తెదేపాకు అనపర్తి.. భాజపాకు తంబళ్లపల్లె!

తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి అసెంబ్లీ సీటును తెదేపాకు ఇచ్చేసేందుకు భాజపా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది. బదులుగా అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె సీటును భాజపా తీసుకునే అవకాశముంది.

Updated : 13 Apr 2024 11:01 IST

సూత్రప్రాయంగా అంగీకరించిన నేతలు
సీట్ల మార్పులు, ఎన్నికల వ్యూహాలపై చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, పురందేశ్వరి భేటీ
హాజరైన భాజపా నేతలు అరుణ్‌సింగ్‌, సిద్ధార్థనాథ్‌సింగ్‌

ఈనాడు, అమరావతి: తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి అసెంబ్లీ సీటును తెదేపాకు ఇచ్చేసేందుకు భాజపా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది. బదులుగా అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె సీటును భాజపా తీసుకునే అవకాశముంది. పొత్తులో భాగంగా ఆయా పార్టీలకు కేటాయించిన సీట్లలో చేయాల్సిన ఒకటి రెండు మార్పులపై తెదేపా, జనసేన, భాజపా అగ్రనేతలు శుక్రవారం చర్చించారు. ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో సుమారు రెండు గంటలపాటు జరిగిన భేటీలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌, సిద్ధార్థనాథ్‌సింగ్‌ పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు మూడు పార్టీలూ ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించేశాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం వాటిలో కొన్ని మార్పులపై ఈ సమావేశంలో చర్చించారు. అనపర్తి సీటు మార్పుతో పాటు, ఎంపీ రఘురామకృష్ణరాజును ఎక్కడి నుంచి పోటీ చేయించాలన్న అంశంపైనా చర్చ జరిగింది. అనపర్తి నియోజకవర్గానికి తెదేపా మొదటి జాబితాలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. తర్వాత పొత్తులో భాగంగా ఆ సీటు భాజపాకు వెళ్లింది. కానీ రామకృష్ణారెడ్డినే కొనసాగించాలని స్థానిక తెదేపా శ్రేణులు గట్టిగా డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో తెదేపా విజ్ఞప్తి మేరకు.. అనపర్తి సీటు వదులుకునేందుకు భాజపా సిద్ధమైంది. దానికి బదులుగా ఉంగుటూరు అసెంబ్లీ స్థానం తమకు కేటాయించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. కానీ ఉంగుటూరు సీటును ఇప్పటికే జనసేనకు కేటాయించినందున, భాజపాకు ఇవ్వలేమని చంద్రబాబు స్పష్టం చేశారు. అనపర్తికి బదులు తంబళ్లపల్లె తీసుకోవాలని ప్రతిపాదించగా, తమ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం చెబుతామని భాజపా నాయకులు అన్నారు. నరసాపురం లోక్‌సభ స్థానాన్ని తమకు విడిచి పెట్టాలని, అక్కడి నుంచి రఘురామకు టికెట్‌ ఇస్తామని చంద్రబాబు ప్రతిపాదించి, దానికి బదులుగా ఉండి అసెంబ్లీ స్థానాన్ని తీసుకుని, ప్రస్తుతం నరసాపురం లోక్‌సభ స్థానం కేటాయించిన శ్రీనివాసవర్మకు ఆ సీటు కేటాయించాలని సూచించినట్లు తెలిసింది. ఆ ప్రతిపాదనను కూడా అధిష్ఠానం దృష్టికి తీసుకెళతామని భాజపా నాయకులు చెప్పారు.

పర్యవేక్షణకు రాష్ట్రస్థాయి కమిటీ: ఎన్నికల వ్యవహారాలు, ప్రచారంపై పర్యవేక్షణ, వ్యూహాల రూపకల్పనకు మూడు పార్టీల నాయకులతో రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. వైకాపా ప్రభుత్వ అధికార దుర్వినియోగంపై ఎప్పటికప్పుడు ఉమ్మడిగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని, చర్యలు తీసుకునే వరకు పోరాడాలని భావించారు. రాజమహేంద్రవరం లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురందేశ్వరి ఎన్నికల ప్రచారంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉన్నందున.. ఇకపై చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ పాల్గొనే సభలకు భాజపా నుంచి కేంద్ర, రాష్ట్ర నాయకులెవరైనా హాజరు కావాలని నిర్ణయించారు. ప్రధాని నరేంద్రమోదీతో పాటు, అమిత్‌షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌సింగ్‌ వంటి అగ్రనేతలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ఉన్న అవకాశాలు, ప్రణాళికపై చర్చ జరిగింది. మూడు పార్టీల పొత్తును ప్రజలు స్వాగతించారని, వైకాపా తప్పుడు ప్రచారాలను వారు నమ్మడం లేదని నేతలు అభిప్రాయపడ్డారు. 25 లోక్‌సభ, 160 అసెంబ్లీ స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా ప్రచారం, ప్రణాళికతో వెళ్లాలని మూడు పార్టీల నేతలు నిర్ణయించారు. కూటమి పార్టీల మధ్య మెరుగైన సమన్వయం కోసం బూత్‌, అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని