హామీల అమలులో కాంగ్రెస్‌, భారాస విఫలం

తమ పార్టీ సంకల్ప పత్రం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌, భారాసలకు లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు.

Updated : 15 Apr 2024 06:17 IST

యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన ఎజెండాగా భాజపా పనిచేస్తుంది: కిషన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: తమ పార్టీ సంకల్ప పత్రం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌, భారాసలకు లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఆ రెండు పార్టీలూ ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. ఆదివారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. భాజపా సాధించిన విజయాలపై రూపొందించిన వికసిత్‌ భారత్‌ డిజిటల్‌ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి చెందిన పలువురు నాయకులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్లు పాలించిన భారాస దళితుడిని సీఎంను చేస్తామన్న హామీనే అమలు చేయలేదన్నారు. నిరుద్యోగ భృతి, దళిత బంధు, ఇంటింటికి నీరు సహా హామీల అమల్లో అది విఫలమైందని తెలిపారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న ఆ పార్టీ ప్రభుత్వం అప్పుడు ఎంతమందికి.. ఎన్ని ఎకరాలు ఇచ్చిందో చెప్పాలన్నారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన 13 హామీలను వదిలేసిందని అన్నారు. చెక్‌బౌన్స్‌లు, బ్లాక్‌మెయిల్‌ చేయడం, తప్పుడు ఐటీ రిటర్న్‌ల దాఖలు.. కాంగ్రెస్‌ నేతల సంస్కృతి అని విమర్శించారు. ఇటువంటి అంశాల్లో తాము కాంగ్రెస్‌తో పోటీపడలేమని అన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ విడుదల చేసింది ఎన్నికల ప్రణాళిక కాదని అది భాజపా సంకల్పమని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రానున్న ఐదేళ్లు.. యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన ఎజెండాగా భాజపా పనిచేస్తుందన్నారు. దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి, దేశ భద్రత దిశగా మరిన్ని పటిష్ఠ చర్యలకు నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో తెలంగాణ బిల్లుకు భాజపా మద్దతు ఇచ్చి మాట నిలబెట్టుకుందని అన్నారు. మోదీ పాలనలో అభివృద్ధి.. అంతకుముందు అభివృద్ధిపై చర్చించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు సహా ఎవరు చర్చకు వచ్చినా సిద్ధమని అన్నారు.

హింస ఏ రూపంలో ఉన్నా భాజపా సహించదు

ఏపీ సీఎం జగన్‌పై దాడిని ఖండిస్తున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిందితుల్ని శిక్షించాలన్నారు. హింస ఏ రూపంలో ఉన్నా భాజపా సహించదని అన్నారు.

రేవంత్‌ అసమర్థుడు కాదు.. కాంగ్రెస్‌ది అసమర్థ ప్రభుత్వం: ఎంపీ అర్వింద్‌

రాష్ట్రంలో అవినీతి భారాస ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపితే అసమర్థ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిందని భాజపా ఎంపీ అర్వింద్‌ అన్నారు. సీనియర్లు అసెంబ్లీకి వెళ్లడంతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్‌కు అభ్యర్థులే దొరకడంలేదని ఇతర పార్టీల నుంచి తెచ్చుకొని నిలబెడుతున్నారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థుడు కాదని, కాంగ్రెస్‌ది అసమర్థ ప్రభుత్వమని అన్నారు. ఆయన కూడా కాంగ్రెస్‌లో ఉంటే అసమర్థుడిగా మారతారని అన్నారు. ఆయన భాజపాలో చేరతానంటే మిత్రుడిగా స్వాగతించి సిఫార్సు చేస్తానని చెప్పారు.

నేడు రైతు దీక్ష

రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం కిషన్‌రెడ్డి రైతు దీక్ష చేయనున్నారు. ఉదయం 11 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దీక్షలో పాల్గొంటారని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని