వంద రోజుల్లోనే కాంగ్రెస్‌పై భ్రమలు తొలిగాయి

అతి తక్కువ సమయంలో అత్యధిక ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్‌ సర్కారు మూటగట్టుకుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ స్పష్టంచేశారు.

Published : 14 Apr 2024 04:47 IST

నాగర్‌కర్నూల్‌ భారాస నేతలతో కేటీఆర్‌ సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: అతి తక్కువ సమయంలో అత్యధిక ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్‌ సర్కారు మూటగట్టుకుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై వంద రోజుల్లోనే ప్రజలకు ఉన్న అన్ని భ్రమలు తొలగిపోయాయని తెలిపారు. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ముఖ్యనేతలతో శనివారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. భారాస అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ గెలవబోతున్నారని ఆయన అన్నారు. నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి.. అత్యధిక మెజారిటీ సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదని కేటీఆర్‌ విమర్శించారు. ఇటీవల కొడంగల్‌లో జరిగిన ఒక సమావేశంలో ముఖ్యమంత్రిలో ఓటమి భయం స్పష్టంగా కనిపించిందని అన్నారు. తనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని సీఎం అసహనంతో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పరిపాలన చేతకాకపోవడం వల్లే ప్రజల దృష్టి మరల్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా సరిగ్గా అమలుచేయని ఈ అసమర్థ ప్రభుత్వానికి పార్లమెంటు ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టంచేశారు. గత పదేళ్ల కాలంలో తెలంగాణకు ఏమీ చేయని భాజపాకు ఈ రాష్ట్రంలో అసలు స్థానమే లేదని కేటీఆర్‌ వెల్లడించారు. పార్టీ అభ్యర్థి ప్రవీణ్‌కుమార్‌ గెలుపు కోసం సమష్టిగా పనిచేస్తామని పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని  ముఖ్యనేతలు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని