హింసాత్మక ఘటనలకు సీఎస్‌ జవహర్‌రెడ్డే బాధ్యుడు

రాష్ట్రంలో ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలకు సీఎస్‌ జవహర్‌రెడ్డే బాధ్యుడని తెదేపా సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు.

Updated : 21 May 2024 05:46 IST

 పోస్టల్‌ బ్యాలట్‌ లోటుపాట్లను సరిచేయాలి
సీఈఓకు తెదేపా నేతల ఫిర్యాదు

ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలకు సీఎస్‌ జవహర్‌రెడ్డే బాధ్యుడని తెదేపా సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. ఈ అంశంతోపాటు ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలట్‌ ప్రక్రియలో చోటుచేసుకున్న లోటుపాట్లపై నరసరావుపేట తెదేపా లోక్‌సభ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలుతో కలిసి ఆయన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనాకు సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం వారిద్దరూ విలేకరులతో మాట్లాడారు. ‘పల్నాడు అల్లర్ల విషయంలో పోలీసులు నిజాయతీగా వ్యవహరించి ఉంటే ఈ రోజు సిట్‌ అవసరం ఉండేది కాదు. సీఎస్‌ జవహర్‌రెడ్డి, పూర్వ డీజీపీ రాజేంద్రనాథరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రఘురామిరెడ్డిల పర్యవేక్షణలోనే పోలింగ్‌ రోజు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాబట్టి అల్లర్ల ఘటనలన్నింటికీ జవహర్‌రెడ్డే బాధ్యుడు. పోస్టల్‌ బ్యాలట్‌ను ఎంతమంది వినియోగించుకున్నారో వివరాలు వెల్లడించాలని సీఈవోను కోరాం. పోస్టల్‌ బ్యాలట్లపై గెజిటెడ్‌ అధికారి సంతకం ఉన్నా, లేకున్నా.. అది ఉద్యోగుల తప్పు కాదు. అధికారులు చేసిన తప్పునకు ఓట్లు చెల్లనివి (ఇన్వాలిడ్‌) కాకూడదు. అధికారుల తప్పిదాలకు ఓటర్లు బాధ్యులు కాకూడదని వివరించాం’ అని ఉమా తెలిపారు. 

‘పల్నాడు ప్రాంతంలో పోలింగ్‌ రోజు నుంచి చెలరేగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి సాక్షి పత్రికలో వస్తున్న తప్పుడు వార్తలపై సీఈఓకు ఫిర్యాదు చేశాం. తప్పుడు వార్తలపై విచారణ జరిపించాలని కోరాం. వైకాపా చేస్తున్న తప్పుడు ఆరోపణలను కూడా సీఈవో దృష్టికి తీసుకెళ్లాం’ అని శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు.

ఎస్పీ బిందుమాధవ్‌ కుటుంబంతో సంబంధాలు లేవు: శ్రీకృష్ణదేవరాయలు

మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ‘పల్నాడు మాజీ ఎస్పీ బిందుమాధవ్‌ కుటుంబానికి, మా కుటుంబానికి పరిచయం ఉన్నట్లు ‘సాక్షి’ పత్రికలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఎస్పీని మా కుటుంబసభ్యులెవరైనా కలిసినట్లు నిరూపించాలి. పోలింగ్‌ మొత్తం తెదేపా నాయకుల కనుసన్నల్లో జరిగిందని వైకాపా నాయకులు చేస్తున్న ఆరోపణలపైనా సిట్‌ విచారణ చేపట్టాలి. తప్పుడు ప్రచారం చేసినవారిపై పరువునష్టం దావా వేస్తాం’ అని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని