Bhatti Vikramarka: ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే దేశానికి మేలు: భట్టి విక్రమార్క

ఇండియా కూటమి అధికారంలోకి రాగానే చట్టబద్ధంగా రైతులకు కనీస మద్దతు ధర అందిస్తామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

Published : 26 May 2024 19:01 IST

ఫరీద్‌కోట్‌: ఇండియా కూటమి అధికారంలోకి రాగానే చట్టబద్ధంగా రైతులకు కనీస మద్దతు ధర అందిస్తామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్‌కోట్‌ లోక్‌సభ పరిధిలో ఏర్పాటు చేసిన పలు సమావేశాల్లో ప్రసంగించారు. దేశంలో వరి, పత్తి, చెరకు రైతులకు మద్దతు ధర లభించడం లేదని, ప్రధాని మోదీ నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల ధనాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశంలోని నిరుద్యోగులకు అప్రెంటిషిప్ హక్కు కల్పిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొస్తామన్నారు. దేశంలోని పట్టభద్రులు, డిప్లొమా చేసిన వారందర్నీ ఈ పరిధిలోకి తీసుకొస్తామన్నారు.

దేశంలోని పబ్లిక్, ప్రైవేటు సెక్టార్లలో సుమారు 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఆగస్టు 15 లోపు ఇండియా కూటమి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తుందని భట్టివిక్రమార్క హామీ ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ వర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలు, ఆస్పత్రుల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు. కోట్లాది మంది నిరుద్యోగుల ఖాతాల్లో ఏడాదికి రూ.లక్ష నగదును జమచేస్తామన్నారు. ప్రస్తుతం ఉపాధి హామీ కూలీలకు ఇస్తున్న రోజువారి కూలీ.. రూ.250ని రూ.400కి పెంచడంతోపాటు ఆశావర్కర్ల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారు.

గత పదేళ్ల వ్యవధిలో ప్రధాని మోదీ 25 మందికి సంబంధించిన రూ. 16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని, ఆ డబ్బుతో 24 ఏళ్ల పాటు ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయొచ్చని చెప్పారు. భాజపా ప్రభుత్వం 25 మందిని కుబేరులని చేస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం కోట్లాది మంది దేశ ప్రజల్ని లక్షాధికారులని చేస్తుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్‌ను చూసి భాజపా భయపడుతోందని, అందుకే కాంగ్రెస్‌ నేతల్ని టార్గెట్‌ చేస్తూ మోదీ విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఆల్ ఇండియా సర్వీసు అధికారుల్లో ఎస్సీ, ఎస్టీలు ఎంతమందో చెప్పడం లేదని, ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రిజర్వేషన్‌ ప్రకారం పోస్టులు కేటాయిస్తామని చెప్పారు. మహిళలకు జనాభా దామాషా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని