ఇప్పటికే 310.. చివరి 2 దశలతో 400+

కేంద్రంలో ఎన్డీయే సర్కారు మరోసారి కొలువుదీరుతుందని, ఇప్పటికే 310 సీట్లు తమ ఖాతాలోకి వచ్చి ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పారు.

Published : 22 May 2024 05:30 IST

ఎన్డీయే విజయం ఖాయం: అమిత్‌ షా

భువనేశ్వర్‌-న్యూస్‌టుడే, సంబల్‌పుర్‌: కేంద్రంలో ఎన్డీయే సర్కారు మరోసారి కొలువుదీరుతుందని, ఇప్పటికే 310 సీట్లు తమ ఖాతాలోకి వచ్చి ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పారు. చివరి రెండు దశల పోలింగ్‌ పూర్తయ్యేసరికి నాలుగు వందలకు పైగా స్థానాలను చేజిక్కించుకుంటామని, మోదీ మూడోసారి ప్రధాని అవుతారని ధీమా వ్యక్తంచేశారు. ఒడిశా శాసనసభ ఎన్నికల్లోనూ ఈసారి వికసించేది కమలమేనని చెప్పారు. మంగళవారం ఒడిశాలోని క్యోంఝర్, సంబల్‌పుర్‌లలో జరిగిన భాజపా ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. 

రథయాత్రను ఆపాలని కుట్రపన్నారు 

‘‘ఒడిశాలో అధికారమంతా కొద్దిమంది అధికారుల చేతుల్లో ఉంది. ఇలాంటి బాబూరాజ్‌కు ఈ ఎన్నికలు చరమగీతం పాడతాయి. సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఒడిశా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. పూరీ రథయాత్రను నిలుపు చేయించేందుకు కూడా కుట్ర జరిగింది. దేశంలో అత్యధిక ఖనిజాలు, గనులు క్యోంఝర్‌ ప్రాంతంలోనే ఉన్నా ఇక్కడి గిరిజనులకు ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. భాజపాను అధికారంలోకి తీసుకువస్తే కష్టపడి పనిచేసే యువనేతను సీఎంను చేస్తాం. మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక ఉగ్రవాదాన్ని అంతం చేసింది. తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని మావోయిస్టులను తుడిచిపెట్టే పనిలో ఉన్నాం. మళ్లీ అధికారంలోకి వచ్చిన అనంతరం పీవోకేను స్వాధీనం చేసుకోవడంపై దృష్టి సారిస్తాం’’ అని అమిత్‌షా చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని