అరాచక పాలనను అంతం చేద్దాం

రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనను అంతం చేద్దామని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో ఆయన ‘స్వర్ణాంధ్ర సాకార బస్సుయాత్ర’ను శనివారం ప్రారంభించారు.

Published : 14 Apr 2024 05:28 IST

స్వర్ణాంధ్ర సాకార బస్సుయాత్రలో నందమూరి బాలకృష్ణ

కదిరి, కదిరి గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనను అంతం చేద్దామని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో ఆయన ‘స్వర్ణాంధ్ర సాకార బస్సుయాత్ర’ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కదిరిలోని పీవీఆర్‌ ఫంక్షన్‌ హాలు నుంచి జీవిమాను కూడలి వరకు రోడ్డు షో నిర్వహించారు. కూడలిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ఎన్నికలకు ముందు కోడికత్తి, బాబాయ్‌ హత్య ఉదంతాలతో సానుభూతిని పొంది వైకాపా అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. జగన్‌ అయిదేళ్ల పాలనలో మూడున్నరేళ్ల పాటు మూడు రాజధానుల పేరుతో రాజధాని లేకుండా చేశారని దుయ్యబట్టారు. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులపై కేసులు పెట్టి వేధించారని మండిపడ్డారు. నవరత్నాలంటూ రాష్ట్రాన్ని తాకట్టుపెట్టి రూ.12 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. రూ.2 లక్షల కోట్లు ప్రజలకు పంచినా, మిగిలినవి ఏమయ్యాయని ప్రశ్నించారు. మద్యనిషేధమని మహిళలను మోసం చేశారని, నాసిరకం మద్యంతో ఉసురు తీసి పేదల కుటుంబాలను అధోగతి పట్టించారని ధ్వజమెత్తారు. చంద్రబాబు రాయలసీమకు పట్టిసీమ ద్వారా కృష్ణాజలాలను పారించి సస్యశ్యామలం చేస్తే వైకాపా పాలనలో రక్తం పారించారని విమర్శించారు.

బడుగులకు రక్షణ ఏదీ?

రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాలకు రక్షణ లేకుండా పోయిందని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా అరాచకాలపై మాట్లాడిన డాక్టర్‌ సుధాకర్‌, జడ్జి రామకృష్ణ, పులివెందులకు చెందిన నాగమ్మల ఉదంతాలే అందుకు నిదర్శనమని గుర్తుచేశారు. అక్రమాలు, అరాచక, దౌర్జన్య పాలనను ఓటుతో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ, ఉపాధి, సంక్షేమ పథకాల ఆద్యుడు ఎన్టీఆరే అన్నారు. ఇప్పుడు వాటికే పేరు మార్చి అమలు చేస్తున్నారని, ఆ పథకాలను రద్దుచేసే ధైర్యం ఎవరికీ లేదన్నారు. అన్ని వర్గాలూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన తెదేపా మళ్లీ అధికారం చేపట్టేలా, అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపేలా ఓటుతో సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బీవీ రాముడు, అభ్యర్థులు కందికుంట వెంకటప్రసాద్‌, బీకే పార్థసారథి, ఎన్బీకే అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని