పవన్‌ హెలికాప్టర్‌ ప్రయాణాన్నీ అడ్డుకునేందుకు కుట్ర.. నిప్పులు చెరిగిన చంద్రబాబు

‘తెదేపా, జనసేన కలిసి ప్రజల్లోకి వెళ్తుంటే జగన్‌ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అడ్డుకునేందుకు అనేక కుట్రలు చేస్తున్నారు.

Updated : 12 Apr 2024 09:34 IST

ఈనాడు, రాజమహేంద్రవరం: ‘తెదేపా, జనసేన కలిసి ప్రజల్లోకి వెళ్తుంటే జగన్‌ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అడ్డుకునేందుకు అనేక కుట్రలు చేస్తున్నారు. ఆఖరుకు పిరికితనంతో పవన్‌ కల్యాణ్‌ హెలికాప్టర్‌నూ అడ్డుకునేందుకు కుట్ర పన్నారు’ అని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. గురువారం అంబాజీపేట, అమలాపురంలో సభలకు రాజమహేంద్రవరం నుంచి పవన్‌ కల్యాణ్‌ హెలికాప్టర్‌లో రాకుండా సాంకేతిక కారణాలు చూపుతూ అడ్డుకునేందుకు కుట్ర చేశారని మండిపడ్డారు. ‘చివరకు నేను నా హెలికాప్టర్‌ను పవన్‌ కోసం పంపాను. అధికారులూ.. మీరంతా ఎన్నికల కమిషన్‌ పర్యవేక్షణలో పని చేస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని చంద్రబాబు అన్నారు.

పవన్‌ కల్యాణ్‌ రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి అంబాజీపేట సభకు వెళ్లాల్సి ఉంది. అయితే అయన హెలికాప్టర్‌తో వచ్చిన కో పైలెట్‌కు విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌ తీసుకెళ్లేందుకు అనుమతి (ఎయిర్‌పోర్టు ఎంట్రీ పర్మిట్‌) లేదనే కారణంతో ఆపేశారు. అప్పటికే అంబాజీపేటలో వేచి ఉన్న చంద్రబాబుకు ఈ సమాచారం తెలియడంతో రాజమహేంద్రవరంలోనే ఉన్న తన హెలికాప్టర్‌కు చెందిన కోపైౖలెట్‌ సాయంతో పవన్‌ దాదాపు గంట అనంతరం సాయంత్రం 5.20 గంటలకు బయలుదేరి కోనసీమ చేరుకున్నారు. పవన్‌ హెలికాప్టర్‌ కోపైలెట్‌కు బేగంపేటలో ఇచ్చినట్లే తాత్కాలిక పాస్‌ ఇవ్వమని కోరినా.. నిబంధనలు ప్రకారం సాధ్యం కాదనే సమాధానం వచ్చిందని చెబుతున్నారు. బేగంపేటలో లేని ఇబ్బంది, రాజమహేంద్రవరంలో ఎందుకొచ్చిందన్న ప్రశ్నకు సమాధానం కరవైంది. ఇదంతా రాజకీయ దురుద్దేశంతోనే చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై రాజమహేంద్రవరం విమానాశ్రయ ఏపీడీ జ్ఞానేశ్వర్‌ను వివరణ కోరగా, కోపైలెట్‌కు ఎయిర్‌పోర్టు ఎంట్రీ పర్మిట్‌ లేనందున, సెక్యూరిటీ కారణాలతో అభ్యంతరం తెలిపామన్నారు.

 అంబాజీపేటలో ప్రజాగళం సభకు వచ్చిన చంద్రబాబును కోడికత్తి కేసు బాధితుడు జనిపల్లి శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులతో వచ్చి హెలిప్యాడ్‌ వద్ద కలిశారు. తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని