ఆయ్‌.. గాలి మారుతోందండీ!

ఎలా ఉందంటే ఏం చెబుతామండీ? రోడ్లు వేశారేంటండీ? ఎలా వెళ్లాలి ఈ రోడ్లమీద? ఉపాధి కూడా లేదండీ మాకు.

Updated : 13 Apr 2024 08:24 IST

నోరు విప్పుతున్న గోదావరి వాసులు
స్పష్టమైన చర్చలు, విశ్లేషణలు
ఉభయగోదావరి గుండె సవ్వడి
(ఉభయగోదావరి జిల్లాల నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి)

ఎలా ఉందంటే ఏం చెబుతామండీ? రోడ్లు వేశారేంటండీ? ఎలా వెళ్లాలి ఈ రోడ్లమీద? ఉపాధి కూడా లేదండీ మాకు. ఇళ్ల స్థలం ఇచ్చామంటున్నారు. కట్టుకోవడానికి డబ్బులు సరిపోవు. ఎక్కడి నుంచి తెచ్చి కట్టుకుంటామండీ? కష్టపడితే రోజుకు 500 రూపాయలు వస్తున్నాయి. ధరలు పెరిగిపోయాయి. ఎన్నికల్లో ఇవన్నీ ఆలోచిస్తాం కదండీ.

 అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో 45 ఏళ్ల వ్యక్తి స్పందన ఇది


రాష్ట్రంలో మనుషులు, మనుషులు కొట్టుకోవడమే ఇక మిగిలిందండీ. ఎవరికీ ఉద్యోగాలు లేవు, ప్రాజెక్టులు లేవు. రాష్ట్రం ఎలా తయారైపోయిందండీ. ఇవన్నీ ప్రజలు చర్చించకుంటున్నారండీ.

 అంబాజీపేటలో కిళ్లీషాపు నిర్వహిస్తున్న మధ్యవయస్కుడి అభిప్రాయం


నిజానికి మాది చెన్నై. ఇక్కడికి వచ్చి ఈ హోటల్లో పని చేసుకుంటున్నాను. మస్కట్‌లో ఉండగా ఒక తెలుగు మహిళ పరిచయమైంది. మేం పెళ్లి చేసుకున్నాం. ఆవిడది ఈ ఊరే. కొవిడ్‌ సమయంలో ఇక్కడికి వచ్చేశాం. ఇక్కడ ప్రభుత్వంపై కోపం కనిపిస్తోంది సార్‌

 కోనసీమలో పెద్ద పంచాయతీ, చుట్టుపక్కల గ్రామాలకు పెద్ద కేంద్రం తాటిపాక. ఆ ఊళ్లో ఒక హోటల్లో ఉపాధి పొందుతున్న నడివయస్కుడి మాటలివి


ఇక్కడ ఉద్యోగాలు లేవు. ఎన్నో ఇబ్బందులు పడుతున్నా. ఈసారి పరిస్థితులు మారకపోతే నేను హైదరాబాదో, బెంగళూరో వెళ్లిపోతాను. సరైన ఉద్యోగంలేక రేపిడోలో పని చేస్తున్నాను.

 రాజమహేంద్రవరం జేఎన్‌ రోడ్డు నివాసి, ఒక యువకుడి స్పందన


మేం ఆర్టీసీ డ్రైవర్లం సార్‌. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఒకోసారి ప్రభుత్వ ఉద్యోగులంటారు. ఒకోసారి కార్పొరేషన్‌ ఉద్యోగులు.. ఈ రాయితీలు, వసతులు వర్తించబోవంటారు. ఎందుకొచ్చిన విలీనం? మేం చాలా ఇబ్బందులు పడుతున్నాం. రాష్ట్రంలో ఎన్నోచోట్లకు తిరుగుతున్నాం. అన్నిచోట్లా ప్రజల స్పందన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది.

 రాజమహేంద్రవరానికి వచ్చిన కాకినాడ జిల్లాలోని ఆరుగురు ఆర్టీసీ డ్రైవర్లు


మ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో మెజారిటీ ప్రజల స్పందన ఇలాగే ఉంది. పదిమందిని కదిలిస్తే ఏడుగురు తమ ఇబ్బందులు చెబుతున్నారు. సామాన్యులు, పేదలు కూడా ధరల పెరుగుదలతో కష్టపడుతున్నామని వివరిస్తున్నారు. ఈనాడు ప్రత్యేక ప్రతినిధి మంగళ, బుధవారాల్లో ఈ రెండు జిల్లాల్లోనూ విస్తృతంగా పర్యటించారు. ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం, తణుకు మీదుగా నిడదవోలు చేరారు. అక్కడి నుంచి రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరిగి రావులపాలెం, అంబాజీపేట, రాజోలు, చించినాడ వంతెన వరకు చేరారు. తిరుగు ప్రయాణంలో పొదలాడ, తాటిపాక మీదుగా అంబాజీపేట, అమలాపురం వరకు పర్యటించారు. ఈ ప్రాంతాల్లో ప్రజలతో చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, రాజకీయ పరిస్థితులపై తమ అభిప్రాయాలు చెప్పేందుకు ఎవరూ నిరాకరించలేదు. ప్రశ్నించిన ప్రతి వ్యక్తీ స్పందించారు. కాకపోతే ‘మీరు ఎక్కడి నుంచి వచ్చారు’ అని ఎదురు ప్రశ్నించారు. వ్యక్తిగత పని మీద ఇలా వచ్చామని, ఆసక్తి కొద్దీ అడుగుతున్నామని చెప్పి వారి అభిప్రాయాలు సేకరించగా చాలా స్వేచ్ఛగా మనసులో మాట చెప్పారు. ప్రభుత్వంపై మీ అభిప్రాయాలేంటి, మీ ప్రాంతంలో ఏమనుకుంటున్నారని ఎదురు ప్రశ్నించి ఆసక్తిగా విన్నారు.

మందుబాబుల్లో ఆగ్రహం

మందుబాబులు ప్రస్తుత పరిస్థితులపై ఆగ్రహంగా ఉన్నారు. అమలాపురం సెంటర్లో గురువారం రాత్రి ఒక వ్యక్తి ఎదురయ్యారు. ‘గతంలో క్వార్టర్‌ బాటిల్‌ 50 రూపాయలకు కొనేవాళ్లం. కిక్కు ఉండేది. ఇప్పుడు ధర పెరిగింది. ఎంత తాగినా కిక్కే లేదు. బటన్లు నొక్కి డబ్బులిచ్చినా అన్నీ ఇలాగే ఖర్చయిపోతున్నాయి’’ అని చెప్పారు. ఇవన్నీ ఎన్నికల్లో ప్రభావం చూపించొచ్చని వ్యాఖ్యానించారు. పదిమందిలో ముగ్గురు, నలుగురు ఇళ్ల స్థలాలు వచ్చాయని, పింఛన్లు వస్తున్నాయని, పథకాల సొమ్ములు వస్తున్నాయని సానుకూలంగా స్పందించినా.. ధరలు ఇబ్బందులు పెడుతున్నాయని, విద్యుత్తు ఛార్జీలు పెరిగిపోయాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.

రాజకీయ పరిణామాలనూ గుర్తిస్తూ...

అమలాపురం, అంబాజీపేట జనగళం సభల్లో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఇద్దరూ ఓటు బదిలీ గురించి విజ్ఞప్తి చేశారు. గాజుగ్లాసు లేనిచోట సైకిల్‌, కమలం గుర్తులకు, సైకిల్‌ లేని చోట గాజుగ్లాసు, కమలం గుర్తుకు ఓటు వేయాలని ఇద్దరూ ప్రజలను కోరారు. చాలాచోట్ల ప్రజలు ‘కూటమి’ అని ప్రస్తావిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమిగా ఏర్పడ్డాయన్న భావన ప్రజల్లో ఏర్పడింది. ఆ పార్టీలను ‘కూటమి’ గానే గుర్తించి తమ మాటల్లో ఆ పేరుతోనే ఉచ్ఛరిస్తున్నారు. వారి నియోజకవర్గంలో జనసేన పోటీ చేస్తోందా, తెదేపా పోటీ చేస్తోందా అన్న స్పష్టత సామాన్య ప్రజానీకంలో ఉంది. ఇవన్నీ ఒక కీలక పరిణామానికి, రాజకీయ మార్పునకు దారి తీస్తున్నాయా? అన్న ప్రశ్నలు కలిగిస్తున్నాయి. దీనికితోడు కొందరి నోళ్లలో ‘ఈ సారి గాలి మారిపోతోందండీ’ అని వినిపించిన ఒక మాట వేగంగా మారుతున్న పరిణామాలకు సంకేతంగా కనిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని