నా భర్తపై రెబల్‌గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి భార్య

నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది.

Updated : 19 Apr 2024 07:24 IST

టెక్కలి, న్యూస్‌టుడే: నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తాను బరిలోకి దిగుతానని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ భార్య, జడ్పీటీసీ సభ్యురాలు వాణి అనుచరుల వద్ద ప్రకటించారు. గురువారం ఆమె జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారితో ఈ నెల 22న తాను నామినేషన్‌ వేయనున్నట్లు చెప్పారు. శుక్రవారం ఆమె భర్త వైకాపా తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ సమర్పించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్‌ వ్యవహారశైలితో నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బంది వస్తోందని వాణి గతంలో సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో వైకాపా టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఆ పార్టీ అధిష్ఠానం వాణిని నియమించింది. వైకాపా అభ్యర్థుల జాబితా ప్రకటించే వరకు ఆమె క్రియాశీలకంగానే వ్యవహరించారు. శ్రీనివాస్‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసినప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. జగన్‌ వైఖరితో అసంతృప్తిగా ఉన్న ముఖ్య నాయకులు నామినేషన్‌ వేయాలని కోరడంతో బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశారని తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని