సన్నాలకే బోనస్‌ పేరిట కాంగ్రెస్‌ మోసం

రైతులను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. రుణమాఫీ పేరుతో ఇప్పటికే మోసం చేసిందని.. తాజాగా సన్న ధాన్యానికే బోనస్‌ ఇస్తామంటూ మరోసారి దగా చేసిందన్నారు.

Published : 23 May 2024 06:11 IST

దొడ్డు వడ్లకూ ఇవ్వాల్సిందే..
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రైతులను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. రుణమాఫీ పేరుతో ఇప్పటికే మోసం చేసిందని.. తాజాగా సన్న ధాన్యానికే బోనస్‌ ఇస్తామంటూ మరోసారి దగా చేసిందన్నారు. దొడ్డు ధాన్యాన్ని కూడా రూ.500 బోనస్‌తో కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. సన్న రకాల వరి సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వానికి ఉంటే రూ.1,000 బోనస్‌ ఇవ్వొచ్చని.. కానీ, దొడ్డు వడ్లకూ బోనస్‌ ఇవ్వాలన్నారు. వానాకాలం సీజన్‌లో 70 శాతం, యాసంగిలో 90 శాతం మంది రైతులు దొడ్డు రకాలే సాగు చేస్తారని ప్రభుత్వం గుర్తించాలన్నారు. రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని బోనస్‌తో కొనేవరకూ ప్రభుతాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. డిసెంబరు 9లోపు రుణమాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్‌ ప్రకటించిందని.. గెలిచిన తర్వాత ఆగస్టు 15కు వాయిదా వేసిందని.. ఫలితంగా అప్పులు కూడా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆగస్టులో రుణమాఫీ చేస్తే పెట్టుబడి కోసం రైతులకు కాంగ్రెస్‌ నాయకులు అప్పులు ఇస్తారా అని ప్రశ్నించారు. బుధవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చాలని ఆలోచించడం లేదు. రాష్ట్రంలో పండే ప్రతి గింజను కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం సేకరించడం లేదు. సకాలంలో వడ్లను సేకరించక.. అకాల వర్షాలకు తడిసిపోయినా చోద్యం చూస్తోంది. ధాన్యం మొలకెత్తుతున్నా కొనుగోళ్లు నత్తనడకన సాగతున్నాయి. ఇలాగే కొనుగోళ్లు జరిగితే రెండు నెలలైనా పూర్తి కావు. వానాకాలం సీజన్‌కు సంబంధించి 22 లక్షల  టన్నులు, యాసంగికి సంబంధించి 42 లక్షల టన్నుల బియ్యాన్ని కేంద్రానికి రాష్ట్రం ఇవ్వాల్సి ఉంది. సోనియమ్మ రాజ్యం అంటే రైతులను కంటతడి పెట్టించే రాజ్యమా? ఐదు నెలల్లోనే కాంగ్రెస్‌పై వ్యతిరేకత వచ్చింది.

ఏ హోదాలో సోనియా గాంధీని ఆహ్వానిస్తున్నారు?

జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు సోనియా గాంధీని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ హోదాలో ఆహ్వానిస్తోందో చెప్పాలి. పార్టీ కార్యక్రమం అయితే మంత్రిమండలిలో ఎందుకు చర్చించారు? 1,500 మంది ఉద్యమకారులను ఆమె పొట్టనపెట్టుకున్నందుకు పిలుస్తున్నారా? నాటి యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు సాధించుకున్నారు’’ అని కిషన్‌రెడ్డి అన్నారు. సమావేశంలో భాజపా నేతలు బంగారు శ్రుతి, శాంతకుమార్, ప్రకాశ్‌రెడ్డి, ఎన్‌.వి.సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని