దిల్లీలో రాష్ట్రపతి పాలనకు భాజపా కుట్ర

దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టేందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం పావులు కదుపుతోందని మంత్రి ఆతిశీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Updated : 13 Apr 2024 06:14 IST

ఆరోపించిన మంత్రి ఆతిశీ

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టేందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం పావులు కదుపుతోందని మంత్రి ఆతిశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అరెస్టుతో తమ ప్రభుత్వాన్ని కూలదోయడానికి భాజపా కుట్రపన్నిందని...త్వరలోనే దిల్లీలో రాష్ట్రపతి పాలన విధించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తమకు తెలిసిందని పేర్కొన్నారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆతిశీ.. కొద్దిరోజులుగా దిల్లీలో రాష్ట్రపతి పాలనను సూచించే అనేక సంఘటనలు జరిగాయని తెలిపారు. గడిచిన కొద్దినెలలుగా దిల్లీలో ఒక్క ఐఏఎస్‌ అధికారి కూడా బాధ్యతలు చేపట్టలేదని గుర్తుచేశారు. ‘పలు విభాగాలº్ల ఖాళీలు ఉన్నప్పటికీ.. అధికారులను కేటాయించడం లేదు. ఎన్నికల తేదీలు ప్రకటించిన నాటి నుంచి ప్రవర్తనా నియమావళి పేరుతో మంత్రుల సమావేశాలకు అధికారులు హాజరుకావడం మానేశారు. దిల్లీ ప్రభుత్వ పనితీరుపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ హోంమంత్రిత్వ శాఖకు లేఖలు రాస్తూనే ఉన్నారు’’ అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన భాజపా.. ఎప్పటిలాగే ఆతిశీ భాజపాను లక్ష్యంగా చేసుకుని కొత్త కథనంతో ముందుకు వచ్చారని విమర్శించింది. మరోవైపు ఆమ్‌ ఆద్మీ పార్టీలో అవినీతి పెరిగిందని ఆరోపిస్తూ ఇటీవల రాజీనామా చేసిన మంత్రి రాజ్‌కుమార్‌ ఆనంద్‌ నివాసంలో శుక్రవారం ఆప్‌ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. రాజీనామా చేసి రాజ్‌కుమార్‌ కేవలం పార్టీకి మాత్రమే అన్యాయం చేయలేదని..తనకు ఓటువేసిన పటేల్‌నగర్‌ ప్రజలను సైతం మోసం చేశారని నినదించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు