పరకాల కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గ విభేదాలు.. ‘కొండా’ వర్గీయుల సస్పెన్షన్‌

హనుమకొండ జిల్లా పరకాల మండలం కామారెడ్డిపల్లి శివారులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో పరకాల ఎమ్మెల్యే, ఎన్నికల ఇన్‌ఛార్జి రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ వరంగల్‌ లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశం రసాభాసగా జరిగింది.

Updated : 15 Apr 2024 09:00 IST

రసాభాసగా లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశం

పరకాల, పరకాల రూరల్‌, న్యూస్‌టుడే: హనుమకొండ జిల్లా పరకాల మండలం కామారెడ్డిపల్లి శివారులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో పరకాల ఎమ్మెల్యే, ఎన్నికల ఇన్‌ఛార్జి రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ వరంగల్‌ లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశం రసాభాసగా జరిగింది. అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి వర్గాల మధ్య నెలకొన్న విభేదాలు బయటపడ్డాయి. తమకు తెలియకుండా ఇటీవల పలు మండలాలకు చెందిన వారిని పార్టీలో చేర్చుకోవడంపై కొండా వర్గీయులు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో విభేదాలు బహిర్గతమయ్యాయి.  మంత్రి సురేఖ లేకుండానే సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారని, కొండా దంపతుల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన వారికి ఎమ్మెల్యే ప్రాధాన్యమివ్వడం లేదంటూ కొండా వర్గానికి చెందిన ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ఛైర్మన్‌ గజ్జి విష్ణు ఘర్షణకు దిగారు. దీంతో మంత్రి, ఎమ్మెల్యే వర్గాలకు చెందిన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. వేదికపై కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, యశస్వినిరెడ్డి, వరంగల్‌ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తదితర నాయకులున్నారు. సమావేశం ప్రారంభం కాగానే.. కొండా వర్గీయులు కొండా దంపతుల నేతృత్వంలో పనిచేసి కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించుకుంటామని నినాదాలు చేశారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలకు చెందిన వారు ఒకరినొకరు తోసుకున్నారు. పోలీసులు  ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. గజ్జి విష్ణు, మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో విష్ణు వర్గీయులు  రాస్తారోకో చేశారు. సీఐ రవిరాజు వారికి నచ్చజెప్పి విష్ణును బయటకు తీసుకురావడంతో అందరూ కలిసి సమావేశ మందిరానికి చేరుకున్నారు. గజ్జి విష్ణును, ఆయన అనుచరులను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌  ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని