మోదీకి అప్పుడే విదేశీ ఆహ్వానాలు: రాజ్‌నాథ్‌

వచ్చే ఏడాది విదేశాల్లో జరగనున్న కార్యక్రమాలకు ప్రధాని మోదీకి అప్పుడే ఆహ్వానాలు అందుతున్నాయని.. ఆయన మళ్లీ అధికారంలోకి వస్తారంటూ ఇది వాళ్లకున్న నమ్మకమని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు.

Published : 15 Apr 2024 04:48 IST

జముయీ (బిహార్‌): వచ్చే ఏడాది విదేశాల్లో జరగనున్న కార్యక్రమాలకు ప్రధాని మోదీకి అప్పుడే ఆహ్వానాలు అందుతున్నాయని.. ఆయన మళ్లీ అధికారంలోకి వస్తారంటూ ఇది వాళ్లకున్న నమ్మకమని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. బిహార్‌లోని జముయీ జిల్లాలో ఆదివారం ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘సర్జికల్‌ స్ట్రైక్స్‌ ద్వారా ఉగ్రవాదాన్ని అణచివేశాం. ఖతర్‌లోని న్యాయస్థానం మరణశిక్ష విధించిన రిటైర్డ్‌ నేవీ అధికారులను మోదీ ఒక్క ఫోన్‌కాల్‌తో విడుదల చేయించారు. ఇవన్నీ దేశం ఎంత శక్తివంతంగా రూపాంతరం చెందిందో చెప్పే ఉదాహరణలు’’ అని రాజ్‌నాథ్‌ అన్నారు. సాధారణంగా ఎన్నికలంటే అస్థిరత, కొంత ఆందోళన ఉంటాయని.. ఇపుడు   దేశంలో ఎక్కడా ఆ పరిస్థితి లేదని చెప్పారు. భాజపా మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ.. ఇతర పార్టీల మాదిరిగా కాకుండా ఇచ్చిన హామీలను తాము పూర్తి చేస్తామన్నారు. కాంగ్రెస్‌, ఆర్జేడీల మాదిరిగా ఓటుబ్యాంకు కోసం ఆరాటపడకుండా ట్రిపుల్‌ తలాఖ్‌ను రద్దు చేసి, ముస్లిం ఆడపడుచుల బాధలను భాజపా దూరం చేసినట్లు తెలిపారు. బిహార్‌ మాజీ సీఎం లాలూప్రసాద్‌ యాదవ్‌ను ‘పాత మిత్రుడు’ అని పేర్కొన్న రాజ్‌నాథ్‌.. భాజపా ఓడిపోతే మోదీ జైలుకు వెళతారన్న లాలూ కుటుంబసభ్యుల వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని