డబ్బులు పంచి.. గెలిచేందుకు భారాస యత్నాలు!

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మిగతా ఎన్నికల్లో కుట్రలు చేసి గెలిచేందుకు భారాస ప్రయత్నాలు చేస్తోందని భాజపా నేత, మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఆరోపించారు.

Updated : 27 May 2024 06:30 IST

భాజపా నేత రఘునందన్‌రావు ఆరోపణ

తూప్రాన్, న్యూస్‌టుడే: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మిగతా ఎన్నికల్లో కుట్రలు చేసి గెలిచేందుకు భారాస ప్రయత్నాలు చేస్తోందని భాజపా నేత, మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఆరోపించారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో ఆదివారం ఆయన మాట్లాడారు. కొద్ది రోజుల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మెదక్‌ నియోజకవర్గ పరిధిలో ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ.1000 పంపిణీ చేశారని ఆరోపించారు. ఇదే తరహాలో ఖమ్మం-వరంగల్‌-నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలోనూ నగదు పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 25వ తేదీన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ బ్యాంకులో భారాస అధికారిక ఖాతా నుంచి ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరుగుతున్న మూడు జిల్లాల భారాస ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు, ఇన్‌ఛార్జులకు రూ.30 కోట్లు బదిలీ చేశారని ఆరోపించారు. ఈ విషయమై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌కు మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశామన్నారు. ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించి భారాస అధికారిక ఖాతా నుంచి రూ.30 కోట్లు ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చిందో విచారణ చేపట్టాలన్నారు. ఎన్నికల్లో కుట్రలు చేసేందుకు ప్రయత్నిస్తున్న భారాస గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. స్పందించకపోతే ఎన్నికల తర్వాత రాష్ట్ర ఎన్నికల అధికారులపై సుప్రీంకోర్టుకు వెళతానని చెప్పారు. నగదుతో ఎన్నికల్లో గెలిచేందుకు భారాస చేస్తున్న ప్రయత్నాలపై ఆధారాలతో సహా అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని