చెట్ల కింద తలదాచుకుంటున్నాం..

పోలింగ్‌ రోజున మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రజాప్రతినిధిలా కాకుండా వీధిరౌడీలా వచ్చి పాల్వాయి గేటు గ్రామంలో ఈవీఎం ధ్వంసం చేశారని తెదేపా ఏజెంటు నంబూరి శేషగిరిరావు ఆరోపించారు.

Updated : 23 May 2024 10:39 IST

నా కుటుంబానికి ప్రాణహాని
పాల్వాయిగేటు తెదేపా ఏజెంటు నంబూరి శేషగిరిరావు

పోలింగ్‌ రోజు వైకాపా గూండాలు దాడి చేయడంతో గాయాలయ్యాయని రక్తపు మరకలతో
ఉన్న తన ఫొటోను చూపుతున్న నంబూరి శేషగిరిరావు

ఈనాడు, అమరావతి, పట్టాభిపురం, న్యూస్‌టుడే: పోలింగ్‌ రోజున మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రజాప్రతినిధిలా కాకుండా వీధిరౌడీలా వచ్చి పాల్వాయి గేటు గ్రామంలో ఈవీఎం ధ్వంసం చేశారని తెదేపా ఏజెంటు నంబూరి శేషగిరిరావు ఆరోపించారు. గుంటూరులో బుధవారం ఆయన ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు. తన అనుచరులతో పోలింగ్‌ కేంద్రంలోకి ఎమ్మెల్యే పిన్నెల్లి దూసుకొచ్చి స్వయంగా ఈవీఎం పగలగొట్టారని పేర్కొన్నారు. ‘ఎమ్మెల్యే చర్యలతో ఎన్నికల సిబ్బంది, ఓటర్లు భయభ్రాంతులయ్యారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నంలో నాపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు’ అని తెలిపారు. తనకు, తన కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని వాపోయారు. ‘పాల్వాయి గేటు పోలింగ్‌బూత్‌లో నాతో పాటు మరో ఇద్దరు తెదేపా తరఫున ఏజెంట్లుగా ఉన్నాం. అప్పటికే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రెండుసార్లు పోలింగ్‌బూత్‌లోకి వచ్చి వెళ్లారు. ఉదయం 11.30 సమయంలో వైకాపా ఏజెంట్లతోపాటు మేము అల్పాహారానికి బయటకు వచ్చాం. అప్పుడు మళ్లీ ఎమ్మెల్యే వచ్చారు. ఆయన నేరుగా ఈవీఎం వద్దకెళ్లి నేలకేసి రెండుసార్లు కొట్టారు. దాన్ని మేమూ ఊహించలేదు. పద్ధతి కాదని వెంటనే అడ్డుకునేందుకు ప్రయత్నించా. ఎమ్మెల్యే వేలు చూపుతూ నీ అంతుచూస్తా.. బయటకు రా’ అంటూ బెదిరించారు. ఆయన బెదిరించినట్లే నాపై దాడి చేయించారు. మాచర్లలో ఎవరూ చికిత్స కూడా చేయలేదు. ఆర్‌ఎంపీ వైద్యుడి వద్ద చేయించుకున్నా. తలకు నాలుగు కుట్లు పడ్డాయి. పోలింగ్‌ రోజు నుంచి పాల్వాయిగేటులో ఎవరూ ఉండడం లేదు. వైకాపా నాయకులు దాడి చేస్తారన్న భయంతో చెట్ల కింద తలదాచుకుంటున్నాం. పొలాల వెంట తిరుగుతున్నాం. నాకు, నా కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు, అనుచరుల నుంచి ప్రాణహాని ఉంది. పోలీసులు రక్షణ కల్పించాలని కోరుతున్నా. కేసుల భయంతో అందరూ పారిపోయారు. పల్నాడులో బాధితులనుంచి ఫిర్యాదులు తీసుకునే పరిస్థితి లేనందున ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రయత్నించారు. బాధితుల ఫిర్యాదులను తీసుకుని అరాచకాలకు పాల్పడుతున్న వైకాపా మూకల్ని అరెస్టు చేయాలి. గొడవలకు కారణమైన వైకాపా నాయకులపై కేసులు నమోదు చేయాలి. మాచర్లలో ప్రశాంత వాతావరణం కల్పించాలి’ అని కోరారు. 

నంబూరి శేషగిరిరావుతో మాట్లాడుతున్న జూలకంటి బ్రహ్మారెడ్డి

పిన్నెల్లిని రాజకీయ బహిష్కరణ చేయాలి

వీధిరౌడీలా ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చట్టసభల్లో అడుగుపెట్టకుండా రాజకీయ బహిష్కరణ చేయాలని మాచర్ల తెదేపా అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి డిమాండ్‌ చేశారు. వైకాపా నేతల దాడికి గురైన తెదేపా ఏజెంటు నంబూరి శేషగిరిరావును బ్రహ్మారెడ్డి బుధవారం గుంటూరులో పరామర్శించారు. 

బ్రహ్మారెడ్డి ఇంటి వద్ద పోలీసుల హడావుడి: గుంటూరు విద్యానగర్‌లోని బ్రహ్మారెడ్డి ఇంటి వద్ద పోలీసులు హడావుడి చేశారు. నంబూరి శేషగిరిరావును తీసుకుని ఎన్నికల కమిషన్, డీజీపీ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు బ్రహ్మారెడ్డి పయనమయ్యారు. గృహనిర్బంధంలో ఉన్న మీరు బయటకు వెళ్లడానికి వీల్లేదని పోలీసులు చెప్పారు. తాను మాచర్ల వెళ్లడం లేదని, ఎన్నికల కమిషన్, డీజీపీ వద్దకు వెళ్తున్నామని బ్రహ్మారెడ్డి పోలీసులకు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు స్థానిక పోలీసులు రెండు ఎస్కార్ట్‌ వాహనాలను ఏర్పాటుచేశారు. బ్రహ్మారెడ్డితో పాటు తెదేపా నాయకులు ఎస్కార్ట్‌ వాహనాలలో ఎన్నికల కమిషన్‌ వద్దకు వెళ్లారు. తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు దియ్యా రామకృష్ణప్రసాద్, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు వెంట ఉన్నారు.


శేషగిరిరావుతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు
పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ

ఈనాడు డిజిటల్, అమరావతి: మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేటు పోలింగ్‌స్టేషన్‌లో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ధైర్యంగా ఎదుర్కొన్న తెదేపా కార్యకర్త నంబూరి శేషగిరిరావుతో తెదేపా అధినేత చంద్రబాబు బుధవారం ఫోన్‌లో మాట్లాడారు. వైకాపా మూకల దాడిలో గాయపడ్డ ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీనిచ్చారు.  పోలింగ్‌ రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్‌ బూత్‌లోకి ప్రవేశించి ఈవీఎంలను ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన శేషగిరిరావు సహా పలువురు తెదేపా కార్యకర్తలపై వైకాపావాళ్లు మారణాయుధాలతో దాడి చేశారు. అప్పటినుంచి శేషగిరిరావు అజ్ఞాతంలో ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని