15 ఏళ్ల బాలుణ్ని తగలబెడితే రాష్ట్రానికి గాయం కాలేదా?

‘అబ్బబ్బా.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి గాయమైతే రాష్ట్రానికే గాయమైనట్లుగా వైకాపా నాయకులు మాట్లాడుతున్నారు.

Updated : 15 Apr 2024 06:57 IST

జగన్‌కు గాయమైతే రాష్ట్రానికి గాయమైనట్లా?
వైకాపా నాయకులు ఎందుకు హడావుడి చేస్తున్నారు?
ఎన్నికలప్పుడే ఇలాంటివి జరుగుతాయా?
తెనాలి సభలో పవన్‌ కల్యాణ్‌ ధ్వజం

ఈనాడు, అమరావతి: ‘అబ్బబ్బా.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి గాయమైతే రాష్ట్రానికే గాయమైనట్లుగా వైకాపా నాయకులు మాట్లాడుతున్నారు. బాపట్ల జిల్లాలో 15 ఏళ్ల బాలుడు అమరనాథ్‌గౌడ్‌ తన అక్కను వేధించవద్దని అన్నందుకు వైకాపా కార్యకర్త నిర్దాక్షిణ్యంగా పెట్రోలు పోసి తగలబెడితే అప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదా? చంద్రబాబునాయుడిపై రాళ్ల వర్షం కురిపిస్తే రాష్ట్రానికి గాయం కాలేదా? రాష్ట్రంలో 30 వేలమంది ఆడబిడ్డలు అదృశ్యమైతే గాయం కాలేదా? కేవలం మీకు (జగన్‌) రాయి తగిలితేనే రాష్ట్రానికి గాయమైనట్లా?’ అని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు. ‘మీ చుట్టూ భద్రత ఉంది. ఆపై జెండాలున్నాయి. అంత భద్రత ఉన్న సీఎంపై రాయి వేయడమా? అసలు మీరే దాడులు చేస్తారు.. మీపై దాడులా? రాష్ట్ర డీజీపీ, నిఘా విభాగం ఏం చేస్తున్నట్లు? ఈ వ్యవహారానికి కారకులెవరో ఇప్పటివరకు గుర్తించలేదు. చేతిలో యంత్రాంగం ఉండి కూడా ఎందుకు గుర్తించలేకపోయారు?’ అని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నల వర్షం కురిపించారు.

ఆదివారం రాత్రి తెనాలి పట్టణంలో జరిగిన వారాహి విజయభేరీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ‘ఎన్నికలు రాగానే వైఎస్‌ జగన్‌కు ఏదోలా గాయమవుతుంది. లేదా ఎవరో ఒకరు చనిపోతారు, చంపేస్తారు. పోయినసారి ఎంతో భద్రత ఉండే విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో గాయం చేశారట. తాజాగా గులకరాయి దాడి. ఆ దాడి గురించి స్పందించాలని మా నాయకులు అడిగారు. కానీ నిజంగా దాడి జరిగిందా? ఆయనే చేసుకున్నారా? లేక కోడికత్తిలా డ్రామానా నాకు తెలియడంలేదు. కరెంటు ఎందుకు తీసేశారో అర్థం కాలేదు. అందుకే స్పందించలేదు’ అని స్పష్టం చేశారు. ‘నాన్నా పులి వచ్చే.. కథలా ఎన్నిసార్లు నమ్మాలి? నమ్మకం పోయింది. ఈ డ్రామాలు ఆపాలి’ అని అన్నారు. ‘అయిదేళ్ల పాటు కోడికత్తి కేసులో శ్రీను అనే యువకుడిని జైల్లో పెట్టారు. మాజీమంత్రి వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి చంపేస్తే గుండెపోటు అని చెప్పారు. వివేకా కుమార్తె డాక్టర్‌ సునీత, వైఎస్‌ కుమార్తె షర్మిల న్యాయం చేయాలని కోరితే వారిని కించపరుస్తున్న వ్యక్తి జగన్‌’ అని మండిపడ్డారు. అందుకే ఇలాంటి దుర్మార్గుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే కూటమిగా వచ్చామని పేర్కొన్నారు.

ముస్లింలకు అండగా ఉంటా

‘నేను భాజపాతో ఉన్నానని, నాకు ఓటేయబోమని కొందరు అంటారు. గాయపడిన జగన్‌ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. మరి జగన్‌కు కూడా ముస్లింలు ఓటేయకూడదు కదా! నేను మిమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకునే వ్యక్తిని కాను. మీలో ఎంతోమంది నైపుణ్యం కలిగిన వారు ఉన్నారు. వారికి అండగా ఉంటాను’ అని పవన్‌ అన్నారు.

సీపీఎస్‌పై అసెంబ్లీలో చర్చపెడతాం

‘కూటమి ప్రభుత్వం రాగానే సీపీఎస్‌పై అసెంబ్లీలో చర్చ పెట్టాలి. ఏడాదిలోపే పరిష్కరించాలని గతంలోనే చంద్రబాబునాయుడుకు చెప్పాను. ఉద్యోగుల భవిష్యత్తుకు నేను భరోసా కల్పిస్తాను. అసెంబ్లీలో బూతులు తిట్టేలా కాకుండా సమస్యలపై చర్చ జరిగేలా చూస్తాం. అసలైన పాలన ఎలా ఉంటుందో తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్‌ ద్వారా చూపిస్తాం’ అని పేర్కొన్నారు. ‘ఈజిప్టులో, శ్రీలంకలో పాలకులను తరిమికొట్టినట్లు ప్రజలు తరిమికొడతారు జాగ్రత్త జగన్‌’ అంటూ హెచ్చరించారు. ‘క్రికెటర్‌ అంబటి రాయుడు స్వశక్తితో అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని వైసీపీ నాయకులు అవమానించారు. ప్రతిభను ప్రోత్సహిస్తే ఆ స్థాయిలో చాలామంది తయారవుతారు. కానీ మన వద్ద ఆ స్థాయిలో ప్రాక్టీస్‌కు స్టేడియాలు లేవు. బూతులు తిట్టే వ్యక్తులను ఓడిద్దాం’ అని పిలుపునిచ్చారు. ‘రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు 34 నుంచి 24 శాతానికి తగ్గించి వారిని అధికారానికి దూరం చేశారు’ అని వైకాపాను విమర్శించారు.


ఎస్సీలూ.. ఆలోచించండి

‘అంబేడ్కర్‌ స్ఫూర్తికి జగన్‌ తూట్లు పొడిచారు. నేను ఆయన్ని గౌరవించే వ్యక్తిగా ఎస్సీలకు ఒకటే చెబుతున్నా. మీకు సంబంధించిన 27 పథకాలు రద్దు చేసి రూ. 4,163 కోట్లు మళ్లించారు. ఇవ్వాల్టికీ ఆ నిధులు ఇవ్వలేదు. ఎస్సీలనే కాదు.. బీసీలనూ మోసగించారు. పదేళ్లుగా పోరాడుతున్నా. ఒక్కసారి గెలుపు రుచి చూపించండి. మీకు అండగా ఉంటా’ అని పిలుపునిచ్చారు. జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మంచి సేవకుడని, ఆయన్ని ఆదరించాలని, డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ను ఎంపీగా గెలిపించాలని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని