అర్ధరాత్రి పెట్రోలు పోసి.. తెదేపా నేత కారు దహనం

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడులోని తెదేపా నేత చిగురుపాటి శేషగిరిరావు కారును గుర్తుతెలియని దుండగులు దహనం చేశారు.

Published : 26 May 2024 04:43 IST

పూర్తిగా దహనమైన వాహనం

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడులోని తెదేపా నేత చిగురుపాటి శేషగిరిరావు కారును గుర్తుతెలియని దుండగులు దహనం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శేషగిరిరావు కుటుంబం నిద్రిస్తుండగా శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి బయట నిలిపి ఉన్న కారుపై పెట్రోలు పోసి నిప్పంటించి పారిపోయారు. మంటలను గమనించిన చుట్టుపక్కలవారు బాధితులకు సమాచారమిచ్చి అదుపులోకి తెచ్చారు. అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. అదే ప్రాంతంలో నివసిస్తున్న ఈశ్వరరెడ్డి ఈ ఘటనకు పాల్పడి ఉంటాడని బాధితుడు ఆరోపించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. 

వైకాపా పనేనని ఎమ్మెల్యే డోలా మండిపాటు

ఈ ఘటనపై కొండపి తెదేపా ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి స్పందిస్తూ.. ఎన్నికల్లో ఓటమి భయంతో వైకాపా నాయకులు తెదేపా నేతలపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. శేషగిరిరావు కారును దహనం చేయడం అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. వైకాపాకు చెందిన కొండపి అసెంబ్లీ, ఒంగోలు ఎంపీ అభ్యర్థులు దాడులను ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి తెదేపా అండగా ఉంటుందని చెప్పారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని