భారాస కార్యకర్త శ్రీధర్‌రెడ్డి హత్యపై పూర్తి స్థాయి విచారణ

తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానని మాజీ మంత్రి కేటీఆర్‌ను, భారాస నేతలను మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు.

Published : 25 May 2024 05:03 IST

 నాపై తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తా: మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్, న్యూస్‌టుడే: తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానని మాజీ మంత్రి కేటీఆర్‌ను, భారాస నేతలను మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో జరిగిన భారాస కార్యకర్త శ్రీధర్‌రెడ్డి హత్యాఘటనపై పూర్తి విచారణ చేయిస్తామన్నారు. గతంలో పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లిలో జరిగిన మల్లేశ్‌ హత్యతో తనకు ప్రమేయం లేదని ఇప్పుడు పోలీసు నివేదిక ఇచ్చిందని.. ఈ కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. నాయకులు మల్లు రవి, శివసేనారెడ్డి, రాంమోహన్‌రెడ్డి, లింగంలతో కలిసి మంత్రి శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘శ్రీధర్‌రెడ్డి హత్య ఘటనను ఖండిస్తున్నాం. ఆయన వల్ల చాలా కుటుంబాలు బాధపడ్డాయి. శ్రీధర్‌రెడ్డికి కుటుంబంలో ఆస్తి తగాదాలున్నాయి, మాజీ ఎమ్మెల్యేతో ఆర్థికపరమైన సంబంధాలున్నాయి. పూర్తి వివరాలు తెలియకుండా నా హస్తం ఉందని కేటీఆర్, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌లు ఎలా మాట్లాడతారు.. గుంట్రావుపల్లి, లక్ష్మీపల్లి వెళ్లి అడిగితే ప్రజలే వాస్తవాలు చెప్తారు. లక్ష్మీపల్లి చౌరస్తాకు వస్తే అక్కడి జనాలు ఏంచెబితే అది చేద్దాం.. రండి, నేనూ వస్తా. నేరెళ్ల ఘటనలో దళితులను హింసించిన వాళ్లకు నాపై మాట్లాడే అర్హత లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాట్లాడే అంశాలు లేక ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు’’ అని మంత్రి జూపల్లి మండిపడ్డారు. మల్లు రవి మాట్లాడుతూ.. జూపల్లికి నేరచరిత్ర లేదని.., కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి ఆయనపై కుట్రలు చేస్తున్నారన్నారు. తప్పుడు ఆరోపణలు చేసిన వారంతా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై మరోసారి తప్పుడు ఆరోపణలు చేస్తే భాజపా కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మోదీ చెప్పే అబద్ధాలే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతున్నారని మల్లు రవి విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని