కండ్లకుంటలో పుట్టడమే పాపమా?

తెదేపా ఏజెంట్‌గా పోలింగ్‌బూత్‌లో కూర్చున్నందుకు మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి తన భార్యాపిల్లల్ని కొట్టారని, తనను బూత్‌లో నుంచి బయటికి లాగి, చంపేస్తానని బెదిరించారని వెల్దుర్తి మండలంలోని పిన్నెల్లి స్వగ్రామం కండ్లకుంట తెదేపా ఏజెంట్ నోముల మాణిక్యరావు పోలింగ్‌ రోజు జరిగిన ఘటనను గుర్తుచేశారు.

Published : 26 May 2024 04:44 IST

నచ్చిన పార్టీకి ఏజెంట్‌గా  కూర్చునే స్వేచ్ఛ లేదా?
భార్యాపిల్లలను కొట్టి, వీడియోకాల్‌లో చూపిస్తూ బెదిరింపులు
పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి అరాచకాలకు బలైన తెదేపా ఏజెంట్‌ మాణిక్యరావు ఆవేదన

ఈనాడు, అమరావతి: తెదేపా ఏజెంట్‌గా పోలింగ్‌బూత్‌లో కూర్చున్నందుకు మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి తన భార్యాపిల్లల్ని కొట్టారని, తనను బూత్‌లో నుంచి బయటికి లాగి, చంపేస్తానని బెదిరించారని వెల్దుర్తి మండలంలోని పిన్నెల్లి స్వగ్రామం కండ్లకుంట తెదేపా ఏజెంట్ నోముల మాణిక్యరావు పోలింగ్‌ రోజు జరిగిన ఘటనను గుర్తుచేశారు. ఇలాంటి గ్రామంలో పుట్టడమే తమ దౌర్భాగ్యమని ఆవేదనతో చెప్పారు. ‘‘మాది మాచర్ల నియోజకవర్గం కండ్లకుంట గ్రామం. పోలింగ్‌ రోజు బూత్‌ నంబరు 114లో తెదేపా ఏజెంట్‌గా ఉన్నా. ఉదయం 11 గంటల సమయంలో ఎమ్మెల్యే సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి వచ్చి మా సొంతూళ్లో తెదేపా ఏజెంటుగా కూర్చోవడానికి నీకెంత ధైర్యం అంటూ బూతులు తిట్టారు. బయటకు వెళ్లకపోతే సాయంత్రం 5 గంటలకల్లా చంపేస్తానని హెచ్చరించారు. నేను విననట్లుగా ఉంటే పక్కనే ఉన్న వైకాపా చీఫ్‌ ఏజెంట్‌ దేశిరెడ్డి నాసర్‌రెడ్డి ‘చెబుతున్నది నీకే.. వినిపిస్తోందా’ అని గట్టిగా చెప్పారు. ‘ఏంటండీ ఈ అరాచకం నచ్చిన పార్టీకి ఏజెంటుగా ఉండకూడదా?’ అని ప్రశ్నించాను. ‘హక్కుల గురించి మాట్లాడితే చంపేస్తా, ఇక్కడే చంపేస్తే అడ్డెవరు’ అని వెంకట్రామిరెడ్డి బెదిరించారు. నా పక్కనే ఉన్న తెదేపా ఏజెంటు తాడిపర్తి శ్రీకాంత్‌రెడ్డి మనల్ని చంపేస్తారని భయాందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని బయట ఉన్న డీఎస్పీ జగదీష్‌కు చెబితే సాయంత్రం 6 గంటల వరకు తాము ఇక్కడే ఉండి కాపాడతామని చెప్పారు. వెబ్‌కాస్టింగ్‌ కెమెరా వద్దకు వెళ్లి ఈ విషయం చెబుతుంటే రికార్డు కాలేదు. పోలింగ్‌ సిబ్బందికి చెబితే విద్యుత్తు సరఫరా లేదని, వస్తుందిలే అంటూ వదిలేశారు. బయటికి వచ్చి చూస్తే 300 మంది మారణాయుధాలతో కనిపించారు. వాళ్లు మమ్మల్ని చంపడానికే వచ్చారని అర్థమైంది. పోలీసులు ఉన్నందున వారు వెనకడుగు వేయడంతో లోపలికి వచ్చి కూర్చున్నా. ఈలోగా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి అనుచరులతో గ్రామంలోకి వెళ్లి మా పెద్దబ్బాయి చందూను పిలిచి, కొట్టారు. అడ్డుకోబోయిన మా చిన్నబ్బాయి సాల్మన్‌రాజు, నా భార్యను కూడా కొట్టారు. ఆ దృశ్యాలను బూత్‌లో ఉన్న వైకాపా ఏజెంట్‌ నాసర్‌రెడ్డికి వీడియో కాల్‌ చేసి నాకు చూపించారు. పోలీసులు వెళ్లిన తర్వాత వీళ్లను చంపేద్దామని కొందరు అనుచరులను అక్కడ పెట్టి వెంకట్రామిరెడ్డి బూత్‌ వద్దకు వచ్చారు. నా చొక్కా పట్టుకుని ‘ఇంకా బూత్‌లో నుంచి రావా? నీ బలుపు ఏందిరా?’ అని బయటకు లాగారు. అక్కడే ఉన్న డీఎస్పీని.. మమ్మల్ని చంపేసినా ఇంతే ఉంటారా అని అడిగాను. ఆయన నన్ను తన వాహనంలో ఎక్కించుకుని వెల్దుర్తి పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. అయినా వదలకుండా పిన్నెల్లి గూండాలు గుండ్లపాడు వరకు వాహనాల్లో వెంటాడారు. ఈలోగా బూత్‌లో ఉన్న మరో తెదేపా ఏజెంట్‌ అన్నపురెడ్డి హనిమిరెడ్డి పొలాల్లోకి పరిగెత్తి వారినుంచి తప్పించుకున్నారు. డీఎస్పీ లేకపోతే మమ్మల్ని అక్కడే చంపేసేవారు’ అని మాణిక్యరావు ఆవేదనగా చెప్పారు.‘వెల్దుర్తి పోలీసుస్టేషన్‌కు చేరుకున్న తర్వాత నా భార్యాబిడ్డలను పిన్నెల్లి అనుచరులు చంపేస్తారని.. కాపాడాలని డీఎస్పీ, ఎస్పీకి విన్నవించినా పట్టించుకోలేదు. పిల్లలకు ఫోన్‌ చేసి దేవుడి మీద భారం వేసి ఎలాగోలా గ్రామం దాటి రావాలని చెప్పాను. వారెలాగో తప్పించుకుని బయటపడ్డారు’ అని ఆయన వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని