ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు

లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు.

Published : 27 May 2024 03:17 IST

రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారులు, సిబ్బందికి మొదటి విడత శిక్షణ కొనసాగుతోందని.. త్వరలో రెండో విడత శిక్షణ చేపడతామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ (డీఈసీ) నితేశ్‌ కుమార్‌ వ్యాస్‌ ఆదివారం అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులతో దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో ఓట్ల లెక్కింపు అత్యంత కీలకమని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వికాస్‌రాజ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుందని, ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు అమర్చడంతో పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోకుండా జనరేటర్లను అందుబాటులో ఉంచినట్లు వివరించారు. 1,855 కౌంటింగ్‌ టేబుళ్లలో లెక్కింపు జరుగుతుందని, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కోసం 276 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి రౌండ్‌కు డేటా ఎంట్రీ నమోదు చేసి సమాచారం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా వ్యాస్‌ మాట్లాడుతూ తెలంగాణలో ఓట్ల లెక్కింపునకు 47 మంది పరిశీలకులను నియమించినట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల అధికారులు డి.ఎస్‌.లోకేశ్‌కుమార్, సర్ఫరాజ్‌అహ్మద్, సత్యవాణి, అబ్దుల్‌ హమీద్, హరిసింగ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని