రేవంత్‌రెడ్డికి గ్యారంటీలు అమలు చేసే శక్తి లేదు

‘ఆరు గ్యారంటీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్‌రెడ్డికి లేదు. కేసీఆర్‌ గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునే పరిస్థితిలో లేరు.

Updated : 19 May 2024 05:41 IST

ఎమ్మెల్యేలను కాపాడుకోలేని స్థితిలో కేసీఆర్‌
రాష్ట్రంలో భాజపాకే భవిష్యత్తు: కిషన్‌రెడ్డి

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి. వేదికపై రాష్ట్ర నాయకులు మనోహర్‌రెడ్డి, రామచందర్‌రావు,
పాశం భాస్కర్, బూర నర్సయ్యగౌడ్, అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి 

భువనగిరి, న్యూస్‌టుడే: ‘ఆరు గ్యారంటీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్‌రెడ్డికి లేదు. కేసీఆర్‌ గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునే పరిస్థితిలో లేరు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలవబోతున్నాం.. రాష్ట్రంలో భాజపాకే భవిష్యత్తు.. ఎన్నికలేవైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక సన్నాహక సమావేశం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్‌ అధ్యక్షతన శనివారం జరిగింది. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారంటీల అమలు కోసం రానున్న రోజుల్లో ప్రజల తరఫున పోరాడుతామన్నారు. కేసీఆర్‌ అవినీతి పాలన అంతం కావాలి.. కుటుంబ పెత్తనం పోవాలని గ్రామీణ ప్రాంత ప్రజలు కాంగ్రెస్‌ని ఆదరించారు తప్ప ప్రేమతో కాదని చెప్పారు. రాష్ట్రంలో భారాస ఎదిగే పరిస్థితి లేదని గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కేసీఆర్‌ మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవబోతున్నామని.. ఆ స్ఫూర్తితో రాబోయే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం కష్టపడి పార్టీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి జి.ప్రేమేందర్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్, రాష్ట్ర నాయకులు రామచందర్‌రావు, జి.మనోహర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, సంకినేని వెంకటేశ్వరావు, నల్గొండ జిల్లా అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తల సమావేశం అనంతరం కిషన్‌రెడ్డి, పార్టీ బాధ్యులతో విడిగా సమావేశమై ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని