ప్రధాని మోదీ అవినీతి ఛాంపియన్‌

దేశంలో ఎన్నికల బాండ్ల పథకం ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పథకం అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అభివర్ణించారు.

Updated : 18 Apr 2024 06:09 IST

ఈసారి భాజపాకు 150 సీట్లే వస్తాయి: రాహుల్‌

గాజియాబాద్‌, బెంగళూరు: దేశంలో ఎన్నికల బాండ్ల పథకం ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పథకం అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అభివర్ణించారు. ప్రధాని  మోదీ అవినీతి ఛాంపియన్‌ అని ఆరోపించారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 150 సీట్లకే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి మంచి ఫలితాలు సాధిస్తుందని రాహుల్‌ ధీమా వ్యక్తం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ తో కలిసి ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో బుధవారం రాహుల్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అధికార భాజపాపై విమర్శనాస్త్రాలు సంధించారు. కర్ణాటకలోని కోలారు, మండ్య ఎన్నికల సభల్లోనూ ఆయన ప్రసంగించారు.

రెండు సిద్ధాంతాల మధ్య పోరు

ఎన్నికల నిధుల్లో పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకొచ్చినట్లు ప్రధాని మోదీ చెబుతున్నారని, అలా అయితే ఆ పథకాన్ని సుప్రీంకోర్టు ఎందుకు కొట్టివేసిందని రాహుల్‌ ప్రశ్నించారు. ‘‘15-20 రోజుల క్రితం భాజపా 180 సీట్లు గెలుస్తుందని అనుకున్నాను. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఇప్పుడు వారికి 150 సీట్లు వస్తాయని భావిస్తున్నాను. ఉత్తరప్రదేశ్‌లో బలమైన ప్రతిపక్ష కూటమి ఉంది. రాబోయే ఎన్నికలు రెండు సిద్ధాంతాలకు మధ్య జరిగేవి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఈ ఎన్నికల్లో పెద్ద సమస్యలు. ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు భాజపా నేతలు, ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు’’ అని రాహుల్‌ విమర్శించారు. 

పార్టీ ఆదేశాలకు కట్టుబడతా

అమేఠీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడంపై రాహుల్‌ గాంధీ స్పందించారు. ఈ స్థానంలో నన్ను బరిలో నిలపడమా? లేదా అన్నది పూర్తిగా కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ  నిర్ణయమని తెలిపారు. పార్టీ ఆదేశాలకు తాను కట్టుబడి ఉంటానని అన్నారు. గతంలో అమేఠీ నుంచి పోటీ చేసి రాహుల్‌ వరుసగా మూడు పర్యాయాలు విజయబావుటా ఎగురవేశారు. 2019లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓటమిపాలయ్యారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని