వివేకా హత్య కేసుపై మాట్లాడొద్దంటే ఎలా?

ప్రజాస్వామ్య దేశంలో ఉన్నది ఉన్నట్లు మాట్లాడకుండా న్యాయస్థానాలు రాజకీయ పార్టీలకు ఆంక్షలు విధించడం సరికాదని, దీన్ని సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అభిప్రాయపడ్డారు.

Updated : 22 Apr 2024 06:56 IST

ఛార్జిషీట్‌లోని అంశాలు మాట్లాడితే ఆంక్షలు ఎందుకు?
సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ

విజయవాడ (అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే: ప్రజాస్వామ్య దేశంలో ఉన్నది ఉన్నట్లు మాట్లాడకుండా న్యాయస్థానాలు రాజకీయ పార్టీలకు ఆంక్షలు విధించడం సరికాదని, దీన్ని సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన విజయవాడలో విలేకర్లతో మాట్లాడారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసు గురించి మాట్లాడవద్దని కడప కోర్టులో జడ్జి ఆదేశించడం తగదన్నారు. సీబీఐ ఛార్జిషీట్‌లో ఫైల్‌ చేసిన అంశాలే పత్రికల్లో వస్తాయని, వాటిపైనే రాజకీయ పార్టీలు మాట్లాడుతుంటాయని తెలిపారు. న్యాయ వ్యవస్థ ఇలా ఆంక్షలు పెడితే.. ఇక ఏం మాట్లాడాలన్నారు. ప్రధాని మోదీ విదేశాల్లో విగ్రహాలు భారత్‌కు తీసుకువస్తానని చెబుతున్నారని.. అవి కాకుండా, విదేశాలకు పారిపోయిన నీరవ్‌ మోదీ, విజయ్‌మాల్యా వంటి అవినీతిపరుల్ని వెనక్కి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. తొలి విడత ఎన్నికల్లో భాజపా ఎన్ని కుట్రలు చేసినా డీఎంకే, వామపక్షాలదే విజయమన్నారు. రాష్ట్రంలో వామపక్షాలు కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తే వైకాపా లాభపడుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారని, వాటిని ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

జెడ్‌ కేటగిరీ భద్రత ఉన్న ముఖ్యమంత్రిపై గులకరాయి దాడి జరిగిందంటే అది పోలీసు వ్యవస్థకే అవమానమని వ్యాఖ్యానించారు.

ఏ ముఖం పెట్టుకుని ఓట్లడుగుతావ్‌ జగన్‌?: రామకృష్ణ

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. మద్యపాన నిషేధం చేసి, 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని చెప్పిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. సిద్ధం సభలకు వందల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు బుక్‌ చేసి.. వాటిలో మద్యం, బిర్యానీ, డబ్బులు పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. ఒక్కో పోస్టల్‌ ఓటుకు రూ.ఆరు వేలు ఇస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ, కె.వి.వి.ప్రసాద్‌, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు పి.చంద్రానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని