పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ మనదే

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే) భారత్‌లో అంతర్భాగమేనని, దానిని స్వాధీనం చేసుకుంటామని కేంద్ర హోంమంత్రి, భాజపా అగ్రనేత అమిత్‌ షా విస్పష్టం చేశారు.  పొరుగు దేశం వద్ద అణు బాంబులున్నాయని చెబుతూ మనల్ని భయపెట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.

Published : 26 May 2024 05:14 IST

స్వాధీనం చేసుకోవడం తథ్యం
ఎన్నికల సభలో అమిత్‌ షా

శిమ్లా: పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే) భారత్‌లో అంతర్భాగమేనని, దానిని స్వాధీనం చేసుకుంటామని కేంద్ర హోంమంత్రి, భాజపా అగ్రనేత అమిత్‌ షా విస్పష్టం చేశారు.  పొరుగు దేశం వద్ద అణు బాంబులున్నాయని చెబుతూ మనల్ని భయపెట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అమిత్‌ షా ప్రసంగించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని దృఢమైన ప్రభుత్వం మాత్రమే ఉగ్రవాదాన్ని నిర్మూలించగలదని, దేశ ఆర్థికాభివృద్ధిని సాధించడంతో పాటు నిరుపేదలను ఆదుకోగలదని తెలిపారు. అధికరణం 370ని రద్దు చేసినప్పుడు రక్తపాతం జరుగుతుందని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొందని, అయితే జమ్మూకశ్మీర్‌లో ఒక్క హింసాత్మక ఘటన కూడా లేదన్నారు. మెరుపు దాడులతో ఉగ్రవాదులను వారి గడ్డపైనే హతమార్చామని దీంతో పుల్వామా తరహా ముష్కరుల కుట్రలకు అడ్డుకట్టపడిందని అమిత్‌ షా చెప్పారు. ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని నిర్మూలించగల నేత మోదీ మాత్రమేనని తెలిపారు. ఇండియా కూటమి గెలిస్తే ప్రధాన మంత్రి ఎవరవుతారో తెలుసా అంటూ ప్రజలను వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఒకే ర్యాంకు...ఒకే పింఛను పథకం అమలును కేంద్ర హోంమంత్రి ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ ప్రభుత్వం పింఛనుదారులకు రూ.1.25లక్షల కోట్లను ఇప్పటి వరకూ అందించిందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని