విజయం దిశగా ఇండియా కూటమి: కేజ్రీవాల్‌

దేశ రాజధాని దిల్లీ ప్రజలను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పాకిస్థానీలుగా అభివర్ణించారంటూ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు.

Updated : 22 May 2024 06:14 IST

దిల్లీ, జంశెద్‌పుర్‌ : దేశ రాజధాని దిల్లీ ప్రజలను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పాకిస్థానీలుగా అభివర్ణించారంటూ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. వారంతా తన కుటుంబం అని వారిని నిందించరాదని కోరారు. మంగళవారం వర్చువల్‌గా జరిగిన విలేకరుల సమావేశంలోనూ, ఝార్ఖండ్‌లోని జంశెద్‌పుర్‌ ఎన్నికల ర్యాలీలోనూ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ..లోక్‌సభ ఎన్నికలు పూర్తవుతున్న ప్రతి దశ తమ ఇండియా కూటమిని విజయానికి మరింత చేరువ చేస్తోందని వెల్లడించారు. అలాగే నరేంద్ర మోదీ ప్రభుత్వం దిగిపోవడానికి సిద్ధమవుతోందని, ఇండియా కూటమి ప్రభుత్వం జూన్‌ 4న అధికారంలోకి రానున్నట్లు స్పష్టమవుతోందని పేర్కొన్నారు. తమ కూటమి దేశానికి సుస్థిర ప్రభుత్వాన్ని అందించనున్నట్లు తెలిపారు.  ‘‘ప్రధాని మోదీ మిమ్మల్ని (అమిత్‌ షాను) వారసుడిగా ఎంచుకున్నారు. దీంతో మీరు అహంభావిగా మారారు. ప్రజలను దూషిస్తూ వారిని బెదిరిస్తున్నారు. నేను మీకో విషయం చెప్పాలనుకుంటున్నా. మీరు ప్రధానమంత్రి కాబోరు. ఎందుకంటే జూన్‌ 4న భాజపా ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవడంలేదు. భాజపా ఓటమి పాలవుతోంది. మీ గర్వాన్ని అదుపులో పెట్టుకోండి. మీరు పౌరులను కించపరిస్తే వారు సహించబోరు’’ అని అమిత్‌ షాను కేజ్రీవాల్‌ దుయ్యబట్టారు. 

దేశంలో ఆదివాసీలకు ప్రధాన నాయకుడి(హేమంత్‌ సోరెన్‌)ని జైల్లో పెట్టించిన మోదీ గిరిజనులకు వ్యతిరేకి అని కేజ్రీవాల్‌ ఆరోపించారు. ప్రజలు ఎన్నుకున్న ఆప్, జేఎంఎం ప్రభుత్వాలను కూల్చివేసేందుకు కుట్రపన్నుతున్నారని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని