సీఎం పర్యటిస్తుంటే విద్యుత్తు ఎందుకు నిలిపేశారు?

‘రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటిస్తుంటే పదేపదే విద్యుత్తును ఎందుకు తీశారు? ఇది కుట్రలో భాగంగా చేసిన పని కాదా? ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా జరిగింది?’ అని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ప్రశ్నించారు.

Published : 15 Apr 2024 05:07 IST

చీకట్లో బస్సు మీదే ఎందుకు నిలబెట్టారు?
డీజీపీ, ఇంటెలిజెన్స్‌ డీజీ, విజయవాడ సీపీపై చర్యలు తీసుకోవాలి
తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌

ఈనాడు, అమరావతి: ‘రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటిస్తుంటే పదేపదే విద్యుత్తును ఎందుకు తీశారు? ఇది కుట్రలో భాగంగా చేసిన పని కాదా? ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా జరిగింది?’ అని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ప్రశ్నించారు. కరెంటు పోయినప్పుడు కారు చీకట్లో బస్సుపైన సీఎంను ఎందుకు నిలబెట్టారు? వీవీఐపీలను ఎక్కడా ఇలా చీకట్లో ఊరేగించరు. బస్సులో కూర్చోబెట్టకుండా అలా నిలబెట్టడం డ్రామాలో భాగం కాదా?’ అని నిలదీశారు. జరిగిన సన్నివేశాలన్నీ చూస్తే జగన్‌పై జరిగిన గులకరాయి దాడి అంతా డ్రామానే అని స్పష్టం చేశారు. ఈ డ్రామాకు కథ, స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్‌ తాడేపల్లి ప్యాలెస్‌ నుంచే నడిచాయని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి పర్యటించేటప్పుడు ఆ మార్గంలో విద్యుత్తు సరఫరా నిలిపేయడం ముందస్తు వ్యూహంలో భాగమేనన్నారు. దాడి జరిగాక కొన్ని క్షణాల్లోనే పోస్టర్లు, బ్యానర్లతో వైకాపా నేతలు, ఆ పార్టీ పెయిడ్‌ బ్యాచ్‌ ధర్నాలు చేయడం దీనికి నిదర్శనమని తెలిపారు. సానుభూతి పొంది కొన్ని ఓట్లు సంపాదించడానికే హైడ్రామా నడిపారని మండిపడ్డారు. ‘దీనిపై ఎన్నికల కమిషన్‌ విచారణ చేపట్టాలి. రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్‌ డీజీ, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘ఎన్నికలు సజావుగా జరగకుండా వైకాపా కుట్ర పన్నింది. దాడి జరిగిన వెంటనే వైకాపా నాయకులు ప్రజల్ని రెచ్చగొట్టి రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నించారు. గత ఎన్నికల ముందు సానుభూతి కోసం కోడికత్తి నాటకాలు ఆడారు. ఇప్పుడు గులకరాయి డ్రామాకు తెరతీశారు. కోడికత్తి డ్రామాలో దళిత యువకుడు శ్రీను అయిదేళ్లు జైలులో మగ్గారు’ అని పేర్కొన్నారు.

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం వైకాపా నేతలకు ఉందా?

దాడి ఘటనపై వైకాపా నేతలకు పట్టాభి పలు ప్రశ్నలు సంధించారు. చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పాలని సవాలు విసిరారు.

ప్రశ్న 1  : సీఎం భద్రతా సిబ్బంది వద్ద బుల్లెట్‌ప్రూఫ్‌ షీట్లు ఉండగా వాటిని ఎందుకు తెరవలేదు? ఇలాంటి దాడులు జరిగినప్పుడు వీవీఐపీకి వాటిని అడ్డుగా పెట్టి రక్షణగా నిలుస్తారు. కానీ సీఎంపై దాడి జరిగాక ఏ కుట్రలో భాగంగా భద్రతా సిబ్బంది వాటిని వాడలేదు?

ప్రశ్న 2 : సీఎంకి గాయమైన వెంటనే బస్సులోకి గానీ, మరో సురక్షితమైన వాహనంలోకి గానీ ఎందుకు తీసుకెళ్లలేదు? బస్సుపైనే ఎందుకు నిలబెట్టారు? భద్రతా ప్రొటోకాల్‌ ప్రకారం ఏ చిన్న దాడి జరిగినా ముఖ్యమంత్రిని వేరే వాహనంలో అక్కడి నుంచి తప్పిస్తారు. కానీ ఏ డ్రామాలో భాగంగా జగన్‌ను వాహనం మార్చకుండా అదే వాహనంలో కొనసాగించారు?

ప్రశ్న 3 : గాయపడిన వెంటనే వైద్య సిబ్బందిని పిలవకుండా ముఖ్యమంత్రికి టవల్‌ ఇచ్చి ఆయన గాయాన్ని ఆయన్నే తుడుచుకోవాలని చెప్పడమేంటి? ఇది డ్రామాను రక్తి కట్టించడానికి, కావల్సిన విజువల్స్‌ ప్రసారం చేసుకోవడానికి కాదా?

ప్రశ్న 4 : సీఎం కాన్వాయ్‌లో కచ్చితంగా వైద్యుల బృందంతో పాటు అంబులెన్స్‌ ఉంటుంది. దాడికి గురైన వీవీఐపీకి ప్రథమచికిత్స చేసి తక్షణమే దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లడానికే అంబులెన్స్‌ పెడతారు. అంబులెన్సుకు పాత్ర లేకుండా చేసింది కుట్రలో భాగం కాదా?

ప్రశ్న 5 : బస్సుయాత్రను కవర్‌ చేయడానికి మీడియాను ఎందుకు అనుమతించడంలేదు? మీ కుట్రలు, డ్రామాలు ప్రపంచానికి తెలిసిపోతాయనేనా? దాడి జరిగిన తర్వాత సాక్షిలో రిలీజ్‌ చేసిన ఫుటేజ్‌ పరిశీలిస్తే.. ముందుగా ముఖ్యమంత్రికి ఒక గజమాల వేసినట్లు, ఆ గజమాల పక్కకు తొలగించే సమయంలో ముఖ్యమంత్రి మొహం దగ్గరగా వెళ్లి, తర్వాత ఫ్రేమ్‌ కట్‌ అయిపోయి నెక్ట్స్‌ విజువల్‌ ముఖ్యమంత్రి తలపైన ఏదో రాయి తగిలి నుదుటిపై చేయి పెట్టుకున్నట్లుంది. ఇలా ఎడిట్‌ చేసిన వీడియోలను సొంత మీడియా ద్వారా బయట ప్రపంచానికి చూపించి డ్రామాను మరింత రక్తి కట్టించే ప్రయత్నం ఎందుకు చేశారు? ఎలాంటి ఆంక్షలు లేకుండా మీడియా మొత్తాన్ని కవరేజికి అనుమతిస్తే.. నాటకాలు సాగవని భయమా?

ప్రశ్న 6 : దాడి జరిగిన నిమిషాల్లోనే ప్లకార్డులు, పోస్టర్లు పట్టుకుని వైకాపా నేతలు రోడ్లపై ధర్నాలు చేశారు. ఈ ఘటనకు చంద్రబాబు బాధ్యులని బురద జల్లే కార్యక్రమానికి సిద్ధమయ్యారు. అంత తక్కువ వ్యవధిలో పోస్టర్లు, ఫ్లెక్సీలు ఎలా తయారుచేశారు? స్క్రీన్‌ ప్లేలో భాగంగా ముందుగానే పోస్టర్లు, బ్యానర్లు ప్రింట్‌ చేయించుకొని దాడి సీన్‌ పూర్తవగానే ధర్నా   సీన్‌కు తెరలేపిన మాట నిజం కాదా?

ప్రశ్న 7 : సాక్షి పత్రికలో ముఖ్యమంత్రికి తీవ్ర గాయాలైనట్లు వార్తలు ప్రచురించారు. మరి అంతటి తీవ్ర గాయాలైన వ్యక్తి ఘటన జరిగిన తర్వాత దాదాపు 2 గంటల పాటు తన బస్సుయాత్రను ఎలా కొనసాగించారు? ఇది నాటకాల్లోనే సాధ్యం కదా?

ప్రశ్న 8 : ఆసుపత్రిలో ఆపరేషన్‌ థియేటర్లో ఫొటో షూట్లు ఎక్కడైనా జరుగుతాయా? అలా ఫొటోలు తీసింది సానుభూతి పొందడానికి కాదా? అసలు ఆపరేషన్‌ థియేటర్లో ఫొటోగ్రాఫర్లను అనుమతించకూడదు. అయినా ఫొటోషూట్లు చేశారంటే దాని అర్థమేంటి? ఏ యాంగిల్‌లో కెమెరా ఎక్కడ పెట్టాలి, ఎలా తీయాలని నిర్ణయించుకుని మరీ ఫొటోలు తీసి ప్రచురించారు. దీన్ని మీ డ్రామాలో క్లైమాక్స్‌ సీన్‌ అని మేము అనుకోవాలా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని