పిన్నెల్లిపై సెక్షన్‌ 307 పెడితే ముందస్తు బెయిల్‌ వచ్చేదే కాదు

పోలింగ్‌ రోజు, అనంతరం మాచర్ల నియోజకవర్గంలో చెలరేగిన హింసాత్మక ఘటనలకు కారణమైన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఐపీసీ సెక్షన్‌ 307 పెట్టి ఉంటే.. హైకోర్టు ముందస్తు బెయిల్‌ ఇచ్చేదే కాదని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ అన్నారు.

Published : 25 May 2024 04:26 IST

పల్నాడులో పోలీసు అధికారులంతా వైకాపా  అనుకూలురే
వీడియో ఎలా బయటకొచ్చిందని కాదు.. ఈవీఎంను ఎవరు ధ్వంసం చేశారనేది ముఖ్యం
తెదేపా నేత మహ్మద్‌ ఇక్బాల్‌ ధ్వజం 

ఈనాడు డిజిటల్, అమరావతి: పోలింగ్‌ రోజు, అనంతరం మాచర్ల నియోజకవర్గంలో చెలరేగిన హింసాత్మక ఘటనలకు కారణమైన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఐపీసీ సెక్షన్‌ 307 పెట్టి ఉంటే.. హైకోర్టు ముందస్తు బెయిల్‌ ఇచ్చేదే కాదని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ అన్నారు. ఎన్నికలు సజావుగా జరగనివ్వకూడదని, ఎలాగైనా దొంగ ఓట్లు వేయించుకోవాలనే ఉద్దేశంతో ఎస్సై స్థాయి నుంచి తమకు అనుకూలంగా ఉన్నవారినే వైకాపా ప్రభుత్వం నియమించుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిన్నెల్లి అరాచకం సృష్టించిన వీడియో ఎలా బయటకొచ్చింది, ఎవరు బయటపెట్టారనేది అప్రస్తుతమన్నారు. ఆ వీడియోలో ఈవీఎంను పగలగొట్టి, పోలింగ్‌ సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసింది ఆయనా.. కాదా అనేదే ముఖ్యమన్నారు. రాజంపేట డీఎస్పీ చైతన్య లాంటి పోలీసులు ఉండబట్టే పిన్నెల్లి సోదరులు తప్పించుకుపోయారని, వైకాపా వాళ్లు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. 

సీఎస్‌ పంపిన జాబితాలోని వారినే ఈసీ నియమించింది 

‘‘అధికారుల్ని మార్చడం వల్లే అల్లర్లు జరిగాయని వైకాపా వాళ్లు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి పంపిన జాబితాలోని వారినే ఈసీ నియమించింది. ఈ ఐదేళ్లలో పల్నాడులో పిన్నెల్లి చేయని అరాచకం లేదు. వీరికి భయపడి పెద్ద సంఖ్యలో ముస్లిం కుటుంబాలు ఊళ్లు వదిలి వెళ్లిపోయాయి. గతంలో 77 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 74 పంచాయతీల్ని ఏకగ్రీవం చేసుకొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రక్షణ లేదు. బీసీ నాయకుడు చంద్రయ్యను సినీఫక్కీలో గొంతుకోసి చంపారు. కుల సమీకరణాల్లో మంత్రి పదవి ఇవ్వలేను గానీ నీ ఇష్టమొచ్చినట్టు చేసుకో అని రామకృష్ణారెడ్డికి జగన్‌ స్వేచ్ఛ ఇచ్చారు. దీంతో ఇసుక, మద్యం, గనుల ద్వారా పిన్నెల్లి రూ.2వేల కోట్లు దోచుకున్నారు. తెలంగాణ సరిహద్దుల్లో చెక్‌పోస్టులు పెట్టి కమీషన్లు దండుకొన్నారు’’ అని మహ్మద్‌ ఇక్బాల్‌ ఆరోపించారు.


పాదయాత్రలో జగన్‌పై ఒక్క గులకరాయీ పడలేదు

‘‘ఈ ఎన్నికలు జరిగిన తీరు గురించి ఓ రిటైర్డ్‌ ఐజీగా కొన్ని విషయాలు చెబుతాను. 2019 ఎన్నికల సమయంలో వైకాపా ప్రతిపక్షంలో ఉంది. అప్పట్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. ప్రతిపక్షనేతగా పాదయాత్ర చేసిన జగన్‌పై చిన్న గులకరాయి దాడి కూడా జరగలేదు. ఆయనకు పటిష్ఠ భద్రత కల్పించారు. కానీ నేడు గెలుపే ప్రధానంగా వైకాపా వాళ్లు ప్రవర్తించిన తీరు, చేసిన దాడులు, పెట్టిన అక్రమ కేసులు దారుణం. యర్రగొండపాలెం, అంగళ్లులో చంద్రబాబు మీదే రాళ్లు వేసి.. ఆయన మీదే హత్యాయత్నం కేసులు పెట్టారు. వైకాపా వాళ్ల మీద తేలికపాటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న వింత పోకడ జగన్‌తో పాటు వైకాపా నాయకుల్లో ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్‌ స్టేషన్‌లోకి వెళ్లడం, ఈవీఎంను పగలగొట్టడం, గృహనిర్బంధం నుంచి ఆయన్ను తప్పించడం, ప్రశ్నించిన తెదేపా ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావుపై దాడిచేయడం, గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని సెక్షన్‌ 324 కింద తొలుత కేసు పెట్టడం... ఈ చర్యలను బట్టే వ్యవస్థల విధ్వంసాన్ని అర్థం చేసుకోవచ్చు’’ అని మహ్మద్‌ ఇక్బాల్‌ పేర్కొన్నారు. నిజాయతీగా విధులు నిర్వహించే కిందిస్థాయి పోలీసులకు ఈసీ మనోధైర్యం కలిగించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని