వరంగల్‌ భారాస అభ్యర్థిగా సుధీర్‌కుమార్‌

వరంగల్‌ పార్లమెంటు స్థానం నుంచి భారాస అభ్యర్థిగా డాక్టర్‌ మారేపల్లి సుధీర్‌కుమార్‌ను ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకూ భారాస అభ్యర్థులను ప్రకటించినట్లయ్యింది.

Updated : 13 Apr 2024 06:30 IST

ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: వరంగల్‌ పార్లమెంటు స్థానం నుంచి భారాస అభ్యర్థిగా డాక్టర్‌ మారేపల్లి సుధీర్‌కుమార్‌ను ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకూ భారాస అభ్యర్థులను ప్రకటించినట్లయ్యింది. హనుమకొండ జిల్లావాసి, ఆయుర్వేద వైద్యుడైన సుధీర్‌కుమార్‌ ప్రస్తుతం ఆ జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. మాదిగ సామాజికవర్గానికి చెందిన ఆయన 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీకి విధేయుడిగా, అధినేతతో కలిసి పనిచేస్తున్నారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోని కేసీఆర్‌ నివాసంలో శుక్రవారం జరిగిన వరంగల్‌ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ ముఖ్యనేతలతో అధినేత సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ బండా ప్రకాశ్‌, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్‌, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్‌, చల్లా ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరితో చర్చించి, వారి సలహాలు, సూచనల మేరకు సుధీర్‌కుమార్‌ అభ్యర్థిత్వాన్ని కేసీఆర్‌ ఖరారు చేశారు. వరంగల్‌ స్థానం భారాసకు కంచుకోట వంటిదని, ఎట్టి పరిస్థితుల్లోనూ సుధీర్‌కుమార్‌ విజయం సాధించాలని నాయకులకు అధినేత సూచించారు. పార్టీ నేతలందరూ కలిసికట్టుగా పనిచేస్తే విజయం సాధించడం కష్టమేమీ కాదని భరోసా ఇచ్చారు.

పలు పేర్ల పరిశీలన అనంతరం..

వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా గతంలోనే వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ పేరును పరిశీలించారు. కానీ తాను పోటీ చేయనని రమేశ్‌ ప్రకటించడంతో.. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యను ఎంపిక చేశారు. అనంతర పరిణామాల్లో అరూరి రమేశ్‌ భాజపాలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా వరంగల్‌ లోక్‌సభ బరిలో నిలిచారు. వరంగల్‌ సిటింగ్‌ భారాస ఎంపీ పసునూరి దయాకర్‌ కూడా భారాసకు రాజీనామా చేసి, కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. ఇంతలో కడియం కావ్య.. తాను పోటీ చేయలేనంటూ అధినేత కేసీఆర్‌కు లేఖ రాసి వైదొలగారు. అనంతరం కడియం శ్రీహరి, కావ్య ఇరువురూ కాంగ్రెస్‌ పార్టీలో చేరగా.. కావ్యను కాంగ్రెస్‌ వరంగల్‌ అభ్యర్థిగా పోటీలో నిలిపింది. ఎంపిక చేసిన అభ్యర్థి పోటీ నుంచి తప్పుకొని, కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో విస్మయానికి గురైన భారాస పార్టీ.. వరంగల్‌ అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవహరించింది. గతంలోనే భారాసకు రాజీనామా చేసిన స్టేషన్‌ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ఈ సమావేశానికి పిలిచారని, ఆయనే అభ్యర్థి కావొచ్చని  ప్రచారం జరిగినా.. అది వాస్తవం కాదని, ఆయన ఈ భేటీకి హాజరు కాలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ముగ్గురు అభ్యర్థులవీ భారాస మూలాలే

వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురూ భారాస పార్టీ మూలాలున్న వారే కావడం గమనార్హం. తాజాగా భారాస అభ్యర్థిగా ప్రకటించిన మారేపల్లి సుధీర్‌కుమార్‌ 2001 నుంచి భారాసలో పనిచేసి అంచెలంచెలుగా ఎదిగారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్య అంతకుముందు భారాస అభ్యర్థిగా కొద్దిరోజులు ప్రచారం కూడా చేశారు. భాజపా తరఫున పోటీ చేస్తున్న అరూరి రమేశ్‌ 2014, 2018 ఎన్నికల్లో భారాస నుంచి వర్ధన్నపేట బరిలో నిలిచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2023లోనూ ఆయన భారాస నుంచే పోటీ చేసి ఓటమి చెంది.. తాజాగా భాజపాలో చేరి ఎంపీ అభ్యర్థిగా టికెట్టు పొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని