దేశాభివృద్ధికి మళ్లీ మార్గం చూపాలి

దేశాభివృద్ధికి, ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రగతికి మరోసారి మార్గం చూపాలంటూ రాయ్‌బరేలీ ప్రజలకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు.

Published : 19 May 2024 05:29 IST

రాయ్‌బరేలీ ప్రజలకు రాహుల్‌ పిలుపు
ఆ ప్రాంతంతో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న కాంగ్రెస్‌ అగ్రనేత

దిల్లీ: దేశాభివృద్ధికి, ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రగతికి మరోసారి మార్గం చూపాలంటూ రాయ్‌బరేలీ ప్రజలకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. యూపీ రాజకీయాలకు ఆ నియోజకవర్గం గతంలో సైద్ధాంతిక, రాజకీయ కేంద్రంగా ఉందని గుర్తుచేశారు. రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తున్న ఆయన.. ఆ ప్రాంతంతో తనకున్న అనుబంధాన్ని, చిన్ననాటి జ్ఞాపకాలను ‘ఎక్స్‌’ వేదికగా ఓ వీడియోలో శనివారం గుర్తుచేసుకున్నారు. ‘‘దేశ పురోగతిలో రాయ్‌బరేలీది కీలక పాత్ర. స్వాతంత్య్ర పోరాటంలో దేశానికి మార్గనిర్దేశం చేసింది ఈ ప్రాంతమే. గతంలో రాష్ట్ర రాజకీయాలకు కేంద్రంగా ఉండేది. దేశానికి మరోసారి పురోగతి పథాన్ని చూపాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని రాహుల్‌ అందులో పేర్కొన్నారు. ‘‘రాయ్‌బరేలీ వెళ్లినప్పుడల్లా నేను, ప్రియాంక (రాహుల్‌ సోదరి) మా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటుంటాం. నానమ్మ స్మృతులు, నాన్నకు ఇష్టమైన జిలేబీలు, ప్రియాంక చేసిన కేకులు, ఇలా ఎన్నో మధురమైన క్షణాలు కళ్ల ముందు కనిపిస్తుంటాయి. ఇవన్నీ నిన్ననే జరిగినట్లుగా అనిపిస్తోంది’’ అంటూ రాహుల్‌ భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు సొంత కుటుంబాలకు గౌరవం ఇవ్వలేకపోతే.. బయట కూడా సత్సంబంధాలు కొనసాగించలేరంటూ భాజపా అగ్రనేతలపై ఆయన విరుచుకుపడ్డారు. తాను తన కుటుంబాన్ని ఎలా గౌరవిస్తానో.. అదేవిధంగా దేశ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తానని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు