మా నానీ, జోగీ, వంశీ, కిట్టూ.. ఎంతో సౌమ్యులు.. మంచోళ్లు!

‘పెనమలూరు నుంచి జోగి (మంత్రి జోగి రమేష్‌) నిలబడుతున్నాడు. జోగి నాకు మంచి స్నేహితుడు. మంచివాడు. సౌమ్యుడు. మీ అందరి దీవెనలు, ఆశీస్సులు జోగిపై ఉంచాలని కోరుతున్నా’ అని సీఎం జగన్‌ అభ్యర్థించారు.

Updated : 16 Apr 2024 10:25 IST

అభ్యర్థులుగా పరిచయం చేస్తూ సీఎం జగన్‌ కితాబు

ఈనాడు, అమరావతి: ‘పెనమలూరు నుంచి జోగి (మంత్రి జోగి రమేష్‌) నిలబడుతున్నాడు. జోగి నాకు మంచి స్నేహితుడు. మంచివాడు. సౌమ్యుడు. మీ అందరి దీవెనలు, ఆశీస్సులు జోగిపై ఉంచాలని కోరుతున్నా’ అని సీఎం జగన్‌ అభ్యర్థించారు. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని నాగవరప్పాడులో జరిగిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో కృష్ణా జిల్లాకు చెందిన వైకాపా అభ్యర్థులను ముఖ్యమంత్రి జగన్‌ ప్రజలకు పరిచయం చేశారు. మంత్రి జోగి రమేష్‌ సౌమ్యుడు అనగానే జనాలు ఘొల్లుమన్నారు. గోల చేశారు. రమేష్‌ సౌమ్యుడట! ప్రతిపక్షాల మీద ఆయన తరచూ నోరుపారేసుకుంటారనే విమర్శలున్నాయి. జనాన్ని తీసుకొని మారణాయుధాలతో చంద్రబాబు ఇంటి మీదకు ఆయన దాడికి వెళ్లారు. పోలీసులు మాత్రం కేవలం ఆయన ప్రశ్నించేందుకే వెళ్లారని సమర్దించారు.

జోగి అనుచరులు మూడు నియోజకవర్గాల్లోనూ (మైలవరం, పెడన, ప్రస్తుతం పెనమలూరు) తమ అరాచకాలను విస్తరించారనే ఆరోపణలు ఉన్నాయి. మైలవరంలో జోగి వర్గం సొంత పార్టీ వారిపైనే దాడికి వెళ్లింది. ఆయన అనుచరులైన కొంతమంది యువకులు ఓ పెళ్లి బృందంపై దాడికి పాల్పడ్డారు. జోగి రమేష్‌ వర్గీయులు జి.కొండూరులో దేవినేని ఉమాపై దాడిచేశారు. పోలీసులు తిరిగి దేవినేని ఉమాపైనే కేసు నమోదు చేసి రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. ఇక పెడనలో వసూలు రాజాలు సరేసరి. ఆయన పెనమలూరుకు వచ్చిన తర్వాత చేస్తున్న ఇసుక దందా అంతా ఇంతా కాదు. ఇక్కడ ఉంటూనే మైలవరంలో బూడిద దందా సాగిస్తున్న తీరు ‘ఆదర్శనీయమే’. ఇంత సౌమ్యుడు జోగి రమేష్‌.. ఆయనకు చల్లని దీవెనలు కావాలని జగన్‌ కోరడం విచిత్రంగా అనిపించింది.


అయిదోసారి కొడాలి మంచి చేస్తారట!

‘గుడివాడలో కొడాలి నాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నా స్నేహితుడు, మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి చేస్తాడు. దగ్గరుండి నేను చేయిస్తాను కూడా. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు, నానిపై ఉంచాలని సవినయంగా కోరుతున్నాను!’ అని జగన్‌ విజ్ఞప్తి చేశారు. కొడాలి నానిని మాత్రం సౌమ్యుడిగా పేర్కొనలేదు. ఆయన ఇంకా చాలా మంచి చేస్తారని చెప్పారు. ‘ఇప్పటి వరకు ఏమీ చేయలేకపోయారు. రోడ్లు వేయలేదు. ఆర్వోబీ పూర్తి చేయలేదు. తెదేపా నిర్మించిన టిడ్కో ఇళ్లు పంచినా.. మౌలిక వసతులు పూర్తి చేయలేదు. ఇప్పటి వరకూ మంచి చేయకపోయినా.. ఈసారి చేస్తారు’ అని కొడాలి నాని గురించి ముఖ్యమంత్రి చెప్పకనే గొప్పగా చెప్పారు. ఈసారి తానే దగ్గరుండి పనులు చేయిస్తానని సీఎం చెబుతున్నారంటే గత అయిదేళ్లూ సీఎం ఏమీ చేయించలేదన్నమాటేగా..!


బెదిరించే వల్లభనేని వంశీ.. సౌమ్యుడా..?

‘మీ అందరికీ తెలిసిన వ్యక్తి. మంచి వాడు. సౌమ్యుడు. నాకు మంచి స్నేహితుడు కూడా. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు గన్నవరం అభ్యర్థి వంశీపై ఉంచాలి. మంచి చేస్తాడని నమ్మకం.. నాకు సంపూర్ణంగా ఉంది’ అని వంశీని  సభలో సీఎం పరిచయం చేశారు. అయితే గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి జరగడానికి ప్రధాన సూత్రధారి వంశీ. యువగళం పాదయాత్రలో దాడులు జరగడానికి ప్రత్యక్ష పాత్రధారి. ఆయనే స్వయంగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తెదేపా నాయకులను బెదిరించి లొంగదీసుకోవడం లేదా కేసులు పెట్టించడమనే ‘మంచి పేరు’ ఆయనకు ఉంది. జాస్తి వెంకటేశ్వరావు ఆస్తులపై జేసీబీ పెట్టి కూల్చివేతలకు పాల్పడ్డారు. మరో రైస్‌ మిల్లర్‌పై తుపాకీ ఎక్కుపెట్టినట్లు నియోజకవర్గంలో ప్రచారం. ఇలాంటి వంశీ సీఎం దృష్టిలో సౌమ్యుడు..!


సింహాద్రి రమేష్‌ది తెగబడేంత ‘మంచి’ వ్యక్తిత్వం

‘అవనిగడ్డ అభ్యర్థి రమేష్‌ కూడా మంచివాడు. సౌమ్యుడు. మంచి చేస్తాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు రమేష్‌ అన్నపై ఉంచాలని ప్రార్థిస్తున్నాను!’ అని సీఎం కోరారు. అవనిగడ్డలో నిరసన తెలుపుతున్న జనసేన కార్యకర్తలపై మారణాయుధంతో దాడికి తెగబడినంత సౌమ్యుడు ఈ ఎమ్మెల్యే. తన హోదా మరిచి బూతులతో దూషించిన ‘మంచివాడు’. తమ రహదారి బాగోలేదని తెలిపిన ఆటో డ్రైవర్లపై అంతెత్తున ఎగిరిపడిన ‘మంచివ్యక్తిత్వం’ ఉన్న ఎమ్మెల్యే.. తామే సొంతంగా మరమ్మతులు చేసుకుంటామని.. ముందుకు వచ్చిన ఆటోడ్రైవర్లను ఎవర్రా మీరు.. చేస్తే ప్రభుత్వం చేయాలి.. లేదంటే మీరు ఇబ్బందులు పడాలి. మీరు ఎందుకు మరమ్మతులు చేస్తార్రా అంటూ అధికార దాహంతో హెచ్చరించిన ‘గొప్ప’ వ్యక్తిత్వం ఉన్నవారు.


పేర్ని కిట్టు.. చాలా మంచోడట!

‘మచిలీపట్నం నుంచి యువకుడు, ఉత్సాహవంతుడు పేర్ని కిట్టు నిలబడుతున్నాడు. వాళ్ల నాన్న (పేర్ని నాని) నాకు మంచి స్నేహితుడు. కిట్టు మంచి చేస్తాడనే నమ్మకం నాకు ఉంది. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఉంచాలి’ అని జగన్‌ కిట్టూకు కితాబు ఇచ్చారు. గత నాలుగేళ్లుగా యువనేతగా బందరును ఏలుతున్న వ్యక్తి. కిట్టు తండ్రి నానీ మంత్రి అయినా అనధికారికంగా మాత్రం ఎమ్మెల్యే తనయుడు కిట్టూనే.. కలెక్టర్‌ సైతం అధికారిక కార్యక్రమాల్లో కిట్టూతోనే కొబ్బరి కాయలు కొట్టించారు. ఎంపీని సైతం పక్కన పెట్టిన వ్యక్తిత్వం ఉన్నవారు. యువనేత అరాచకాలు బందరులో కథలు కథలుగా చెబుతుంటారు.


ఉప్పాల రాము.. ఆ మాత్రం దూకుడుంటే ఉత్సాహవంతుడేగా!

‘పెడన నుంచి రాము నిలబడుతున్నాడు. మంచివాడు. సౌమ్యుడు, ఉత్సాహవంతుడు.. ఇంజినీరు కూడా. మీ చల్లని దీవెనలు రాముపై ఉంచాలి !’ అని సీఎం చెప్పారు. రాము జడ్పీ ఛైర్‌పర్సన్‌ భర్త. పేరుకే ఆమె కుర్చీలో కూర్చున్నారు. పెత్తనం అంతా రామూదే. జడ్పీ వాహనాలన్నా..పెట్రోలన్నా.. రాముకు భలే ఇష్టం. బదిలీలు సైతం ఆయన కనుసన్నల్లోనే జరగాలి. దూకుడు, దురుసు స్వభావం ఉండే రాము జగన్‌ దృష్టిలో మంచి సౌమ్యుడే.


నటనకు ప్రతిరూపం.. కైలే అనిల్‌

‘పామర్రు నుంచి అనిల్‌ నిలబడుతున్నాడు. అనిల్‌కు ఎవరూ సాటి లేరు. మంచి వాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అనిల్‌పై ఉంచాలి..!’ అని జగన్‌ పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ఆయన సోదరుడు సమాంతర పాలన చేసినా మౌనంగానే ఉంటారు. తన పేరుతో ఇసుక, మట్టి దందా జరుగుతున్నా.. తెలియనట్లు నటించే ‘అమాయకుడు’ కైలే అనిల్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని