కేంద్రమంత్రి పదవి దక్కేదెవరికి?

తొలిసారిగా భాజపా తరఫున రాష్ట్రం నుంచి ఎనిమిది మంది లోక్‌సభ సభ్యులు విజయం సాధించడంతో కేంద్ర మంత్రి పదవులపై నేతల్లో ఆశలు పెరుగుతున్నాయి.

Published : 05 Jun 2024 05:08 IST

రేసులో కిషన్‌రెడ్డి సహా కీలక నేతలు

ఈనాడు, హైదరాబాద్‌: తొలిసారిగా భాజపా తరఫున రాష్ట్రం నుంచి ఎనిమిది మంది లోక్‌సభ సభ్యులు విజయం సాధించడంతో కేంద్ర మంత్రి పదవులపై నేతల్లో ఆశలు పెరుగుతున్నాయి. గత ఎన్నికల్లో రాష్ట్రం నుంచి కిషన్‌రెడ్డి సహా నలుగురు ఎంపీ అభ్యర్థులు గెలుపొందారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన జి.కిషన్‌రెడ్డికి కేంద్రమంత్రి పదవి దక్కింది. ఈ ఎన్నికల్లో కిషన్‌రెడ్డి మరోసారి సికింద్రాబాద్‌ నుంచి విజయం సాధించారు. ఆయనతోపాటు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ కరీంనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి, ధర్మపురి అర్వింద్‌ నిజామాబాద్‌ నుంచి రెండోసారి గెలుపొందారు. మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ నుంచి భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ గెలుపొందారు. వీరంతా తెలంగాణకు సంబంధించి పార్టీలో కీలకంగా ఉన్న నేతలే. దీంతో వీరిలో కేంద్ర మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయనేది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది లోక్‌సభ సభ్యులు విజయం సాధించిన నేపథ్యంలో ఒకరు లేదా ఇద్దరికి మంత్రి పదవులకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. జాతీయ నాయకత్వం తనకే ప్రాధాన్యమిస్తుందనే విశ్వాసంతో ఎవరికి వారు ఉన్నారు. మరి అధినాయకత్వం ఎవరి పట్ల మొగ్గుచూపుతుందో వేచిచూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని