చీపురుపల్లిలో మంత్రి బొత్సకు భారీ షాక్‌

వైకాపా కీలకనేత, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

Updated : 19 Apr 2024 10:37 IST

వైకాపా నుంచి 500 మంది తెదేపాలో చేరిక

గరివిడి, చీపురుపల్లి, మెరకముడిదాం, న్యూస్‌టుడే: వైకాపా కీలకనేత, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మెరకముడిదాం మండలంలో ఆ పార్టీ ప్రధాన నేతలు ఒక్కొక్కరిగా తెదేపాలో చేరుతున్నారు. గురువారం రాత్రి గర్భాం పంచాయతీలో జరిగిన కార్యక్రమంలో మాజీ మండలాధ్యక్షుడు తాడ్డి కృష్ణారావు కుమారులు చంద్రశేఖర్‌(చందు), వెంకటేష్‌, ఎంపీటీసీ సభ్యురాలు తాడ్డి కృష్ణవేణి ఆధ్వర్యంలో.. భైరిపురం మాజీ ఎంపీటీసీ సభ్యుడు మంత్రి సీతంనాయుడుతో పాటు గర్భాం, నరసయ్యపేట, బోడందొరవలస, పెదమంత్రిపేట, చినమంత్రిపేట, లెంకపేట, భైరిపురం, చల్లాపురం, రామయ్యవలస, మెరకముడిదాం గ్రామాల నుంచి సుమారు 500 మంది వైకాపాను వీడి తెదేపాలో చేరారు. వీరికి చీపురుపల్లి తెదేపా అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. మెరకముడిదాం మండల రాజకీయాలను ఇంతవరకు తాడ్డి, కోట్ల కుటుంబాలు శాసిస్తూ వస్తున్నాయి. ఇక్కడ ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను ఆ రెండు కుటుంబాలే దక్కించుకుంటున్నాయి. వాటితో పాటు రౌతు కుటుంబానికి రాజకీయ ప్రాధాన్యత ఉంది. ఈ మూడు కుటుంబాల నుంచి మొదటితరం నేతలు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. వారి వారసులు మంత్రి బొత్స సత్యనారాయణకు సన్నిహితంగా ఉంటూ ఆయన రాజకీయ ఎదుగుదలకు తోడ్పడ్డారు. ఇప్పుడు వారంతా బొత్సను వీడి తెదేపా గూటికి చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని