తితిదే నిధులు మళ్లించే కుట్ర

తిరుమల క్షేత్ర పవిత్రతను వైకాపా ప్రభుత్వం, అక్కడి అధికారులు మంటగలిపేస్తున్న తీరు శ్రీవారి భక్తులను మనోవేదనకు గురిచేస్తోందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు.

Published : 14 Apr 2024 05:26 IST

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

ఈనాడు, తిరుపతి: తిరుమల క్షేత్ర పవిత్రతను వైకాపా ప్రభుత్వం, అక్కడి అధికారులు మంటగలిపేస్తున్న తీరు శ్రీవారి భక్తులను మనోవేదనకు గురిచేస్తోందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో ధర్మపరిరక్షణకు నడుం బిగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తితిదే నిధులను సైతం వైకాపా నేతలు మళ్లించే కుట్ర చేస్తున్నారన్న సమాచారం తన దగ్గర ఉందన్నారు. శనివారం తిరుపతిలో భాజపా నేతలతో పవన్‌కల్యాణ్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా అధినేత చంద్రబాబు, భాజపా జాతీయ నాయకులు అరుణ్‌సింగ్‌, సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిలతో జరిగిన సమావేశాల్లో తిరుపతిలోని బోగస్‌, దొంగ ఓట్లపై చర్చ జరిగిందన్నారు. మూడు పార్టీలు అప్రమత్తంగా వ్యవహరించి దొంగ ఓట్లను అడ్డుకోవాలని సూచించారు. దీనిపై జనసేన నేతలు, కార్యకర్తలకు ప్రత్యేక దిశానిర్దేశం చేస్తామని చెప్పారు.

ప్రజలకు భరోసా ఇద్దాం

తిరుపతిలో గంజాయి ముఠాలు పేట్రేగిపోతున్నాయని భాజపా అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి ప్రస్తావించగా... తులసివనం వంటి తిరుపతిని గంజాయి మయం చేసిన వైకాపాను సాగనంపాల్సిన సమయం వచ్చిందని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో వైకాపాను బలంగా ఎదుర్కోగలిగేది కూటమి పార్టీలేనని ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని చెప్పారు. సమావేశంలో భాజపా నేతలు అజయ్‌కుమార్‌, సామంచి శ్రీనివాస్‌, ముని సుబ్రహ్మణ్యం, వరప్రసాద్‌, భాస్కర్‌, పెనుబాల చంద్ర, జల్లి మధుసూదన్‌ పాల్గొన్నారు.

‘‘కూటమి నేతలు ఒకేతాటిపై నడవాలని సూచించాం. వారంతా ఆరణి శ్రీనివాసులును గెలిపించేందుకు స్థిర నిశ్చయంతో ఉన్నారు. తిరుపతి సీటును జనసేన గెలుస్తుంది’’ అని నాగబాబు అన్నారు.

జనసేనలో చేరికలు.. తిరుపతికి చెందిన వ్యాపారవేత్త పోకల మల్లికార్జున్‌, ధర్మవరానికి చెందిన ఎగ్జిబిటర్‌ భాస్కర్‌ తదితరులు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు పవన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని