదే పేరుతో ఉన్న టి.తిరుమావళవన్‌ అనే స్వతంత్ర అభ్యర్థికి 289 ఓట్లు పోలయ్యాయి. ఇదే ఆ స్థానం విజేతను నిర్ణయించింది. విజయం తారుమారైంది.

ప్రధాన పార్టీల్లో ఆందోళన..

తమిళనాడులో మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు తొలి విడతలోనే జరుగుతున్నాయి. దాదాపు అన్నిచోట్లా ఇండియా, ఎన్డీయే, అన్నాడీఎంకే కూటముల మధ్య పోరు నడుస్తోంది. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులకు స్వతంత్రుల నుంచి విచిత్రమైన చిక్కు వచ్చి పడుతోంది. ఆయా స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లతో స్వతంత్రులు బరిలో నిలిచారు. ఈ తరహా సవాలు ప్రధాన పార్టీలకు పలు లోక్‌సభ స్థానాల్లో ఎదురవుతోంది.

ఓట్లు చీల్చాలని..

వాస్తవానికి స్వతంత్రులకు ఓట్లు పెద్దగా రావు. కానీ ప్రధాన పార్టీల అభ్యర్థుల ఓట్లను చీల్చడంలో కీలకంగా ఉంటారు. ఓడించేందుకు, తమ ఓటు బ్యాంకును దెబ్బ తీసేందుకు ప్రత్యర్థి పార్టీలు ఈ రకమైన కుట్రను పన్నుతున్నాయని పలు నియోజకవర్గాల్లో ప్రధాన అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. పోటీలో ఉన్న స్వతంత్రులు కార్మికులు, గృహిణులు, పెద్దగా ఆస్తుల్లేని వారే ఉండటంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది. ప్రస్తుతం అన్నాడీఎంకే, డీఎంకే కూటముల అభ్యర్థుల్ని లక్ష్యంగా చేసుకుని ఒకే పేరుతో ఉన్న స్వతంత్రుల్ని దింపినట్లు కనిపిస్తోంది. అన్నాడీఎంకే కూటమి అభ్యర్థులు తమ పేర్లతో ఉన్నవారు 18 పార్లమెంటు స్థానాల్లో పోటీ పడుతుండగా, ఇండియా కూటమి అభ్యర్థుల పేర్లతో 14 స్థానాల్లో ఈ పరీక్ష కొనసాగుతోంది. ఎన్డీయే కూటమికి 6 చోట్ల ఈ పరిస్థితి ఉంది. కనీసం ఒకరి నుంచి గరిష్ఠంగా ఐదుగురు అవే పేర్లున్న స్వతంత్రులు బరిలో ఉన్నారు.


ఎత్తుగడ వెనుక అసలు సంగతి ఇదీ..

ఒక్కో ఈవీఎంలో 16 మంది అభ్యర్థుల పేర్లుంటాయి. అంతకు మించితే మరొక ఈవీఎంకు అవకాశమిస్తారు. ఎక్కడైతే అదనపు ఈవీఎంలకు అవకాశమిస్తున్నారో.. ఆయా స్థానాల్లో ప్రధాన అభ్యర్థి పేరును పోలిన స్వతంత్రులు పోటీ చేస్తున్నారు. మొదటి ఈవీఎంలో ప్రధాన అభ్యర్థుల పేర్లు పై వరుసలోనే రానున్నాయి. రెండో, మూడో ఈవీఎంలకు వచ్చేసరికి.. అదే పేరున్న స్వతంత్రులు పైకొచ్చే అవకాశముంది. ఫలితంగా ఓటర్లను గందరగోళానికి గురి చేయాలనేది ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. దీనివల్ల ఒకరికి వేయాల్సిన ఓటు మరొకరికి వెళ్లే ప్రమాదం లేకపోలేదు. రాష్ట్రవ్యాప్తంగా 950 మంది బరిలో ఉండగా 29 నియోజకవర్గాల్లో అదనపు ఈవీఎంల అవసరం పడుతోంది.

బాధితులవుతారా..?

  • పెరంబలూరు డీఎంకే అభ్యర్థి, రాష్ట్ర మంత్రి కె.ఎన్‌.నెహ్రూ తనయుడు కె.ఎన్‌.అరుణ్‌ నెహ్రూ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదే నియోజవర్గంలో అరుణ్‌ నెహ్రూ, ఎన్‌.అరుణ్‌ నెహ్రూ, జె.అరుణ్‌ నెహ్రూ పేర్లతో మరో ముగ్గురు స్వతంత్రులు బరిలో ఉన్నారు.
  • రామనాథపురంలో ఎన్డీయే తరఫున పోటీ చేస్తున్న ఒ.పన్నీరుసెల్వం పరిస్థితి మరీ దారుణం. ఇంటిపేరు ‘ఒ’తో కలుపుకొని ఆయన పేరుతో నలుగురు స్వతంత్రులు బరిలో ఉన్నారు. ఎం.పన్నీరు సెల్వం పేరుతో ఇంకొకరున్నారు. ఆరుగురు ఒకే పేరుతో పోటీ పడుతున్నారు.
  • వేలూరులోనూ అంతే. భాజపా అభ్యర్థి ఎ.సి.షణ్ముగం పేరుతో ఆరుగురు స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. ఇదే స్థానంలో అన్నాడీఎంకే అభ్యర్థి పశుపతి పేరుతోనే మరొకరున్నారు.
  • అత్యంత కీలకంగా మారిన కోయంబత్తూరు ఎన్నికలో డీఎంకే అభ్యర్థి గణపతి పి.రాజ్‌కుమార్‌కు పోటీగా స్వతంత్రులు అదే పేర్లతో ఐదుగురున్నారు. అన్నాడీఎంకే అభ్యర్థి సింగై జి.రామచంద్రన్‌ పేరును పోలిన ఎం.రామచంద్రన్‌, ఆర్‌.రామచంద్రన్‌, ఎన్‌.రామచంద్రన్‌, రామచంద్రన్‌ పేర్లతో కొందరు పోటీపడుతున్నారు.
  • కరూరు లోక్‌సభ స్థానానికి అత్యధికంగా 54 మంది బరిలో ఉన్నారు. సిట్టింగ్‌ ఎంపీ, కాంగ్రెస్‌ అభ్యర్థి జ్యోతిమణి పేరుతో ఇంకో ఇద్దరు బరిలో ఉన్నారు. శివగంగై కాంగ్రెస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ కార్తీ చిదంబరానికి పోటీగా కార్తీ పేరుతో ఇద్దరున్నారు. తిరుచ్చిలో ఎండీఎంకే అభ్యర్థి, వైగో కుమారుడు దురై వైగోకు పోటీగా.. దురై పేరు వచ్చేలా ముగ్గురు బరిలో ఉన్నారు.
  •  ధర్మపురి స్థానంలో డీఎంకే అభ్యర్థి ఎ.మణి పేరుతో నలుగురు, అన్నాడీఎంకే అభ్యర్థి అశోకన్‌ పేరుపై ఒకరు, పీఎంకే అభ్యర్థిని సౌమ్యా అన్బుమణికి పోటీగా సౌమ్యా పేరుతో ఇంకొకరు బరిలో ఉన్నారు. తిరువణ్ణామలై సిట్టింగ్‌ ఎంపీ, డీఎంకే అభ్యర్థి సి.ఎన్‌.అన్నాదురై పేరుతో ముగ్గురున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని