ఫలితాలు వెలువడిన 3 రోజుల్లోనే ప్రధాని పేరు

లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి స్పష్టమైన, నిర్ణయాత్మకమైన మెజారిటీ సాధించబోతోందని కాంగ్రెస్‌ శుక్రవారం పేర్కొంది.

Updated : 25 May 2024 05:53 IST

అయిదేళ్లు ఒకరే పీఎంగా ఉంటారు
కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ వ్యాఖ్యలు

చండీగఢ్, దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి స్పష్టమైన, నిర్ణయాత్మకమైన మెజారిటీ సాధించబోతోందని కాంగ్రెస్‌ శుక్రవారం పేర్కొంది. కూటమి తరఫున ప్రధానమంత్రిగా అయిదేళ్లపాటు ఒక్కరే ఉంటారని స్పష్టం చేసింది. జూన్‌ 4న ఫలితాలు వెలువడిన మూడు రోజుల్లోనే ఇండియా కూటమి నుంచి ప్రధాన మంత్రి పేరును వెల్లడిస్తామని ప్రకటించింది. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ శుక్రవారం చండీగఢ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒకవేళ అధికారంలో వస్తే ఏడాదికి ఒకరు చొప్పున ప్రధానమంత్రి పదవిని నిర్వహించాలని ఇండియా కూటమి ఆలోచన చేస్తోందంటూ ప్రధాని మోదీ పదే పదే విమర్శిస్తుండటంపై జయరాం రమేశ్‌ స్పందించారు. 20 ఏళ్ల తరవాత 2004లో లాగ ఇండియా కూటమి విస్పష్టమైన మెజారిటీ సాధించి చరిత్ర సృష్టించబోతోందని పేర్కొన్నారు.  కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్నది భాగస్వామ్య పక్షాలన్నీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎంపిక చేస్తాయని వివరించారు.  

మోదీ ప్రధాని అయ్యాక ఎంఎస్‌పీకి వ్యతిరేకిగా మారారు

పంజాబ్‌లో ఆందోళన చేస్తున్న రైతులను భాజపా అవమానిస్తోందని, దేశం పట్ల వారి విధేయతను ప్రశ్నిస్తోందని కాంగ్రెస్‌ విమర్శించింది. ఈ పరిణామంపై ప్రధాని మోదీ క్షమాపణలు చెబుతారా? అని నిలదీసింది. పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో ప్రధాని ర్యాలీల నేపథ్యంలో జైరాం రమేశ్‌ పలు ప్రశ్నలు సంధించారు. ‘‘పంజాబ్‌లో వ్యవసాయానికి అందించే విద్యుత్‌ సరఫరాకు ముప్పు ఎందుకు పొంచి ఉంది. కనీస మద్ధతు ధర (ఎంఎస్‌పీ)కు మద్దతుదారుగా ఉండే ప్రధాని ప్రస్తుతం ఎందుకు మారిపోయారు. పదవి నుంచి దిగిపోనున్న ప్రధాని తరచూ అన్నదాతలను ఎందుకు కించపరుస్తున్నారు?’’అంటూ జైరాం రమేశ్‌ ‘ఎక్స్‌’లో నిలదీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని