అప్పుడు తాతలు.. ఇప్పుడు మనవళ్లు!

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని దేవెగౌడ కంచుకోట హసన్‌లో పోరు ఆసక్తికరంగా మారింది.

Updated : 14 Apr 2024 05:44 IST

దేవెగౌడ కంచుకోట హసన్‌ ఎవరికో?

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని దేవెగౌడ కంచుకోట హసన్‌లో పోరు ఆసక్తికరంగా మారింది. గతంలో ఇదే లోక్‌సభ స్థానం నుంచి ప్రత్యర్థులుగా ఇద్దరు ప్రముఖ నేతలు ముఖాముఖి తలపడగా...ఇప్పుడు వారి మనవళ్లు అదే బరిలోకి దిగి హోరాహోరీగా పోరాడుతుండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

హసన్‌:  కర్ణాటకలోని హసన్‌.. ఒకప్పటి హొయసల సామ్రాజ్య రాజధాని. దేశానికి తొలి కన్నడిగ ప్రధానిని అందించిన నియోజకవర్గం. జేడీఎస్‌ అధినేత దేవెగౌడకు పెట్టని కోట. చారిత్రక వారసత్వ సంపదకు నిలయమైన ఈ ప్రాంతంలో లోక్‌సభ ఎన్నికల పోరు ఈసారి మరింత రసవత్తరంగా మారింది. గత నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ రెండు ప్రముఖ రాజకీయ కుటుంబాల మధ్యే అధికార పోరు నడుస్తుండగా.. తాజా ఎన్నికల్లో వారి మూడో తరం తలపడుతోంది. హసన్‌ లోక్‌సభ స్థానానికి మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, 33 ఏళ్ల ప్రజ్వల్‌ రేవణ్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజా ఎన్నికల్లోనూ భాజపా-జేడీఎస్‌ కూటమి అభ్యర్థిగా ఆయనే మరోసారి పోటీ చేస్తున్నారు. ప్రజ్వల్‌ ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ 31 ఏళ్ల శ్రేయస్‌ ఎం.పటేల్‌ను నిలబెట్టింది. ఈయన కర్ణాటక మాజీ మంత్రి, దివంగత జి.పుట్టస్వామి గౌడ మనవడు. గతంలో ఇదే స్థానం నుంచి దేవెగౌడ, పుట్టస్వామిలు పోటీ చేయగా.. ఇప్పుడు వారి మనవళ్లు ప్రత్యర్థులుగా నిలవడం విశేషం.

ఆధిపత్యం ఆ కుటుంబానిదే

హసన్‌ నియోజకవర్గం దేవెగౌడ కుటుంబానికి కంచుకోట లాంటిది. రాజకీయంగా పుట్టస్వామి కుటుంబంపై వీరిదే ఆధిపత్యం. 1994, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి హొళెనరసిపుర శాసనసభ స్థానం నుంచి పోటీ చేసినప్పటికీ.. దేవెగౌడ పెద్ద కుమారుడు హెచ్‌.డి.రేవణ్ణ చేతిలో పరాజయం పాలయ్యారు. 2008, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి కోడలు ఎస్‌.జి.అనుపమకూ ఓటమి తప్పలేదు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి మనవడు శ్రేయస్‌ పటేల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేయగా.. 3,152 ఓట్ల తేడాతో రేవణ్ణ చేతిలో ఓడిపోయారు.

వక్కలిగల మద్దతు ఎవరికో?

కర్ణాటకలో రెండో అతిపెద్ద సామాజిక వర్గం అయిన వక్కలిగల ప్రాబల్యం హసన్‌లో చాలా ఎక్కువ. దేవెగౌడ, పుట్టస్వామి కుటుంబాలు ఇదే సామాజిక వర్గానికి చెందినవే అయినా ఉప కులాలు వేరు. పుట్టస్వామి దాస వక్కలిగ కాగా.. దేవెగౌడ కుటుంబానిది ముల్లు వక్కలిగ వర్గం. హసన్‌ నియోజకవర్గంలో దాస వక్కలిగ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండటం శ్రేయస్‌ పటేల్‌కు కలిసొచ్చే అంశం. దీంతో 1999 నాటి తన తాత విజయాన్ని పునరావృతం చేయగలనని ఈయన ధీమాగా ఉన్నారు. ఇక, ప్రజ్వల్‌పై స్థానికంగా కొంత వ్యతిరేకత ఉంది. అవినీతి ఆరోపణలతో పాటు భాజపాతో పొత్తు పెట్టుకోవడం జేడీఎస్‌లో కొందరికి రుచించలేదు. కుటుంబ ప్రాబల్యంతో పాటు మోదీ పాపులారిటీతో కాషాయ ఓటు బ్యాంకు కూడా తనకు దక్కుతుందని ఈ యువ ఎంపీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. హసన్‌ పరిధిలోని నాలుగు శాసనసభ స్థానాల్లో జేడీఎస్‌ అధికారంలో ఉండగా.. భాజపా, కాంగ్రెస్‌కు చెరో రెండు స్థానాలున్నాయి. ఈ స్థానానికి ఏప్రిల్‌ 26న పోలింగ్‌ జరగనుంది.


మనవడి కోసం మాజీ ప్రధాని త్యాగం..

హసన్‌ లోక్‌సభ స్థానం నుంచి దేవెగౌడ ఐదుసార్లు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మనవడి కోసం ఈ స్థానాన్ని త్యాగం చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన ప్రజ్వల్‌ 1.41లక్షల మెజార్టీతో విజయం సాధించారు. జేడీఎస్‌ తరఫున ఆ ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎంపీ ఆయనే.


నాడు దేవెగౌడను ఓడించి..

1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హొళెనరసిపుర స్థానం నుంచి అప్పటి జనతా పార్టీ అభ్యర్థిగా దేవెగౌడ బరిలోకి దిగగా.. ఆయనపై తొలిసారి పుట్టస్వామి పోటీ చేశారు. కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా తలపడిన పుట్టస్వామి ఓడిపోయారు. అయితే, 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అదే స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగి దేవెగౌడను ఓడించారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో హసన్‌ నుంచి దేవెగౌడపై పోటీ చేసి విజయం సాధించారు. అయితే, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో పుట్టస్వామి మళ్లీ గెలుపొందలేకపోయారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని