కాంగ్రెస్‌ మెడలు వంచే అంకుశం భారాస

తొమ్మిదిన్నరేళ్ల పాటు నిరంతర కరెంటు ఇచ్చాం. కేసీఆర్‌ దిగిపోగానే కరెంటు ఎందుకు మాయమైంది? ఇంటింటికీ తాగునీరు అందించిన అద్భుత పథకం మిషన్‌ భగీరథ.

Updated : 14 Apr 2024 05:58 IST

పథకాలను నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వమిది
దళితబంధు చెక్కుల్ని వెనక్కి తీసుకుంది
దళిత బిడ్డలతో కలిసి అంబేడ్కర్‌ విగ్రహం వద్ద దీక్ష చేస్తా
మతపిచ్చి పెంచడం తప్ప భాజపా చేసిందేముంది?
ఆ పార్టీకి ఓటేస్తే మోటార్లకు మీటర్లు పెడతారు
చేవెళ్ల సభలో కేసీఆర్‌
అభివృద్ధి కొనసాగాలంటే.. భారాసకే ఓటేయాలని వినతి

ఈనాడు, హైదరాబాద్‌: ‘తొమ్మిదిన్నరేళ్ల పాటు నిరంతర కరెంటు ఇచ్చాం. కేసీఆర్‌ దిగిపోగానే కరెంటు ఎందుకు మాయమైంది? ఇంటింటికీ తాగునీరు అందించిన అద్భుత పథకం మిషన్‌ భగీరథ. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వ చేతకానితనం వల్ల తాగునీరు లభించడం లేదు. అమల్లో ఉన్న పథకాలను కూడా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వమిది. దీన్ని సరిచేయడానికి ఈ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. కాంగ్రెస్‌ మెడలు వంచే అంకుశం భారాసయే. అందుకే అన్ని స్థానాల్లో భారాస అభ్యర్థులను గెలిపించాలి. లేకపోతే.. ఏం చేయకపోయినా ప్రజలు మాకే ఓటేస్తారనే అభిప్రాయం కాంగ్రెస్‌కు కలుగుతుంది’ అని భారాస అధినేత కేసీఆర్‌ పేర్కొన్నారు. చేవెళ్లలో శనివారం ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్‌, భాజపాలపై కేసీఆర్‌ విమర్శలు గుప్పించారు. తొలుత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించి కేసీఆర్‌ ప్రసంగించారు. ‘బలమైన ప్రతిపక్షం ఉండి, కొరడా ఝళిపిస్తూ.. మోసకారి కాంగ్రెస్‌కు చురకలు వేస్తేనే పనులవుతాయి. మౌనంగా ఉంటే మన సమస్యలు పరిష్కారం కావు. నేను బతికి ఉన్నన్ని రోజులు తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తా. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే.. భారాసను గెలిపించి, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి’ అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ నాయకులను నిలదీయాలి

‘రాష్ట్రం వచ్చిన కొత్తలో కరెంటు కోతలు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు, నీళ్ల కష్టాలు ఉండేవి. కానీ వాటిని అధిగమించి రైతాంగాన్ని కాపాడుకున్నాం. రైతుల సంక్షేమం కోసం పట్టుపట్టి ఐదు పథకాలను అమలు చేశాం. ఎకరానికి రూ.10 వేల చొప్పున రైతుబంధు ఇచ్చాం. 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించాం. రూ.5 లక్షల రైతుబీమా అమలు చేశాం. పంటలను కొనుగోలు చేసి.. రైతుల్లో ఆత్మవిశ్వాసం కల్పించాం. 1100 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి.. జూనియర్‌ కళాశాలలుగా అభివృద్ధి చేశాం. అన్ని వర్గాల విద్యార్థులకు రూ.20 లక్షల విదేశీ స్కాలర్‌షిప్‌ ఇచ్చాం. దళితబంధు ద్వారా ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు అందించాం. గొల్ల కుర్మలకు గొర్రెలిచ్చాం. మత్స్యకారుల కోసం చేపలు పెంచాం. చేనేత కార్మికులకు పని కల్పించాం. గౌడ కులస్థులకు అండగా నిలిచాం. బీసీ బంధుతో బలహీనవర్గాల వారిని ఆదుకున్నాం. కానీ ఇప్పుడు అవన్నీ పోతుంటే.. బాధ కలుగుతోంది. కాంగ్రెస్‌ వాళ్లు దళితబంధు కింద రూ.12 లక్షలు ఇస్తామన్నారు. కానీ ఐదు నెలలు గడిచినా.. ఒక్కరికి కూడా ఇవ్వలేదు. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం కలిపి ఇస్తామన్నారు. అదీ ఇవ్వలేదు. భారాస హయాంలో మంజూరు చేసిన దళితబంధు చెక్కులను కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం వెనక్కి తీసుకొంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వీటిని కొనసాగిస్తుందా? లేదా? ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. దళితబంధు లబ్ధిదారులు, దళిత బిడ్డలతో కలిసి సచివాలయం వద్దనున్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద దీక్ష చేస్తా.

ప్రభుత్వం మెడలు వంచి.. దళితబంధు ఇప్పిస్తాం.

కాంగ్రెస్‌ ఎన్నికల హామీల్లో అన్ని పంటలు కొంటామన్నారు. బోనస్‌ ఇస్తామన్నారు. కానీ ఏదీ లేదు. ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామన్నారు. స్కూటీలు లేవు కానీ.. భయంకరమైన లూటీలు చేస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ ఎందుకు ఆగిపోయింది? నిర్మాణాలకు ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదు? పార్లమెంటు ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్‌ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయండి. ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనాలి. హామీలను అమలు చేసే దాకా వెంటాడతాం.

భాజపాకు నూకలు బుక్కిద్దాం..

పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా.. మతపిచ్చి లేపడం తప్ప, ఏదైనా మంచి పని చేసిందా? ఆ పార్టీలో చేరడమా? లేదా జైలుకు పోవడమా? అన్నట్లుంది పరిస్థితి. అయితే మోదీ.. లేదంటే ఈడీ? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా దేశాన్ని ముందుకు తీసుకెళ్లే పద్ధతి? దేశం మొత్తమ్మీద 150 వైద్య కళాశాలలు మంజూరు చేసినా.. తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు. ఒక్క నవోదయ పాఠశాల కూడా మంజూరు చేయలేదు. 100కి పైగా లేఖలు రాశా. స్వయంగా మోదీని కలిసి విన్నవించా. అయినా ఇవ్వలేదు. సీలేరు ప్రాజెక్టును ఏపీకి అప్పగించింది భాజపా. మన ఐటీఐఆర్‌ను రద్దు చేసింది వాళ్లే. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టలేదు. దేశంలో 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. భర్తీ చేయలేదు. అలాంటి భాజపాకు మనం ఎందుకు ఓటేయాలి? ఇదే మోదీ.. నా మెడ మీద కత్తి పెట్టి, రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలన్నారు. కానీ ప్రాణం పోయినా సరే పెట్టనని చెప్పా. సంవత్సరానికి రూ.5 వేల కోట్ల చొప్పున రూ.30 వేల కోట్ల మేర కేంద్రం కోత పెట్టినా మేం మీటర్లు పెట్టలేదు. ఇప్పుడు భాజపాకు ఓటేస్తే.. వాళ్లు మీటర్లు పెడతారు. భాజపాను ఓటుతో కొట్టాలి. మనల్ని నూకలు తినమన్న ఆ పార్టీకి నూకలు బుక్కిద్దాం.

అధికారం ఎటుంటే అటు మారతారా?

ఎన్నికలొస్తుంటాయి. పోతుంటాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వమంటే ప్రజల్లో ధీమా, ధైర్యం, విశ్వాసం ఉండాలి. ఇంతకుముందు సభల్లో నేను పదే పదే చెప్పా.. ఓటు వేసే ముందే చాలా జాగ్రత్తగా ఆలోచించాలని. ఏ మాత్రం దెబ్బ తగిలినా.. చాలా నష్టం జరుగుతుందని చెప్పా. కానీ కాంగ్రెస్‌ ప్రలోభాల కారణంగా ఆ పార్టీకి అధికారం దక్కింది. ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలైనా.. చిత్తశుద్ధి, కార్యాచరణ లేదు. వసతులు, వనరులు వాడుకునే నైపుణ్యం కనిపించడం లేదు. భారాస పుణ్యాన గెలిచిన రంజిత్‌రెడ్డికి ఏం తక్కువ చేశాం? ఆయనేమైనా పొద్దు తిరుగుడు పువ్వా? అధికారం ఎటుంటే అటు మారతారా? పదవులు, పనుల కోసమే రంజిత్‌రెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరారు. భాజపా అభ్యర్థి కూడా ఇక్కడి ప్రజలకు తెలియనివారేం కాదు. వీరికి దీటైన దెబ్బకొట్టాలి. చేవెళ్ల భారాస అభ్యర్థి, బలహీనవర్గాల బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించాలి’ అని కేసీఆర్‌ కోరారు.


సమన్వయంతో సభ విజయవంతం

చేవెళ్ల, న్యూస్‌టుడే: పార్లమెంటు ఎన్నికల్లో భారాస తొలిసారిగా చేవెళ్లలో నిర్వహించిన సభ విజయవంతమైంది. పార్టీ నాయకులు, శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని సభను విజయవంతం చేశారు. కేసీఆర్‌ ప్రసంగానికి గతంలో మాదిరే మంచి స్పందన లభించింది. సభకు చేవెళ్ల, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, మహేశ్వరం, వికారాబాద్‌, తాండూరు, పరిగి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. లోక్‌సభ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌తో పాటు ఎమ్మెల్యేలు సబితారెడ్డి, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌ గౌడ్‌, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, మహేశ్‌రెడ్డి, పైలెట్‌ రోహిత్‌రెడ్డి తదితరులు పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ సభ విజయవంతం కావడంలో భాగస్వాములయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని