తేడా వస్తే ఊరుకునేది లేదు.. పాల్వాయిగేటు వాసులకు ఎమ్మెల్యే పిన్నెల్లి హెచ్చరికలు

మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయిగేటు గ్రామంలో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్‌నాడు ఉదయంనుంచే బెదిరింపులకు దిగారని గ్రామస్థులు గుర్తు చేసుకుంటున్నారు.

Updated : 23 May 2024 07:55 IST

పోలింగ్‌ రోజు అరాచకాలను గుర్తు చేసుకున్న గ్రామస్థులు

గురజాల, రెంటచింతల, న్యూస్‌టుడే: మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయిగేటు గ్రామంలో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్‌నాడు ఉదయంనుంచే బెదిరింపులకు దిగారని గ్రామస్థులు గుర్తు చేసుకుంటున్నారు. తెల్లవారుజామున ఐదింటికే ఆయన గ్రామానికి వచ్చి తెదేపా ఏజెంట్ల వద్దకు వెళ్లి జాగ్రత్తగా ఉండండి.. తేడా వస్తే ఊరుకునేది లేదంటూ ఓ స్థాయిలో హెచ్చరించారని చెబుతున్నారు. అయినా వెరవకుండా తెదేపా ఏజెంట్లు ఉదయం ఆరింటికే పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. పోలింగ్‌నాటి తమ అనుభవాలను గ్రామస్థులు ‘ఈనాడు’కు తెలిపారు. ‘ఉదయం ఏడింటినుంచే ఎవరి ఓట్లు వారు వేసుకుంటున్నారు. తొమ్మిదింటి ప్రాంతంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మరోసారి పోలింగ్‌ కేంద్రాల వద్దకు వచ్చినప్పుడు ప్రశాంతంగానే జరుగుతుందని వైకాపా కార్యకర్తలు చెప్పటంతో వెనుదిరిగారు. 11.30 గంటలకు మరోసారి వచ్చిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తన వాహనంతోపాటు మరో రెండు వాహనాలలో భారీగా కర్రలు, రాడ్లతో పోలింగ్‌బూత్‌ల వద్దకు చేరారు. రోడ్డుపై తన అనుచరగణం నిలిచి ఉండగా ఎమ్మెల్యే సరాసరి దూసుకెళ్లి ఈవీఎం పగులకొట్టారు. అంతే వేగంతో తిరిగి వెళ్లిపోయారు. అడ్డువచ్చిన వారిపై కర్రలు, రాళ్లతో ఎమ్మెల్యే అనుచరగణం దాడి చేసింది. దాడులలో పలువురు తెదేపా నేతలు గాయపడగా మహిళలనీ చూడకుండా దుర్భాషలాడారు. ఎమ్మెల్యేకు ఎదురుపడ్డ చెరుకూరి మణెమ్మ, వెలనాటి మస్తానమ్మనూ తీవ్రంగా దుర్భాషలాడారు.

భయాందోళనలో పోలింగ్‌ సిబ్బంది

ఎమ్మెల్యే పిన్నెల్లి పోలింగ్‌ కేంద్రంలోకి విసురుగా ఈవీఎం కంపార్టుమెంట్‌ వద్దకు వెళ్తుండగా.. నిలువరించేందుకు పోలింగ్‌ సిబ్బంది ప్రయత్నించలేదు. పీవో, ఏపీవో ఇద్దరు నిల్చొని ఎమ్మెల్యేకు నమస్కరించారు. ఎమ్మెల్యే ఒక్కసారిగా ఈవీఎం పగులకొట్టడంతో అందరూ నిశ్చేష్టులయ్యారు. ఈ సమయంలో తెదేపా ఏజెంటు నంబూరి శేషగిరిరావు ఎమ్మెల్యేను, అనుచరులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి నమస్కారం పెట్టిన అధికారులు ఈవీఎం పగులకొట్టడం చూసినా కనీసం పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. గుర్తుతెలియని వ్యక్తులు ఈవీఎం పగులకొట్టారని వారి ఎన్నికల డైరీలో రాసుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే వచ్చి ఈవీఎం ధ్వంసం చేసిన విషయం పోలీసులకు పీవో, సెక్టోరల్‌ అధికారి, రూట్‌ అధికారి, ఆర్వో తదితర అధికారులూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే ఈనెల 20న రెంటచింతల ఎస్సై ఈవీఎం పగులకొట్టిన కేసులో ఏ1గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఛార్జిషీటులో చేరుస్తూ కోర్టుకు సమర్పించారు’ అని స్థానికులు తెలిపారు.


ఇనుపు రాడ్డుతో ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుడి హల్‌చల్‌

ముఖానికి ముసుగు కట్టి లుంగీ ధరించి, రాడ్డు పట్టిన ఎమ్మెల్యే తమ్ముడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి

కారంపూడి, న్యూస్‌టుడే: మొహం కనిపించకుండా టవల్‌ చుట్టి, మోకాళ్ల పైకి లుంగీ ఎగ్గట్టి, చేతిలో ఇనుప రాడ్డు పట్టి ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఓ వీధి రౌడీలా హల్‌చల్‌ చేసినట్లు ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. పల్నాడు జిల్లా కారంపూడిలో పోలింగ్‌ మరుసటిరోజు 14న వైకాపా మూకలు విధ్వంసం సృష్టించాయి. తెదేపా కార్యాలయాన్ని ధ్వంసం చేశాయి. తెదేపా శ్రేణులపై దాడులకు తెగబడ్డాయి. ఓ తెదేపా నాయకుడి కారుకు నిప్పుపెట్టాయి. ఈ సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.


వేలు చూపిస్తూ ఎమ్మెల్యే బెదిరించారు..

మహిళనని చూడకుండా చంపేస్తానంటూ ఎమ్మెల్యే పిన్నెల్లి వేలు చూపుతూ బెదిరించారు. పథకాలు మీకు అందడం లేదా? అంటూ గర్జిస్తూ మాట్లాడారు. ఎమ్మెల్యేగా నాలుగుసార్లు పనిచేసినా మీరు ఇలా చేయటమేంటని అడిగితే దుర్భాషలాడుతూ అక్కడే నిల్చున్నారు. ఈ ఒక్క గ్రామంలోకే మీరు మూడుసార్లు రావడమేంటని, ఇక్కడినుంచి వెళ్లిపోవాలని సావధానంగానే చెప్పాం. అయినా వినిపించుకోకుండా మాపైకి వస్తూనే దుర్భాషలాడుతూ వెళ్లిపోయారు. మేము అక్కడ భారీగా గుమికూడిన మాచర్లకు చెందిన వైకాపా నాయకులను చూసి భయపడిపోయాం. పాల్వాయిని అంతం చేసేదాకా ఆగబోనంటూ ఆగ్రహంతో ఎమ్మెల్యే ఊగిపోవడంతో భయమేసింది. 

చెరుకూరి మణెమ్మ, పాల్వాయిగేటు గ్రామం


కర్రలు, రాడ్లతో దిగారు

ఎమ్మెల్యే నడుచుకుంటూ మా ముందు నుంచి పోలింగ్‌బూత్‌లోకి వెళ్లారు. పోలింగ్‌ బూత్‌లో జరిగిన సంఘటనపై అక్కడ చర్చిస్తుండగా వేగంగా వచ్చిన ఎమ్మెల్యే మమ్మల్ని బూతులు తిట్టారు. ఇదేంటని మేము అడుగుతుండగానే మహిళలకు ప్రభుత్వం సాయం చేయలేదా? అంటూ విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేతోపాటు మాచర్లకు చెందిన వైకాపా నాయకులు, గ్రామానికి చెందిన పలువురు దుర్భాషలాడారు. ఇక్కడినుంచి వెళ్లిపోవాలని బెదిరించారు. రాళ్లు విసరడం, కర్రలతో దాడులు చేయడంతో భయాందోళనతో వణికిపోయాం. 

వెలనాటి మస్తానమ్మ, పాల్వాయిగేటు గ్రామం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని